‘బ్రహ్మపుత్ర’ ను జయించిన తెలుగు ఆర్మీ డాక్టర్

శ్రీకాకుళం ఆర్మీ మేజర్ కవిత వాసుపల్లి బ్రహ్మపుత్ర నదిలో సాహస యాత్ర, ప్రపంచ రికార్డు;

Update: 2025-07-24 09:41 GMT
ఆర్మీ మేజర్ కవిత వాసుపల్లి

బ్రహ్మపుత్ర నదిలో భారత సైన్యంలో వైద్య అధికారిణి అయిన మేజర్ కవిత వాసుపల్లి (Indian Army Major Kavitha Vasupalli)సాహస యాత్రలో ఒంటరి మహిళగా రికార్డు సృష్టించారు. మేజర్ కవిత వాసుపల్లి 28 రోజుల్లో 1040 కిలోమీటర్ల దూరం బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ యాత్రలో (Brahmaputra River Rafting expedition) పాల్గొని రికార్డు నెలకొల్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల శ్రీకాకుళం జిల్లా మెట్టూరు గ్రామానికి చెందిన కవిత అంచెలంచెలుగా ఎదిగి భారత సైన్యంలో మేజర్ స్థాయికి ఎదిగారు. సైన్యంలో ఆమె కనబర్చిన మెరుగైన పనితీరుకు మెచ్చి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అవార్డును ప్రదానం చేశారు.గౌరీచెన్ పర్వతారోహణ చేస్తుండగా ఓ బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో వృత్తిరీత్యా ఆర్మీ డాక్టరైన కవిత ఆమెకు వైద్య చికిత్స చేసి కాపాడి సురక్షితంగా ఎతైన పర్వతం కిందకు తీసుకువచ్చారు. దీనికి గాను కవితకు రాష్ట్రపతి అందించే విశిష్ఠ సేవామెడల్ కు(Vishisht Seva Medal) ఎంపికయ్యారు.




 28 రోజుల పాటు సాగిన సాహసయాత్ర

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలోని గెల్లింగ్ గ్రామం నుంచి అసోంలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని హాట్సింగిమారి వరకు 28 రోజుల్లో 1,040 కిలోమీటర్ల ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించిన బ్రహ్మపుత్ర నది రాఫ్టింగ్ యాత్రలో పాల్గొన్న ఏకైక మహిళగా చరిత్రలో తన పేరును కవిత లిఖించుకున్నారు.కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం రివర్ రాఫ్టింగ్ సాహసయాత్ర పూర్తి చేసింది. ఈ మార్గంలో అనేక సవాళ్లను అధిగమించి యాత్ర సాగించిన సాహస బృందంలో మేజర్ కవిత ఏకైక మహిళ.గ్రేడ్ 4+ రాపిడ్‌లు, గడ్డకట్టే నీరు, బహుళ తెప్ప పల్టీలు వంటి తీవ్రమైన పరిస్థితులను తమ బృందం ధైర్యంగా ఎదుర్కొన్నాం. ప్రకృతి కోపానికి భయపడకుండా మా బృందం అచంచలమైన మానసిక బలాన్ని ప్రదర్శించి యాత్ర పూర్తి చేశామని కవిత వాసుపల్లి ‘ఫెడరల్ తెలంగాణ’కు వివరించారు.ఆర్మీ మేజర్ కవిత అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.

ఎన్నెన్నో ప్రశంసలు, అవార్డులు
ఈ రాఫ్టింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి భారత సైనికాధికారులతోపాటు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమాఖండ్ ప్రశంసలు అందుకున్నారు. శ్రీకాకుళం పేరును జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన కవిత జీవితంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఆటంకాలు, వాటిని అధిగమించి సాహస యాత్ర చేసి రికార్డు సొంతం చేసుకున్నారు.లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బ్రహ్మపుత్రలో సాహసయాత్రలో పాల్గొన్నందుకు ఆమెకు సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చింది. రివర్ రాఫ్టింగ్ యాత్రలో ఆమె సాధించిన విజయానికి గాను కవిత పేరు మార్చి 2025లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు.ఇండియన్ ఆర్మీ మేజర్ డాక్టర్ వాసుపల్లి కవిత తన జీవితంలో సాధించిన విజయాలను ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధితో పంచుకున్నారు.వాసుపల్లి కవిత సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.



