ఖమ్మం కాంగ్రెస్‌లో సస్పెన్స్ థ్రిల్లర్, తప్పక చూడండి...

ముగ్గురు కీలక మంత్రులున్న ఖమ్మం ఖిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మంత్రుల కుటుంబసభ్యులే ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

Update: 2024-03-29 11:10 GMT
Khammam Khilla (Photo Credit :Facebook)

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నేడు ‘హస్త’గతం అయింది. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

మరో వైపు ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు కీలక నేతలకు కీలక శాఖలు లభించాయి. డిప్యూటీ సీఎంగా ఆర్థిక ప్రణాళిక, ఇంధన శాఖలను మల్లు భట్టివిక్రమార్క పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం నుంచి విజయ ఢంకా మోగించిన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రిగా, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహనిర్మాణం, సమాచారశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
ఖమ్మం (తుమ్మల నాగేశ్వరరావు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు), మల్లు భట్టివిక్రమార్క(మధిర), మాలోతు రాందాస్(వైరా), మట్టా రాగమయి(సత్తుపల్లి), జారే ఆదినారాయణ (అశ్వరావుపేట)లు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో ఆ పార్టీకి బలం, బలగం ఉంది. మరో వైపు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట కావడంతో పార్టీ నేతల్లో టికెట్ కోసం పోటీ పెరిగింది. 

పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మల్లు భట్టివిక్రమార్క,తుమ్మల నాగేశ్వరరావు


 


ఖమ్మం పార్లమెంట్ ప్రత్యేకత
గలగల నీరు పారే పాలేరు జలాశయం ఒకవైపు...సిరులు కురిపిస్తున్న సింగరేణి బొగ్గు గనులు మరో వైపు...పచ్చని చెట్లతో కళకళలాడుతున్న పామాయిల్ తోటలు...గలగల పారే సెలయేర్లతో కూడిన కిన్నెరసాని నది ప్రాంతంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించి ఉంది.ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 36.6శాతం మంది, 7.7 శాతం మంది ముస్లిమ్ ఓటర్లు ఉన్నారు.

ముగ్గురు అభ్యర్థుల మధ్య టికెట్ పోరు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య మల్లు నందినికి ఖమ్మం పార్లమెంటు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడైన ప్రసాదరెడ్డికి ఎంపీ టికెట్ కోరుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడైన తుమ్మల యుగంధర్ కూడా కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ముగ్గురు మంత్రుల పక్షాన ముగ్గురు నేతలు టికెట్లు ఆశిస్తుండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఖరారు పెండింగులో పెట్టింది. మొదట కాంగ్రెస్ కంచుకోట అయిన ఖమ్మం నుంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని రంగంలోకి దిగాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరారు.అయితే సోనియా రాజ్యసభ సభ్యురాలు కావడంతో ప్రియాంకగాంధీని అయినా ఖమ్మం నుంచి పోటీ చేయమని అడిగారు. ప్రియాంకగాంధీ కూడా ఉత్తరాది నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమయ్యారు. మరో వైపు ముగ్గురు అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ టికెట్ పోరు తీవ్రం కావడంతో వారు ముగ్గురు కాకుండా కొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించవచ్చేమోనని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

హ్యాట్రిక్ కోసం నామ యత్నం
బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అయిన నామ నాగేశ్వరరావు పేరును కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో రెండుసార్లు ఖమ్మం ఎంపీగా పనిచేసిన నామ నాగేశ్వరరావు మూడో సారి హ్యాట్రిక్ విజయం కోసం యతిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామను ప్రకటించడంతో ఆయన ఇంకా ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు. ఖమ్మం ఎంపీగానే కాకుండా పార్లమెంటులో రెండు సార్లు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా పనిచేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై ఎక్కువ ప్రశ్నలు అడిగిన ఆదర్శ ఎంపీగా కూడా నామ నిలిచారు. గతంలో టీడీపీలో పనిచేసిన నామ నాగేశ్వరరావు తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యారు.

మసకబారిన బీఆర్ఎస్ ప్రతిష్ఠ
బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, వరుస కేసులు, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ బాగోతాలతో బీఆర్ఎస్ ప్రతిష్ఠ మసకబారింది. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఖరారయ్యాక కడియం కావ్య దాన్ని కాదని కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతుండటం సంచలనం రేపింది. మరో వైపు చేవేళ్ల సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరి బరిలోకి దిగారు. కడియం కావ్య, రంజిత్ రెడ్డిలే కాకుండా మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. మొత్తం మీద జంపింగులు జపాంగ్ లతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.

స్వచ్ఛంద సేవలకు ప్రాధాన్యం
నామ నాగేశ్వరరావు ఎంపీగా ఏ పార్టీలో పనిచేస్తున్నా స్వచ్ఛంద సేవలకు ప్రాధాన్యమిస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ట్రస్టు బోర్డు డైరెక్టరుగా, తన తండ్రి నామ ముత్తయ్య పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టులను నడుపుతూ పేదలకు తన వంతు సాయాన్ని నామ అందిస్తున్నారు. బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ భూమి లీజు గడువు ముగియడంతో ట్రస్టు బోర్డు డైరెక్టరుగా నామ నాగేశ్వరరావు ఈ నెల 15వతేదీన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గడవు పెంచాలని అభ్యర్థించారు. పార్టీలు ఏవైనా స్వచ్ఛంద సేవలకు అడ్డు కాకూడదని నామ సీఎం రేవంత్ ను కలిసి ఆసుపత్రి స్థలం లీజు గడువు పెంచాలని కోరారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 30 సంవత్సరాల పాటు లీజు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

బసవతారకం ఆసుపత్రి లీజుకోసం సీఎం రేవంత్ ను కలిసిన ఎంపీ నామ


 సీఎంకు నామ కృతజ్ఞతలు

లీజు గడువు పెంచిన రేవంత్ కు నామ నాగేశ్వరరావు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. 24 ఏళ్లుగా కేన్సర్ రోగులకు బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి అందిస్తున్న సేవలు, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ లో సాగుతున్న కేన్సరు పై సాగుతున్న పరిశోధనల గురించి నామ నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. బసవతారకం హాస్పిటల్ సేవలను సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

రేవంత్ రెడ్డితో నామకు టీడీపీ బంధం
గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నామకు అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా టీడీపీలో ఉండటంతో వారి మధ్య ప్రత్యేక స్నేహం ఉంది. ఆస్ట్రేలియా దేశంలో మన తెలుగు విద్యార్థులపై జాత్యాంహంకార దాడి జరిగినపుడు నామ నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డిలు టీడీపీ పక్షాన ప్రతినిధులుగా కలిసి ఆ దేశానికి వెళ్లి మన తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్పి వచ్చారు. బాబ్లీ కోసం కూడా రేవంత్, నామ ఇద్దరూ కలిసి పోరాడారు. బీఆర్ఎస్ ఎంపీ అయినా నామ నాగేశ్వరరావుకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మం పట్టణంతోపాటు పార్లమెంటులో పెట్టించిన ఘనత నామ నాగేశ్వరరావుకే దక్కింది. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని నామ నాగేశ్వరరావు ఇటీవల డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు...
గత కొంతకాలంగా నామ నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారని వాట్సాప్ లో ప్రచారం జరిగింది. కానీ దాన్ని నామ నాగేశ్వరరావు కొట్టిపారేశారు. వరుస కేసులు, ట్యాపింగ్ వివాదాలు, అక్రమాల ఆరోపణలతో బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడైన నామ నాగేశ్వరరావు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాను పార్టీ మారేది లేదని, బీఆర్ఎస్ లో కొనసాగుతానని, అయితే స్వచ్ఛంద సేవలు మాత్రం పార్టీలకు అతీతంగా చేస్తానని నామ నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం సీటు కోసం ముగ్గురు బలమైన మంత్రులు వారి కుటుంబసభ్యుల కోసం పోటీ పడుతున్న తరుణంలో కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరిస్తుందో...ముగ్గురిని కాదని కొత్త అభ్యర్థిని కూడా తెరమీదకు తీసుకురావచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ను ఆ పార్టీ అధిష్ఠానవర్గం ఎవరికి కేటాయిస్తుందో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.











Tags:    

Similar News