స్థానిక ఎన్నికల్లో పిల్లల నిబంధన రద్దు..!

కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ మంత్రివర్గం.

Update: 2025-10-23 13:56 GMT

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరుకు మించి పిల్లలు ఉండకూడదన్న నిబంధనను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సెక్షన్ 21(3) నిబంధనను తొలగించడానికి గురువారం తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలి? అన్న అంశంపై చర్చ జరిగింది. ఇందులో భాగంగానే అర్హులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండకూదన్న 30ఏళ్ల నిబంధనలకు స్వస్తి పలకాలను మంత్రి వర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందని సమాచారం.

ఈ నిబంధన ఎప్పుడు అమలైందంటే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికి మించి పిల్లలు ఉండకూడదు. ఈ నిబంధన 1995 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధనను ఉమ్మడి రాష్ట్రంలో 1994లోనే చట్టం చేశారు. ఈ నిబంధనను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో తొలగించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే మార్గంలో పయనిస్తోంది. గత కేబినెట్ సమావేశంలోనే ఈ నిబంధన తొలగింపుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా ఈ అంశంలో ఎలా ముందుకువెళ్లాలి అన్న అంశంపై గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. దీంతో ఆర్డినెన్స్ ద్వారా ఈ అంశంలో ముందుకు వెళ్లాలని, ఆ తర్వాత చట్టం చేయాలని కేబినెట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఎత్తివేత ప్రక్రియ ఎలా అంటే..

కేబినెట్ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు.. ఇతర రాష్ట్రాల్లో ఈ నిబంధన ఎత్తివేతకు అనుసరించిన విధానాన్ని అధ్యయం చేస్తారు. అనంతరం తాము సిద్ధం చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ నివేదికను కేబినెట్ మీటింగ్‌లో చర్చిస్తారు. అందులో నిబంధన ఎత్తివేతకు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లును ప్రతిపాదించి.. పాస్ అవగానే ఆమోదం కోసం గవర్నర్‌కు పంపుతారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడప్పుడే అసెంబ్లీ సమావేశాలు లేకపోవడం.. ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంది. ఆ ఆర్డినెన్స్‌కు కూడా గవర్నర్ ఆమోదం కావాల్సిందే. ఆయన ఆమోదం తెలిపితే ఇది చట్టంగా మారుతుంది.

దీనిని గవర్నర్ ఆమోదిస్తారా..!

అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బిల్లు పాస్ అయింది. కానీ అది గవర్నర్ దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. న్యాయపరమైన అంశాలను పరిశీలించడం కోసం ఆ బిల్లును గవర్నర్.. కేంద్రానికి సిఫార్సు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ చేసింది. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. దీంతో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నెం.9ను తీసుకురాగా దానిపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ సమయంలో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా? లేదంటే అది కూడా పెండింగ్‌లో ఉంటుందా? అనే చర్చ మొదలైంది.

Tags:    

Similar News