టీ ఆర్టీసీ రికార్డు బ్రేక్

తెలంగాణా ఆర్టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. కలెక్షన్లో కాని ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చటంలో కాని రికార్డు బ్రేక్ చేసింది.

Update: 2024-05-16 12:11 GMT
Rush in TSRTC

తెలంగాణా ఆర్టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. కలెక్షన్లో కాని ప్రయాణీకులను గమ్యస్ధానాలకు చేర్చటంలో కాని రికార్డు బ్రేక్ చేసింది. ఒక్కరోజులో 54 లక్షలమంది ఏపీ నుండి తెలంగాణాకు తిరిగిరావటంతో రికార్డుస్ధాయిలో రు. 24.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈమధ్యనే తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు జరిగితే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరిగాయి. ఏపీ ఎన్నికల్లో ఓట్లు వేయటానికే తెలంగాణాలోని జనాలు ఎక్కువమంది మొగ్గుచూపారు. ఫలితంగా 13వ తేదీ పోలింగుకు రెండురోజుల ముందే తెలంగాణా నుండి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షలమంది సీమాంధ్రులు ఏపీకి వెళ్ళిపోయారు.

వెళ్ళటం రెండురోజుల ముందే వెళ్ళినా 13వ తేదీన ఓటింగ్ వేసిన జనాలంతా అదేరోజు బయలుదేరి 14వ తేదీకి తిరిగి తెలంగాణాకు చేరుకున్నారు. ఈ నేపధ్యంలోనే ఏపీ నుండి తెలంగాణాకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంచేసిన వాళ్ళ సంఖ్య 54 లక్షలుగా తేలింది. తెలంగాణా ఆర్టీసీ బస్సులు ఒక్కరోజు 35.12 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు రికార్డయ్యింది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 14వ తేదీన 106 శాతంగా నమోదైంది. వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే గ్రాండ్ ఎలక్షన్ చాలెంజ్ ను అమలుచేశారు. గ్రాండ్ ఎలక్షన్ చాలెంజ్ అంటే ఏమిటంటే పోలింగ్ కు వెళ్ళేరోజు, ఓట్లేసిన తర్వాత తిరిగచ్చేరోజు ఎంతమందిని వీలుంటే అంతమందిని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంచేసేట్లుగా ప్రోత్సహించటమే. అందుకనే ప్రత్యేకంగా పోలింగ్ కోసమని 2 వేల బస్సులను అదనంగా వేసింది.

గ్రాండ్ ఎలక్షన్ చాలెంజ్ లో భాగంగానే సెలవులు, వీక్లీ ఆఫ్ లో ఉన్న ఉద్యోగులను కూడా సజ్జనార్ డ్యూటీకి పిలిపించారు. మొత్తానికి వీసీ ప్రయత్నాలు ఫలించి రికార్డు సృష్టించింది. టికెట్లు కొనగోలు చేయటం ద్వారా రు. 15 కోట్ల ఆదాయం అందితే మహిళలకు జీరో టికెట్ జారీచేయటం ద్వారా మరో 9 కోట్ల రూపాయలు రికార్డయ్యింది. అంటే ఈ 9 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి రీ ఎంబర్స్ మెంట్ ద్వారా అందితే పోలింగ్ రోజున ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజు రు. 24 కోట్ల ఆదాయం అందుకున్నట్లవుతుంది. మామూలుగా పండుగల సమయంలో తెలంగాణా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో నుండి సీమాంధ్రకు జనాలు వెళ్ళటం అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు మాత్రం పండుగల రష్ ను మించి ఎలక్షన్ రష్ రికార్డులు సృష్టించింది.

Tags:    

Similar News