SLBC పునరుద్దరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర మంత్రివర్గం.
భారీ ప్రమాదం కారణంగా ఆగిపోయిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను పునరుద్దరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులపై చర్చించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. మిగిలిన సొరంగం పనులను అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యం తో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు ఈ ప్రాజక్ట్ నీళ్లను అందిస్తుంది.
ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు కేబినెట్ అనుమతించింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ ఆమోదించింది. 2028 జూన్ నాటికి ఎస్ ఎల్ బీ సీ ని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకుంది.
క్యాబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని కేబినేట్ చర్చించింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీ నగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణలను ఎక్కడ చేపట్టాలనే దానిపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
రామగుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ (RTS-B 62.5 మెగావాట్ల యూనిట్) కాల పరిమితి ముగిసినందున దానిని తొలగించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేండ్ల విద్యుత్తు డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్తు శాఖను కేబినేట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని సూచించింది.