ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్

విద్యార్ధులు లేక బడులు మూసేసినంత మాత్రాన టీచర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదు;

Update: 2025-05-22 10:17 GMT
Government and Private schools in Telangana

ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అడ్మిషన్లు పెంచుకునే విషయంలో ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉంటే విద్యార్ధుల సంఖ్య మరింత తగ్గిపోవటమే కాకుండా వేలాది స్కూళ్ళు పిల్లలు లేక మూతపడే ప్రమాదం వచ్చిపడింది. స్కూళ్ళు మూసివేత అనే కత్తి తమ మెడలమీద వేలాడుతోంది అన్న విషయం టీచర్లలో చాలామందికి బాగా అర్ధమైపోయింది. విద్యార్ధులు లేక బడులు మూసేసినంత మాత్రాన టీచర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే బడులను మూసేస్తే మూతేసిన బడుల్లో పనిచేస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఇంకెక్కడికో ట్రాన్స్ ఫర్ అయిపోతారు. నెలతిరిగేసరికి జీతాలు అందుకోవాలి కాబట్టి కచ్చితంగా ప్రభుత్వం ఎక్కడికి బదిలీచేసినా వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే తప్ప వేరే దారిలేదు. అందుకనే టీచర్లు మేల్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల అడ్మిషన్లను పెంచటంకోసం ఈనెల 25వ తేదీనుండి వారంరోజులు అంటే 31వ తేదీవరకు ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. ఈప్రత్యేక డ్రైవ్ తెలంగాణ స్టేట్ టీచర్స్ యునైటెడ్ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) ఆధ్వర్యంలో మొదలవ్వబోతోంది.

తెలంగాణలో ప్రభుత్వబడులు విచిత్రమైన పరిస్ధితులను ఎదుర్కొంటున్నాయి. ఎలాగంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, సంక్షేమ స్కూళ్ళు, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్ళు మొత్తం కలిపి 29,500 ఉంటే చదువుతున్న విద్యార్ధుల సంఖ్య సుమారు 24 లక్షలు. ఇదేసమయంలో రాష్ట్రంమొత్తంమీద ఉన్న ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య సుమారు 36 లక్షలు. అంటే ప్రభుత్వ స్కూళ్ళ సంఖ్యకు చదువుతున్న విద్యార్ధులకు, ప్రైవేటు స్కూళ్ళ సంఖ్యకు చదువుతున్న విద్యార్ధుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదని అర్ధమైపోతోంది. 29,500 స్కూళ్ళల్లో 24 లక్షలమంది విద్యార్ధులు మాత్రమే చదవటం ఏమిటి ? 11 వేల ప్రైవేటుస్కూళ్ళల్లో 36 లక్షలమంది పిల్లలు చదువుతుండటం ఏమిటి ? ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళ సంఖ్య, చదువుతున్న విద్యార్ధుల సంఖ్యలను గమనిస్తే పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో విద్యారంగం ముఖ్యంగా ప్రాధమిక విద్యారంగం ఏమేరకు డెవలప్ అయ్యిందో అర్ధమైపోతోంది.

ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యు అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని వేలాది స్కూళ్ళు పూర్తిగా మూతపడటానికి ఎంతోకాలం పట్టదన్న విషయం అందరికీ అర్ధమైంది. ప్రైమరి స్కూళ్ళల్లో 50 కన్నా తక్కువమంది చదువుతున్న స్కూళ్ళు 12 వేలున్నాయి. అందుకనే సర్కార్ బడుల్లో పిల్లల అడ్మిషన్లను పెంచాల్సిన అవసరం కాదు అత్యవసరం ఉందని టీఎస్ యూటీఎఫ్ గుర్తించింది. అందుకు ఫెడరేషన్ తానే నడుంబింగించి రంగంలోకి దిగబోతోంది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో వారంరోజుల పాటు వేలాదిమంది టీచర్లు ప్రత్యేక డ్రైవ్ లో పాల్గొనబోతున్నారు. ఒకపుడు వందలమంది పిల్లలతో కళకళలాడిన సర్కార్ బడులు ఇపుడు పిల్లలకోసం వెతుక్కోవాల్సిన దుస్ధితిని ఎదుర్కొంటున్నాయి. దీనికి ముఖ్యకారణం ప్రభుత్వంలోని పెద్దలనే చెప్పాలి. విద్యారంగం బలోపేతానికి సరైన చర్యలు తీసుకోని కారణంగానే ఇపుడు ప్రభుత్వ స్కూళ్ళు విద్యార్ధులు లేక నానా అవస్తలుపడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళు విశాలమైన కాంపౌండ్లు, అన్నీ అర్హతలు కలిగిన మంచి ట్రైన్డ్ టీచర్లు, పెద్దజీతాలు, మధ్యాహ్న భోజనం, పిల్లలకు ఉచితంగా స్టడీ మెటీరియల్, పుస్తకాలను ప్రభుత్వం సరఫరా, నామమత్రపు ఫీజులే అయినా ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్ధుల అడ్మిషన్లు పెరగకపోగా నానాటికి ఎందుకు తగ్గిపోతున్నట్లు ?

