Notices to BRS defected MLAs | బీఆర్ఎస్ ఫిరాయింపులకు స్పీకర్ నోటీసులు
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్(Telangana Congress) లోకి ఫిరాయించిన(BRS defected MLAs) వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని జారీచేసిన నోటీసుల్లో స్పీకర్ అడిగారు.;
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే బీఆర్ఎస్(BRS) నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలకు అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీచేశారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్(Telangana Congress) లోకి ఫిరాయించిన(BRS defected MLAs) వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని జారీచేసిన నోటీసుల్లో స్పీకర్ అడిగారు. ఇంతకాలం ఫిరాయింపు ఎంఎల్ఏలపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈనేపధ్యంలోనే సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారమే ఫిరాయింపులకు స్పీకర్ కార్యాలయం అందరికీ నోటీసులు జారీచేసింది. అయితే నోటీసుల్లో పలానా తేదీలోగా జవాబు చెప్పాలని స్పీకర్(Assembly Speaker) అడగలేదని సమాచారం.
నోటీసులు అందుకున్న తర్వాత ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏమిచేస్తారు ? ఎలాంటి సమాధానాలు ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఫిరాయింపుల్లో చాలామంది తాము పార్టీ ఫిరాయించామని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నారు. ఇప్పటికే ఫిరాయింపుల్లో చాలామంది అంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధి లాంటి వాళ్ళు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని చాలాసార్లు చెప్పారు. ఈ నేపధ్యంలోనే స్పీకర్ నోటీసులకు ఫిరాయింపులు ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాలి.
నోటీసులు అందాయి : బండ్ల
ఇదే విషయమై గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతు హైదరాబాదులోని తన ఆఫీసుకు స్పీకర్ కార్యాలయం నుండి ఏదో కవర్ వచ్చినట్లు తనకు సమాచారం అందిందన్నారు. తాను అవుటాఫ్ టౌన్ లో ఉన్నానని హైదరాబాద్ కు చేరుకోగానే స్పీకర్ కార్యాలయం నుండి వచ్చింది ఏమిటో చూడాలన్నారు. కవర్లో నోటీసులు ఉంటే దానికి తాను తప్పకుండా సమాధానం ఇస్తానని కూడా బండ్ల చెప్పారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, అయితే నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసినట్లు తెలిపారు. ఏ పార్టీ ఎంఎల్ఏ అయినా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సిందే కదా అని ఎదురు ప్రశ్నించారు. తాను సీఎంను కలిసి కాంగ్రెస్ కండువా కప్పున్నట్లు ఎవరైనా చూపించగలరా ? అని నిలదీశారు.
బీఆర్ఎస్ లోనే ఉన్నాను : గాంధీ
తాను పార్టీమారలేదని శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఇదే విషయమై బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడికౌశిక్ రెడ్డితో గాంధీకి పెద్ద గొడవే అయ్యింది. తాను ప్రతిపక్ష ఎంఎల్ఏని కాబట్టే స్పీకర్ తనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటి(పీఏసీ) ఛైర్మన్ పదవి ఇచ్చినట్లు సమర్ధించుకున్నారు. తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏనే అని, కాంగ్రెస్ లోకి ఫిరాయించానని జరుగుతున్న ప్రచారం తప్పని గాంధీ చెప్పారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఎంఎల్ఏల సంగతి ఎలాగున్నా ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ మాత్రం అడ్డంగా బుక్కయినట్లే. ఎలాగంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్న దానం 2024 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్నపుడు కాంగ్రెస్ ఎంపీగా ఎలాగ పోటీచేస్తావని అడిగితే సమాధానం చెప్పటానికి దానం దగ్గర ఏమీ ఉండదు. కాబట్టే మిగిలిన తొమ్మిది మంది ఫిరాయింపుల సంగతి పక్కన పెట్టేస్తే దానం మాత్రం ఫిరాయింపుల నోరధక చట్టంలో బుక్కవటం ఖాయమని అర్ధమవుతోంది.