 శ్రీకాకుళం నుంచి ఆర్మీ మేజరుగా...

‘‘నా స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని (Andhrapradesh) శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) మెట్టూరు గ్రామం. మా నాన్న పేరు వాసుపల్లి రామారావు రైల్వేలో క్లర్కుగా ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ వాసుపల్లి రమ్య సాధారణ గృహిణి.నా తమ్ముడు చదువుకొని సివిల్స్ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. మాది మధ్యతరగతి కుటుంబం. నేను పదోతరగతి వరకు విశాఖపట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ స్కూలులో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటరు పూర్తి చేసి ఎంబీబీఎస్ వైద్య విద్యను శ్రీకాకుళం జిల్లా వైద్యకళాశాలలో చదివాను. నా ఎంబీబీఎస్ పూర్తయ్యాక పోస్టుగ్రాడ్యుయేషన్ చదివేందుకు ఆర్థిక స్థోమత లేక కుటుంబ పోషణ కోసం నేను భారత సైన్యంలో వైద్యురాలిగా 2021వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను. నాలుగేళ్లుగా ఆర్మీలో వైద్యురాలిగా పనిచేస్తూనే, మరో వైపు నాకు ఇష్టమైన సాహసయాత్రలు చేస్తున్నాను.



 బాల్యం నుంచి స్విమ్మర్‌ను...

బాల్యం నుంచి నాకు స్విమ్మింగ్, క్రీడలంటే చాలా ఇష్టం. నేను స్విమ్మింగ్ నేర్చుకున్నా, చదువు దెబ్బతింటుందని మా నాన్న నన్ను స్విమ్మింగ్ పోటీలకు వెళ్లనివ్వలేదు. దీంతో ఈతపై ఉన్న ఆసక్తితో బాగా సాధన చేసి బెస్ట్ స్విమ్మర్ గా నిలిచాను.



 మొట్టమొదటి మహిళగా రికార్డు

అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉత్కంఠభరితమైన సాహసయాత్రలకు నిలయం. శక్తివంతమైన బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల్లో రివర్ రాఫ్టింగ్ చేయడం నాకు మరపురాని మధుర అనుభూతిగా నిలిచింది.నదిలో వేగవంతమైన జలాలు, దట్టమైన అడవులు,సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూస్తూ మేం సాహసయాత్ర కొనసాగించాను. బ్రహ్మపుత్రా నదిలో 1040 కిలోమీటర్ల దూరం రాఫ్టింగ్ చేసిన మొట్టమొదటి మహిళగా రికార్డు నెలకొల్పాను.ఈ రికార్డు సాధించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

దేవుడే బతికించాడు...
అలలు, కెరటాల మధ్య బ్రహ్మపుత్రా నదిలో రాఫ్టింగ్ చేయడం అంటే చాలా క్లిష్టతరమైనది. ప్రాణాలకు తెగించి ఛాలెంజింగ్ గా తీసుకొని ఆర్మీ మేజరుగా నేను ఈ సాహసయాత్రలో పాల్గొన్నాను. బ్రహ్మపుత్రా నదిలో రాఫ్టింగ్ యాత్రకు ముందు నేను నదిలో రెక్కీ చేశాను. పగలంతూ నదిలో రాఫ్టింగ్ చేయడం, రాత్రి కాగానే నది ఒడ్డున హాల్టు చేయడం మా డ్యూటీ. మా రాఫ్టింగ్ టీంకు సహాయంగా ఆహారం అందించేందుకు మరో బృందం ఉంది. ఒక్కో రోజు ఏకబిగిన 12 గంటలపాటు 70 కిలోమీటర్ల దూరం రాఫ్టింగ్ చేశాం. మేం రాఫ్టింగ్ చేస్తుండగా వచ్చిన పెద్ద కెరటం మమ్మల్ని అడ్డుకుంది. ఆ సమయంలో మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు.



