అమిత్ షా ముందుకు బీసీ బిల్లు అంశం
స్పీకర్ల సదస్సులో ప్రస్తావించిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.;
బీసీ బిల్లు అంశం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందా? రాదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎలాగైనా ఈ బిల్లుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. కానీ కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అదే విధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ్.. కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. న్యాయ నిపుణులతో చర్చలు చేసిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బీసీ బిల్లు అంశంపై ఏ విషయం నిర్ణయించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది.
అయితే ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన స్పీకర్ల సమావేశం జరుగుతోంది. అందులో పాల్గొన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీసీ బిల్లు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై అమిత్ షాతో చర్చించారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసిన బిల్లు ఇంకా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇదే అంశంపై చర్చించడానికి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమిత్ షాను ప్రత్యేకంగా కలిసిన అంశాన్ని గుర్తు చేశారు. కాగా గడ్డం ప్రసాద్ అభ్యర్థనపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఆ అంశాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలోపు బీసీ బిల్లు ఆమోదం పొందకపోతే ఏం చేయాలి? అన్న అంశంపై కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చర్చిస్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాకుంటే.. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. అంతేకాకుండా ఇతర పార్టీలు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేసేలా కోరాలని కూడా ప్రయత్నిస్తోంది. దీనిపై అతి త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.