తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు చర్యలు
తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేస్తామని డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాలల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
By : The Federal
Update: 2024-11-20 14:30 GMT
ఇందిరమ్మ రాజ్యంలో ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకోవాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
- వివిధ శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఎడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
- అన్ని శాఖల్లో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇకనుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటివరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను భట్టి ఆదేశించారు. ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు.
- ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గిరిజన తండాలకు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా కావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు.
కళాశాలల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నాం
ప్రైవేటు డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందని, దీనిపై తాము సానుకూలంగా స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. కళాశాలల సమస్యలు ద శలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.