కుల గణనలో తప్పుడు సమాచారం నమోదు చేస్తే కఠినచర్యలు
సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా నిర్వహించాలని తెలంగాణ బీసీ కమిషన్ కోరింది.ఎన్యుమరేటర్లు తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంది.
By : The Federal
Update: 2024-11-08 11:20 GMT
సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎలాంటి అనుమానాలు లేకుండా జరిగేలా చూడాలని తెలంగాణ బీసీ కమిషన్ కోరింది. రాజకీయ పార్టీలు విభేదాలకు అతీతంగా సర్వేకు సహకరించాలని కమిషన్ కోరింది.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేను ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ చెప్పారు. ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా చేయాలని ఆయన ఆదేశించారు.
సమాచారం అందించండి
ఎన్యుమరేటర్లు ఏ రోజు, ఏ ప్రాంత కుటుంబాలకు వెళతారో స్పష్టంగా ముందస్తుగా ఆ కుటుంబాలకు సమాచారం అందించేలా సూపర్ వైజర్ లు, ఉన్నతాధికారులు ప్రయత్నించాలని బీసీ కమిషన్ సూచించింది. కనీసం ఒకరోజు ముందే ఆ సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.
సమాచారాన్ని గోప్యంగా ఉంచండి
ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమాచారాన్ని అందిస్తేనే బీసీల అసలు సంఖ్య, విద్య, ఆర్థిక, సామాజిక, రంగాల్లో ఉన్న వెనుకబాటుతనం తెలుస్తుందని బీసీ కమిషన్ పేర్కొంది.ఎన్యుమరేటర్ల ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్లానింగ్ శాఖ, కలెక్టర్లు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది.‘‘ప్లానింగ్ శాఖ సేకరించిన ఈ సమాచారం బీసీ కమిషన్ కు అత్యంత కీలకం. ఈ సమాచారాన్ని సమీక్షించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, సూచనల గురించి ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని నిరంజన్ చెప్పారు.
ప్రజలు సహకరించాలి
ప్రజలు సర్వేకు , సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు అన్ని విధాల సహకరించాలని బీసీ కమిషన్ కోరింది. ఎక్కడైనా లోపాలుంటే వారు ఇచ్చిన సమాచారం దుర్వినియోగం అయ్యే పరిస్థితులు ఉంటే జిల్లా కలెక్టర్లకు గాని లేదా బీసీ కమిషన్ కు గాని తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ నిరంజన్ చెప్పారు. ఎక్కడైనా, ఎవరైనా అధికారులు గానీ ఎన్యుమరేటర్లు కానీ ప్రజలు కానీ తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే వారిపై చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ హెచ్చరించింది.