హైడ్రాకు ఆత్మహత్యల బెదిరింపులు

తమ విల్లాలనుకూల్చేస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. కొందరైతే పెట్రోలు కూడా పోసుకున్నారు.

Update: 2024-09-08 07:32 GMT
Victim of Hydra demolitions

అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రాకు సరికొత్త అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం నుండి దుందిగల్ మున్సిపాలిటి పరిధిలోని సున్నంచెరువు, కత్వా చెరువులోని ఆక్రమణలను హైడ్రా తొలగిస్తోంది. కత్వా చెరువును ఆక్రమించి శ్రీ లక్ష్మీ శ్రీనివాస బిల్డర్స్ 23 విల్లాలు నిర్మించారు. చెరువు అసలు విస్తీర్ణం 29 ఎకరాలైతే ఇపుడున్నది కేవలం 5 ఎకరాల విస్తీర్ణం మాత్రమే. ఈరోజు ఉదయం నుండి 8 విల్లాలను హైడ్రా కూల్చేసింది. ఇంకా 15 విల్లాలను కూల్చటానికి హైడ్రా రెడీ అవుతోంది. అయితే 8 విల్లాలకు చెందిన ఓనర్లు గోల మొదలుపెట్టేశారు. తమ విల్లాలనుకూల్చేస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించారు. ఐదుగురు ఓనర్లయితే పెట్రోలు కూడా పోసుకున్నారు.

అయితే పెట్రోలు పోసుకుని బెదిరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమ కూల్చివేతలతో ముందుకెళుతున్నారు. అలాగే మాదాపూర్లోని సున్నంచెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చేసే సమయంలో కూడా హైడ్రాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడటం ఏమిటంటు ఇళ్ళ ఓనర్లు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఆక్రమణల్లో కట్టిందే కాబట్టి కూల్చివేతకు నెలరోజులు హైడ్రా సమయం ఇచ్చింది. దాన్ని సున్నంచెరువు ఆక్రమణల్లో ఇళ్ళున్న ఓనర్లు నిలదీస్తున్నారు. రేవంత్ సోదరుడికి ఒక న్యాయం తమకు మరో న్యాయమా అని కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం తాము ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలకు దిగినట్లు చెబుతున్నారు. దాంతో కూల్చివేతలు, నోటీసులపై ఎవరు చెప్పేది నిజమో అర్ధంకావటంలేదు.

భవరంపేట, దుండిగల్, మాదాపూర్ ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా ఉదయం నుండి కూల్చేస్తోంది. ఈరోజు కూల్చివేతల్లో ముఖ్యంగా విల్లాలపైన హైడ్రా దృష్టిపెట్టింది. దాంతో ఓనర్ల నుండి పెద్దఎత్తున ప్రతిఘటన ఎదురైంది. అయితే తమ సిబ్బందిని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నవారిని హైడ్రా సిబ్బంది అదుపులోకి తీసుకుని కూల్చివేతలను యధేచ్చగా కంటిన్యు చేసేస్తున్నారు.

Tags:    

Similar News