Solar Man of Telangana |సోలార్ వెలుగులు నింపిన అశోక్,పాతికేళ్ల జర్నీ

తెలంగాణలోని ఇళ్లలో సౌర వెలుగులు నింపిన అశోక్ కుమార్ కు ప్రభుత్వం ‘సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డును ప్రదానం చేసింది. సోలార్ మ్యాన్ పాతికేళ్ల జర్నీపై స్టోరీ.;

Update: 2025-02-03 03:23 GMT
సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకుంటున్న అశోక్ కుమార్

‘గో గ్రీన్ గో సోలార్, సేవ్ ఎలక్ట్రికల్ పవర్, సేవ్ ఎన్విరాన్ మెంట్’ నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో పాతికేళ్లుగా ఇళ్లలో సౌరశక్తి వెలుగులు నింపుతున్న తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ గౌడ్ కు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టూరిజం భవన్ లో జరిగిన సోలార్ టెక్నికల్ సెమినార్ లో ‘సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’(Solar Man of Telangana) అవార్డును ప్రదానం చేశారు.

- గత 25 సంవత్సరాలుగా సౌరశక్తి రంగంలో చేసిన అద్భుతమైన కృషికి గాను తెలంగాణ రెన్యూవబుల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సంస్థలు ఈ అవార్డును బుర్రా అశోక్ కుమార్ గౌడ్ కు అందించాయి. రాష్ట్రంలో సోలార్ వ్యాప్తి కోసం చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా ఆయనకు రెన్యువబుల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జీఎం ప్రసాద్,తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (టీజీఎస్పీడీసీఎల్) సీజీఎం చక్రపాణి లు ఈ అవార్డును అందించారు.
- సోలార్ మ్యాన్ అయిన బుర్ర అశోక్ కుమార్ గౌడ్ పాతికేళ్ల సోలార్ జర్నీ గురించి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆ విశేషాలు...ఆయన మాటల్లోనే...



  ఇన్వర్టర్లు, జనరేటర్ల ప్రత్యామ్నాయంగా సోలార్ ఎనర్జీకి...

‘‘ఇన్వర్టర్లు, బ్యాకప్, జనరేటర్ల కంపెనీ యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ పేరిట 2000 సంవత్సరంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశాను.2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండటంతో సోలార్ వైపు మళ్లాను. పవర్ బ్యాటరీలకు గుడ్ బై చెప్పి సోలార్ వపర్ వైపు దృష్టి సారించాను. తెలంగాణలో పాతికేళ్లుగా పదివేల ఇళ్లలో సౌరశక్తి వెలుగులు నింపగలిగాను.

పవర్ గ్రిడ్ కనెక్టివిటీతో సోలార్ ఎనర్జీకి నెట్ మీటరింగ్
సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పవర్ గ్రిడ్ కనెక్షన్ ఇచ్చి నెట్ మీటరింగ్ ద్వారా సోలార్ విద్యుత్ యూనిట్ కు నాలుగున్నర రూపాయల చొప్పున విద్యుత్ కంపెనీ చెల్లిస్తుండటంతో తెలంగాణలోని ఇళ్లలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. వేలరూపాయల విద్యుత్ బిల్లులు వస్తుండటంతో దీన్ని నివారించుకునేందుకు వీలుగా ఇళ్ల రూఫ్ టాప్ పై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయడం ద్వారా సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నాం.



 అందుబాటులోకి వచ్చిన అధునాతన సోలార్ పరికరాలు

సోలార్ రంగంలో అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త టెక్నాలజీ సహకారంతో సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు మన్నికగా పనిచేస్తున్నాయి. సోలార్ పరికరాల్లో పాలీక్రిస్ లైన్ టెక్నాలజీ బదులు కొత్తగా బైఫిషియల్ మాడ్యూల్ అందుబాటులోకి వచ్చింది. సౌర శక్తితోపాటు వెలుతురు నుంచి వచ్చే రిఫ్లిక్షన్ సహాయంతో కూడా సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసే పద్ధతి అందుబాటులోకి వచ్చాయి.

సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం
దేశంలో కోటి గృహాల్లో సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద సౌర వెలుగులు ప్రసరింపజేసేందుకు పీఎం సూర్యఘర్ ను కేంద్రప్రభుత్వం అమలు చేస్తోంది. సౌరశక్తి ఒక కిలోవాట్ కు రూ.30వేలు, రెండు కిలోవాట్లకు రూ.60వేలు, మూడు నుంచి పది కిలోవాట్ల సోలార్ ఎనర్జీ ఉత్తత్తిపై రూ.78 వేలను సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం వల్ల తెలంగాణలో ఎక్కువ మంది ప్రజలు సోలార్ ఎనర్జీని పెట్టుకునేందుకు ముందుకు వస్తున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. దీంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు సోలార్ ఎనర్జీ ఏర్పాటుపై రుణాలు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

పదివేల గృహాల్లో సోలార్ వెలుగులు
తెలంగాణ రాష్ట్రంలో పదివేల గృహాల్లో సోలార్ వెలుగులు నింపాను. కేంద్ర ప్రభుత్వం చేయూతతో సోలార్ పవర్ ఉత్పత్తి పెరుగుతోంది. గతంలో హైదరాబాద్ నగరానికే పరిమితమైన సోలార్ ఎనర్జీ ప్రస్థుతం జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు సోలార్ ఎనర్జీ విస్తరించింది. నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రజలు సోలార్ ఎనర్జీని ఇళ్లలో ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పదివేల మందికి విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి కల్పించగలిగాను.

రాష్ట్రం కూడా చేయూత ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ కోరింది. సోలార్ ఎనర్జీ అసోసియేషన్ సభ్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.మూడు కిలోవాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం 100 కిలోల బొగ్గు అవసరం అవుతుంది. బొగ్గు వెలికితీయడం వల్ల భూకంపాలు వచ్చే ప్రమాదముంది. అందువల్ల సహజ సిద్ధంగా సౌరశక్తితో ఉత్పత్తి చేసే సోలార్ ఎనర్జీ వల్ల పర్యావరణానికి సమస్య ఉండదు.



 తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్

తెలంగాణ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ (TSEA)ను గుర్తించి ఈ సంవత్సరం జీ20 ఎనర్జీ ట్రాన్సిషన్స్ మినిస్టీరియల్ మీటింగ్ లో పాల్గొనేందుకు ఎంపిక చేసింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌర వ్యవస్థాపకులకు సరైన మార్గదర్శకం లేదు. సౌర వ్యాపార సంస్థల మనుగడ కోసం ఈ రంగం సమస్యలను పరిష్కరించేందుకు బి. అశోక్ కుమార్ గౌడ్ సౌర పంపిణీదారులు,డీలర్లు, ఇంటిగ్రేటర్లు, అన్ని సౌర సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి తెలంగాణ సౌరశక్తి సంఘాన్ని ఏర్పాటు చేశారు.
సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వచ్చిన స్ఫూర్తితో ఇక ముందు రాష్ట్రంలో సోలార్ ఎనర్జీని ఇళ్లలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను ఈ అవార్డు నాకు బాధ్యతను పెంచింది. తెలంగాణలో సూర్యభగవానుడు ప్రసాదించిన సౌరశక్తిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి సోలార్ వెలుగులు ఇంటింటా నింపాలనేదే నా జీవిత లక్ష్యం’’ అని సోలార్ మ్యాన్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ వివరించారు.


Tags:    

Similar News