ఇదేసమయంలో అరాకొరా వసతులు, అర్హతలు కలిగిన టీచర్ల సంఖ్య తక్కువగాను, ప్లేగ్రౌండ్ వంటి సదుపాయాలు లేకపోయినా, ఇరుకిరుకు గదులు, టీచర్లకు జీతాలు సరిగా లేకపోయినా, వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తు విద్యార్ధులు లక్షలమంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారు ? ఎందుకంటే, కమిట్మెంట్ లేకపోవటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. విద్యార్ధులు ఉన్నా లేకపోయినా, పాఠాలు సరిగాచెప్పినా చెప్పకపోయినా, ఉత్తీర్ణతశాతం పెరగకపోయినా, స్కూళ్ళకు సరిగా హాజరుకాకపోయినా తమ జీతాలైతే తమకు వచ్చేస్తాయనే భావన కొందరు ప్రభుత్వ టీచర్లలో బలంగా ఉంది. ఉద్యోగంలో నుండి తీసేయలేరన్న ధీమా ప్రభుత్వ టీచర్లలో బాగా పెరిగిపోయింది. పైన చెప్పిన ఆలోచనలతో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య తక్కువే. చాలామంది టీచర్లు కష్టపడి, క్రమశిక్షణతో స్కూళ్ళకు అటెండ్ అవుతు, పిల్లలు మంచిగా చదువుకుని పాస్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో చదువుచెప్పే టీచర్ల సంఖ్యే ఎక్కువ. అయితే మొదటిచెప్పిన పద్దతిలో పనిచేసే టీచర్ల వల్ల సిన్సియర్ గా పనిచేసే టీచర్ల మీద కూడా ప్రభావం పడుతోంది.

ఎప్పుడైతే టీచర్లు సరిగా పాఠాలు చెప్పటంలేదో, పాస్ పర్సెంటేజ్ తగ్గిపోతోందో మధ్యాహ్న భోజనంలేకపోయినా, ఫీజులు వేలల్లో ఉన్నా, అప్పోసొప్పోచేసైనా సరే ఫీజులు కట్టి తమపిల్లలను ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పిస్తున్న తల్లి, దండ్రుల సంఖ్య పెరిగిపోతున్నది. గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత బాగానే ఉన్నా, సమస్యంతా జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్ళదగ్గరే వస్తోంది. గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, సంక్షేమ స్కూళ్ళల్లో పిల్లల అడ్మిషన్లు బాగానే ఉన్నాయి, టీచర్లు పాఠాలు బాగానే చెబుతున్నారు కాబట్టి ఉత్తీర్ణత శాతం కూడ సంతృప్తిగానే ఉంది. బీఆర్ఎస్ హయంలో టీచర్ల నియామకాలు సరిగా జరగక, స్కూళ్ళ బాగోగులు పట్టించుకోక, స్కూళ్ళలో సౌకర్యాలను పెంచకపోవటంతోనే విద్యార్ధులసంఖ్య బాగాపడిపోయింది. గడచిన రెండు విద్యాసంవత్సరాల్లోనే సుమారు 3 లక్షలమంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ళను వదిలేసి ప్రైవేటు స్కూళ్ళల్లో చేరారంటేనే అర్ధమైపోతోంది అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ స్ధాయిలో ఉండేదో.

