NEETలో స్థానిక కోటాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వివాదాన్ని త్వరగా పరిష్కండి. విద్యార్థులకు ఇబ్బందులు రాకూడదన్న అత్యున్నత న్యాయస్థానం.;
నీట్ పరీక్షలో తెలంగాణ స్థానికత కోటా వివాదం కొంతకాలంగా తీవ్రతరం అవుతోంది. వైద్య విద్యలో స్థానిక కోటాకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగు సంవత్సరాలు చదివిన విద్యార్థులు మాత్రమే స్థానిక విద్యార్థులుగా పరిగణించబడతారని పేర్కొంది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా ఈ వివాదంపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్‌లో తెలంగాణ స్థానికత వాదానికి వీలైనంత త్వరగా పరిష్కారం వెతకాలని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.
అసలు వివాదం ఏంటంటే..!
నీట్ పరీక్ష రాయడానికి నాలుగు సంవత్సరాల ముందు నుంచి తెలంగాణలో చదవాలి. ఆ విద్యార్థులకు మాత్రమే నీట్‌లో స్థానికత కోటా కింద సీట్ లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అయితే ఇవి చెల్లవని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది మాత్రం పిటిషనర్లకు(విద్యార్థులకు) రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అదే విధంగా ఈ ఏడాది తమకు కూడా మినహాయింపు అందించాలని కోరుతూ విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో పుట్టి పదోతరగతి వరకు చదివినప్పటికి 11, 12 తరగతులు చదవనందుకు తమను అనర్హులుగా పరిగణిస్తున్నారని, దాని వల్ల తాము తీవ్రంగానష్టపోతున్నమని విద్యార్థులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
9-12 వరకు చదివితేనే స్థానికులు: నిపుణులు
నీట్ పరీక్షకు ఇంటర్‌మీడియన్ అర్హత కావున.. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివితేనే వారిని స్థానికులుగా పరిగణించి.. లోకల్ కోటాలో నీట్ సీట్ కేటాయించాలని కొందరు నిపుణులు కూడా చెప్తున్నారు. ఒకవేళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదివినా.. అలాంటి వారికి గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉన్నట్లు రెసిడెంట్ సర్టిఫికెట్ అడుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ స్థానికంగా చదివితేనే ఎంబీబీఎస్ లోకల్ కోటా సీట్లకు అర్హులని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు.
సీట్ల భర్తీ ఇలా..!
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో మొత్తం 1.10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 25,400 సీట్లను ఆల్ ఇండియా కోటా కింద మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ భర్తీ చేస్తుంది. మిగిలిన వాటిలో తెలంగాణలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ మొత్తం 8,415 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. వీటిలో 15 శాతం అంటే 637 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగిలిన 85 శాతం సీట్లలో ప్రైవేటీ కాలేజీల్లో 50 శాతం సీట్లను కౌన్సిలింగ్‌లో కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 50శాతం సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. బీడీఎస్ సీట్లు తెలంగాణలో 100 ఉన్నాయి. వాటిలో 15 శాతం సీట్లు కూడా ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి.