రేవంత్ సమీక్షలో గుర్తుతెలీని వ్యక్తి
సెంటర్ లోపల భద్రతా విషయమే ఉత్తడొల్లని(Security lapses) బయటపడింది.;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతలో లోపాలు బయటపడ్డాయి. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ బుధవారం ఉదయం సమీక్ష నిర్వహించిన సమయంలో భద్రతాలోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్(Revanth) సమీక్షకు చాలామంది ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే సహజంగా రోడ్డుతో పాటు సెంటర్ నాలుగువైపులా హెవీ సెక్యూరిటి ఉంటుంది. సెంటర్ బయట సెక్యూరిటి ఎక్కువగానే ఉంది. కానీ సెంటర్ లోపల భద్రతా విషయమే ఉత్తడొల్లని(Security lapses) బయటపడింది.
రేవంత్ నిర్వహిస్తున్న సమీక్షలోకి గుర్తుతెలీని వ్యక్తి ఒకసారి కాదు మూడుసార్లు వెళ్ళాడు. ఒకవైపు సమీక్ష జరుగుతుండగనే గుర్తుతెలీని వ్యక్తి లోపలికి బయటకు మూడుసార్లు తిరిగాడు. కొంతసేపటి తర్వాత సమీక్ష జరుగుతున్న సెంటర్(Command controll centre) కాంపౌండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతన్ని నిలదీస్తే తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అని బదులిచ్చాడు. సీఎం సెక్యూరిటి డ్యూటీలో ఉన్నట్లు కూడా చెప్పాడు. సదరు వ్యక్తి తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అని చెప్పగానే పోలీసులు వదిలిపెట్టేశారు. ఆ తర్వాత కొంతసేపటికి సెంటర్ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళాడు.
గుర్తుతెలీని వ్యక్తి హోటల్లోకి వెళ్ళటం గమనించిన మరికొందరు పోలీసులకు అనుమానం వచ్చింది. ముఖ్యమంత్రి భద్రతా డ్యూటీలో ఉండగా ఒక కానిస్టేబుల్ హోటల్లోకి ఎలా వెళతాడని ఆరాతీయటం మొదలుపెట్టారు. టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులతో మాట్లాడి గుర్తుతెలీని వ్యక్తి ఇచ్చిన వివరాలను చెప్పగా అలాంటి వ్యక్తి ఎవరూ తమ దగ్గర కానిస్టేబుల్ గా పనిచేయటంలేదని సమాధానం చెప్పటంతో పోలీసు అధికారులకు షాక్ తగిలినట్లయ్యింది. మళ్ళీ పోలీసు అధికారులు సదరు వ్యక్తిగురించి వాకాబుచేయగా అతనిపేరు జ్ఞానసాయి ప్రసాద్ గా తెలిసింది. ప్రసాద్ ను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే అతని ఆచూకీ తెలియలేదు. అందుకనే అతను సెంటర్లో తిరిగిన ప్రాంతాలు, హోటల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి భద్రత అంటే కనీసం వందమంది ఉంటారు. వీరిలో డీఎస్పీ ర్యాంకు అధికారి చీఫ్ సెక్యూరిటి అధికారిగా ఉంటారు. చీఫ్ సెక్యూరిటి అధికారి కాకుండా సీఐ, ఎస్ఐ ర్యాంకుతో పాటు ఆర్మ్ డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి చాలామంది భద్రతలో ఉంటారు. ఇంతమంది భద్రతగా ఉన్న సెంటర్లో రేవంత్ సమీక్ష చేస్తున్న హాలులోకి గుర్తుతెలీని వ్యక్తి మూడుసార్లు వెళ్ళొచ్చాడంటే అర్ధమేంటి ? అతను ఏ ఉద్దేశ్యంతో లోపలికి, బయటకు తిరిగాడో తెలీదు. ఒకవేళ రేవంత్ కు ఏదైనా హానిచేసే ఉద్దేశ్యంతోనే లోపలకు వెళ్ళుంటే ఇంతమంది సెక్యూరిటీ ఉండికూడా ఏమిటి ఉపయోగం ? ఇక్కడే ముఖ్యమంత్రి భద్రతాలోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. అందుకనే పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేయిస్తున్నారు.