వ్యూహం మార్చిన ప్రభుత్వం

తమ స్కూళ్ళల్లో పిల్లల అడ్మిషన్లు పెంచటానికి ప్రభుత్వం వ్యూహం మార్చింది. అదేమిటంటే వచ్చే విద్యాసంవత్సరం నుండి స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరి, ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని డిసైడ్ చేసింది. సమస్యంతా ఎక్కడుందంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కడా ప్రీ ప్రైమరి, ప్రైమరి తరగతులు లేవు. ప్రభుత్వ స్కూళ్ళల్లో చేరాలంటే పిల్లలు డైరెక్టుగా 1వ తరగతిలో చేరటమే. ఇదేసమయంలో ప్రతి ప్రైవేటుస్కూలులోను ప్రీప్రైమరి, ప్రైమరి తరగతులుంటాయి. మీరు ఎక్కడన్నా గమనించండి చాలా ఇళ్ళల్లో పిల్లలకు మూడేళ్ళు నిండేటప్పటికి తల్లి,దండ్రులు పిల్లలను తీసుకెళ్ళి ప్రీప్రైమరి, ప్రైమరి తరగతుల్లో చేర్పించేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిల్లలకు 5 ఏళ్ళు నిండితే కాని స్కూల్లో వేసేందుకు లేదు. ఈరూలును ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే ఫాలో అవుతున్నాయి. ఏప్రైవేటు స్కూలూ ఫాలో అవటంలేదు. రూలు ప్రభుత్వ స్కూలుకైనా, ప్రైవేటుస్కూలుకైనా ఒకటే. తాను విధించిన రూలును ప్రైవేటుస్కూళ్ళు ఏవీ పాటించటంలేదని ప్రభుత్వానికి బాగా తెలిసినా పట్టించుకోవటంలేదు.

ఈరూలే ప్రభుత్వ స్కూళ్ళపాలిట పెద్ద శాపమైపోయింది. ఎందుకంటే ఏతల్లి, దండ్రులైనా ప్రీప్రైమరి, ప్రైమరి ఏ స్కూలులో అయితే చేర్పిస్తారో అదేస్కూలులో తర్వాత సంవత్సరాలు కూడా కంటిన్యుచేయటానికే మొగ్గుచూపుతారు. ప్రైప్రైమరి, ప్రైమరి లేకుండా డైరెక్టుగా 1వ తరగతిలోనే చేర్పించాలనే నిబంధన వల్ల చాలామంది తల్లి, దండ్రులు ప్రభుత్వ స్కూళ్ళవైపు చూడటంలేదు. పిల్లలకు 5 ఏళ్ళు నిండేవరకు ఇళ్ళల్లో పిల్లలను భరించే తల్లి, దండ్రులు ఎంతమంది ఉంటున్నారు ఇపుడు ? అందుకనే ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ప్రీప్రైమరి, ప్రైమరి తరగతులను వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీన్ని టీఎస్ టీయూఎఫ్ అడ్వాంటేజ్ గా తీసుకుని బాగా ప్రచారంచేయాలని నిర్ణయించింది.

ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రీప్రైమరి, ప్రైమరి తరగతులు ప్రారంభించాలని ఎప్పటినుండో ఫెడరేషన్ ప్రభుత్వంపై ఒత్తిడితెస్తోంది. 2025-26 విద్యాసంవత్సరంలో ముందుగా వెయ్యి బడుల్లో ప్రీప్రైమరి, ప్రైమరి తరగతులు ప్రారంభించబోతోంది. ప్రీప్రైమరి, ప్రైమరి తరగతులను అంగన్వాడి కేంద్రాల్లో ఏర్పాటుచేయబోతోంది. ఇందుకోసం ప్రతిజిల్లాలోను 50 అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్లేస్కూల్ నడిపి చిన్నపిల్లలకు స్కూలంటే భయం పోగొట్టేలా అవసరమైన యాక్టివిటీస్ చేయించేందుకు ప్రత్యేకంగా ఇన్ స్ట్రక్టర్లు, ఆయాలను కూడా నియమించింది.

నోట్ బుక్స్ పంపిణీ

ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మాత్రమే ఉచితంగా పుస్తకాలను పంపిణీచేస్తున్నది. కొత్త విద్యాసంవత్సరం నుండి 1వ తరగతి నుండే పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయబోతోంది. ఈ మేరకు జిల్లాల డీఈవోల నుండి అవసరమైన ఇండెంట్లు కూడా విద్యాశాఖ తెప్పించుకున్నది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల తల్లి, దండ్రులపైన ఆర్ధికభారం తగ్గుతుందన్నది వాస్తవం. టీచర్ల స్కిల్స్ పెంచేందుకు టీచర్లందరికీ ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్(ఏఐ) విషయంలో కూడా వేలాదిమంది టీచర్లకు ప్రభుత్వం శిక్షణ మొదలుపెట్టింది. జూన్12వ తేదీనుండి కొత్త విద్యాసంవత్సరం మొదలవ్వబోతోంది. అడ్మిషన్లు పెంచుకునేందుకు జూన్ 6 నుండి 19వ తేదీవరకు బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా టేకప్ చేయబోతోంది. ఈకార్యక్రమంలో మహిళాసంఘాలు, ఓల్డ్ స్టూడెంట్స్ ను భాగస్వామ్యం చేయబోతున్నది.

