కేబినెట్ సమావేశం పూర్తి.. కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు.

Update: 2025-10-16 16:30 GMT

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరుకు మించి పిల్లలు ఉండకూడదన్న నిబంధనపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ కీలకంగా నడుస్తున్నక్రమంలో సీఎం రేవంత్ కేబినెట్ సమావేశం జరపడం విశేషంగా మారింది. ఈ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, రైతు భరోసా, మెట్రో ఫేజ్ 2 అంశాలపై చర్చించారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరుకు మించి పిల్లలు ఉండకూడదు అన్న అంశంపైనా చర్చించారు. ఈ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసింది. వర్షాకాల సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించనున్నట్టు అంచనా వేసిన నేపథ్యంలో, ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.

కేబినెట్‌లో చర్చించిన అంశాలివే...

  • రాష్ట్రంలో దిగుబడి సాధించిన ధాన్యంలో 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల మేరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌర సరఫరాల విభాగం అంచనా. కేంద్ర ప్ర‌భుత్వం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సేక‌ర‌ణ‌కు అంగీక‌రించింది. మ‌రో 15 లేదా 20 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించాల‌ని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.
  • ధాన్యం కొనుగోళ్ల‌ను ప‌క‌డ్బందీ చర్యలు తీసుకోవడమే కాకుండా, ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోన‌స్ ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
  • రాష్ట్రంలో కొత్తగా మూడు (3) వ్యవసాయ కళాశాలలు, హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో ఏర్పాటుకు ఆమోదం.
  • ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించాలని, సంబంధిత ఏర్పాట్ల కోసం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది.
  • ఇద్దరు పిల్లలకు మించి సంతానం కలిగిన వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనపై చర్చించిన మంత్రిమండలి, గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ నిబంధనను ఎత్తివేసేందుకు అంగీకరించింది.
  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు 10 ఎక‌రాలు కేటాయించింది.
  • నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్మానం. ఈ యూనివర్సిటీ అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కోరింది.
  • హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది.
  • అందుకు సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు. అధికారుల కమిటీ అందించే నివేదికను మంత్రివర్గ ఉప సంఘం సమగ్రంగా అధ్యయం చేస్తుంది.
  • రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొద‌టి ద‌శ‌లో 5,566 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం.
  • ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వ‌ర‌కు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములకు ప్ర‌త్యామ్నాయంగా ఆ శాఖకు 435.08 ఎక‌రాల భూముల‌ను అప్ప‌గిస్తూ తీర్మానం.
  • కృష్ణా - వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.438 కోట్ల వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీకారం.
  • మ‌న్న‌నూర్‌ - శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాలని నిర్ణయం.
Tags:    

Similar News