 నా విజయానికి తల్లిదండ్రులే కారణం

భారత ఆర్మీతో పాటు సాహసయాత్రల్లో విజయాలు సాధించడానికి నా తల్లిదండ్రులే కారణం. మధ్యతరగతి కుటుంబం అయినా నేను చదువులో,ఆర్మీ ఉద్యోగంలోనూ విజయం సాధించాలని నా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. అందుకే నేను పట్టుదల, ఆత్మవిశ్వాసంతో భారత సైన్యంలో చేరి, సాహసయాత్ర పూర్తి చేశాను. నేను సాధించిన విజయాలు చూసిన నా తల్లిదండ్రులు చాలా గర్వపడుతున్నారు. వైద్యురాలిగా ఆర్మీ ఉద్యోగం అయినా, సాహసక్రీడలైనా నేను వంద శాతం మనసును లగ్నం చేసి చేస్తాను. అందుకే కేవలం నాలుగేళ్ల నా ఆర్మీ ఉద్యోగ జీవితంలో విజయాలు సాధించగలిగాను.



 ఏపీ గవర్నర్ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు...

నేను భారత సైన్యంతో పాటు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పలు సాహసయాత్రలు చేశాను. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమాఖండ్ తో పాటు రాష్ట్రపతి, భారత సైనికాధికారుల నుంచి ప్రశంసలందుకున్నాను.కానీ నేను పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు గుర్తింపు రాలేదు. దీంతో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అప్పాయింట్ కోరుతూ లేఖ రాయడంతో ఆయన నాకు ఈ నెల 26వతేదీన అప్పాయింట్ ఇచ్చారు. బయటి రాష్ట్రాల ప్రముఖుల నుంచి ఎన్ని ప్రసంశలు వచ్చిన సొంత రాష్ట్రం ఏపీలో సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసేందుకు ఏపీకి వెళుతున్నాను.



 గౌరీచెన్ పర్వతాన్ని ఐదు సార్లు ఎక్కాను...

భారతసైన్యంలో వైద్యురాలిగా పనిచేస్తూనే నేను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (National Institute of Mountaineering and Adventure Sports)లో చేరి రెండు పర్వతారోహణ, రాఫ్టింగ్ కోర్సులు చేశాను. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆర్మీలో పనిచేస్తూ అక్కడ అత్యంత ఎత్తైన 6,858 మీటర్ల ఎత్తైన గౌరీచెన్ శిఖరాన్ని అయిదు సార్లు అధిరోహించాను. నాకు చిన్ననాటి నుంచి సాహస క్రీడలు అంటే ఎంతో ఇష్టం. దీంతో ఎతైన గౌరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు ఎక్కాను.

బాలిక ప్రాణాలు కాపాడాను...
పర్వత శిఖరాలపై ఓ బాలిక ప్రాణాలను కాపాడటం నుంచి ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్రా నదిలో రాఫ్టింగ్ చేశాను.మౌంట్ గోరిచెన్ పై బాలిక ఈ చారిత్రాత్మక యాత్రకు ప్రముఖ సాహసికుడు, టెన్సింగ్ నార్గే అవార్డు గ్రహీత,మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాగ్ర అధిరోహకుడు కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నాయకత్వం వహించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (NIMAS) డైరెక్టర్‌గా కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నాయకత్వం ఈ ప్రయాణాన్ని ప్రపంచ సాహస క్రీడల్లో ఒక మైలురాయి విజయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది’’ అంటూ తన సాహసయాత్ర గురించి ఆర్మీ మేజర్ కవిత వాసుపల్లి వివరించారు.


Tags:    

Similar News