పిల్లలను ప్రభుత్వ బడుల్లోకి మళ్ళించాలి: ఎంఎల్సీ పింగిళి

‘బడిఈడు పిల్లలందరినీ ప్రైవేటు స్కూళ్ళవైపు కాకుండా ప్రభుత్వ స్కూళ్ళవైపు మళ్ళించాల’ని టీచర్ ఎంఎల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి పిలుపిచ్చారు. ఇందుకోసం టీచర్లంతా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ‘అడ్మిషన్లు పెంచేందుకు టీచర్లు చేయబోయే చర్యలకు తాను అన్నివిధాలుగా సాయంగా ఉంటాన’ని మాటిచ్చారు. ఇప్పటికే పీఆర్టీయూ కార్యకర్తలతో ఈవిషయమై తానుమాట్లాడినట్లు కూడా ఎంఎల్సీ చెప్పారు. ‘నాణ్యమైన విద్యను అందించటంతో పాటు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న సౌకర్యాలను టీచర్లు పిల్లల తల్లి, దండ్రులకు వివరించాల’న్నారు. ప్రభుత్వస్కూళ్ళల్లో అడ్మిషన్లు పెంచేలా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో తానూ పాల్గొంటానని శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

20 వేలమంది టీచర్లతో డ్రైవ్ : రవి

ఇదే విషయమై టీఎస్ టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘తమ యూనియన్ తరపున పిల్లల అడ్మిషన్లు పెంచేందుకు ప్రైత్యేక డ్రైవ్ చేపట్టి’నట్లు చెప్పారు. ‘ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రీప్రైమరి, ప్రైమరి తరగతుల్లో అడ్మిషన్లు తీసుకోకపోతే పిల్లల సంఖ్య పెరగద’ని బల్లగుద్ది మరీ చెప్పారు. ప్రైవేటు స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరగటానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పారు. ‘2021 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్ళల్లో 1 తరగతి అడ్మిషన్లు బాగా దెబ్బతిన్నా’యని చెప్పారు. ‘2021 విద్యాసంవత్సరంలో 1వ తరగతిలో 1.24 లక్షల మంది పిల్లలు చదివితే ఇందులో లక్షమంది ప్రైవేటు స్కూళ్ళల్లోను, కేవలం 24వేలమంది పిల్లలు మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివార’ని రవి వాపోయారు. ‘ఈనెల 25వ తేదీనుండి 31 వరకు అడ్మిషన్లు పెంచేందుకు 20 వేలమంది టీచర్లతో 500 మండలాల్లో ప్రత్యేక డ్రైవ్ చేయబోతున్నామ’ని రవి వివరించారు.

‘ప్రత్యేక డ్రైవ్ లో వేలాదిమంది టీచర్లు 500 మండలాల్లోని ఇళ్ళకు వెళ్ళి మూడేళ్ళు నిండిన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చాలని అడగబోతున్న’ట్లు తెలిపారు. ‘ప్రభుత్వ స్కూళ్ళల్లోని సౌకర్యాలు, క్వాలిఫైడ్ టీచర్లు, టీచింగ్ క్వాలిటి, ఆటపాటలకు ఉండే స్ధలాలు, ఫీజుల్లో తేడాలు, ఉచితంగా పుస్తకాలను పంపిణీచేయటం లాంటి అనేక అంశాలను టీచర్లు, తల్లి, దండ్రులకు వివరిస్తార’ని చెప్పారు. మొత్తంమీద యూనియన్లలో పోటీతత్వం కావచ్చు లేదా ప్రభుత్వంలోనే మార్పురావచ్చు ఏదేమైనా ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచాలన్న ఆలోచన అయితే మంచిదేకదా. తొందరలోనే మొదలవ్వబోయే ఈ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.

Tags:    

Similar News