Telangana | తెలంగాణలో బిగ్ డే
మూడు అంశాలపై రాజకీయాలు చాలా వాడిగా వేడిగా జరగబోతున్నాయి;
సోమవారాన్ని తెలంగాణలో బిగ్ డే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు హాట్ హాట్ రాజకీయాలకు నాంధి పడబోతోంది. మూడు అంశాలపై రాజకీయాలు చాలా వాడిగా వేడిగా జరగబోతున్నాయి. అవేమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల(BC Reservations) సాధనకోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad) నుండి ఢిల్లీ(Delhi)కి ప్రత్యేకరైలు బయలుదేరింది. అలాగే బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేట్లుగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కల్వకుంట్ల కవి(Kavitha)త 72 గంటల దీక్షను ఈరోజు ఆరంభిస్తున్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) అధ్యక్షతన అత్యవసర క్యాబినెట్ సమావేశం(Cabinet Meeting) జరగబోతోంది. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయం రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. తెలంగాణ(Telangana big day)లో ఒక్కరోజు ఇన్నిపరిణామాలు జరగబోతున్నాయి కాబట్టే సోమవారాన్ని రాజకీయంగా బిగ్ డే అని అంటున్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానంచేసిన బిల్లును రేవంత్ ప్రభుత్వం ఢిల్లీకి పంపింది. అయితే ఆ బిల్లు రాష్ట్రపతిదగ్గర పెండింగులో ఉంది. అందుకనే రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీచేస్తే దాన్ని కూడా గవర్నర్ కేంద్రహోంశాఖకే పంపారు. అంటే బిల్లు, ఆర్డినెన్స్ రెండూ ఢిల్లీలోనే ఉన్నాయి. అందుకనే ఈ విషయమై రాష్ట్రపతి ద్రౌపధి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడేందుకు రేవంత్ అపాయిట్మెంట్ అడిగింది. అపాయిట్మెంట్ ఇస్తే వాళ్ళని కలిసి పరిస్ధితులను వివరించి, బిల్లుకు మద్దతిచ్చి ఆమోదం తెలపాలని రిక్వెస్టు చేయబోతున్నారు. ఒకవేళ అపాయిట్మెంట్ దొరకకపోతే నిరసన తెలపాలని డిసైడ్ అయ్యారు. అందుకనే జిల్లాలో 25 మంది నేతలచొప్పున కాంగ్రెస్ బీసీ నేతలు, బీసీకులసంఘాల ప్రముఖులు, పార్టీ ప్రజానితిధులు సుమారు 1200 మంది సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చర్లపల్లి రైల్వేస్టేషన్ నుండి ప్రత్యేకరైలులో ఢిల్లీకి బయలుదేరారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్, పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు చాలామంది సీనియర్ నేతలు కూడా వీళ్ళతో పాటు రైలులో ప్రయాణిస్తున్నారు. ఈరైలు మంగళవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుంది.
కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి బయలుదేరితే సాయంత్రం క్యాబినెట్ సమావేశం తర్వాత లేదా మంగళవారం ఉదయం రేవంత్, మంత్రులు ఢిల్లీకి చేరుకుంటారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయిట్మెంట్లు ఇవ్వకపోతే మూడురోజులు ఢిల్లీలోనే నిరసన తెలియచేసేందుకు కాంగ్రెస్ అవసరమైన ఏర్పాట్లు చేసుకుంది. ఇదేసమయంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర బీసీల రిజర్వేషన్ల అంశంపైనే కవిత 72 గంటలు దీక్ష మొదలుపెట్టబోతున్నారు. దీక్షకు పార్క్ దగ్గర అనుమతి లభించకపోతే తన ఇంట్లోనే దీక్ష చేసేందుకు కవిత రెడీ అయ్యారు. రిజర్వేషన్లకు మద్దతుగా కవిత చేస్తున్న దీక్ష బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచబోతోందన్నది వాస్తవం. కవిత దీక్షను పోలీసులు భగ్నంచేస్తే అదో పెద్ద సీన్ క్రియేట్ అవటం ఖాయం.
రేవంత్ అధ్యక్షతన సాయంత్రం క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ అందించిన రిపోర్టుపై చర్చించేందుకే క్యాబినెట్ సమావేశం ప్రత్యేకంగా జరగబోతోంది. ఒక అంశంపైన ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం అవటం బహుశా ఇదే మొదటిసారేమో. రిపోర్టు ప్రకారమైతే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ కీలకపాత్రదారులనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురిలో ఎవరి పాత్ర ఎంత అన్న విషయాన్ని కూడా ఘోష్ తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. కాబట్టి రిపోర్టులో ఘోష్ తప్పుపట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ఈరోజు క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ డిసైడ్ చేస్తే పెద్ద సంచలనమే అవుతుంది. దీని ఆధారంగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోవటం ఖాయం.
క్యాబినెట్ లో చర్చలు, నిర్ణయంపై అనుసరించాల్సిన విధానాన్ని చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన ఫామ్ హౌస్ లో సీనియర్ నేతలతో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. సచివాలయంలో క్యాబినెట్ సమావేశం మొదలవ్వగానే ఫామ్ హౌస్ లో సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశం అవబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఇన్ని హాటు హాటు పరిణామాలు జరగబోతున్నాయి కాబట్టే సోమవారం తెలంగాణకు బిగ్ డే అని చెప్పాలి.