రేవంత్ సర్కార్ నిర్ణయంతో 213 మంది ఖైదీల ఇళ్లలో సంతోషం

ఒకేరోజు తెలంగాణాలో 213 మంది ఖైదీలకు చెరసాల నుంచి విముక్తి కలిగింది.

Update: 2024-07-03 10:06 GMT

ఒకేరోజు తెలంగాణాలో 213 మంది ఖైదీలకు చెరసాల నుంచి విముక్తి కలిగింది. వారంతా జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు ముందస్తు విడుదల మంజూరు చేయడంతో తెలంగాణలోని వివిధ జైళ్ల నుంచి బుధవారం 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. ప్రభుత్వ నిర్ణయంతో సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, చెర్లపల్లి, వరంగల్‌లోని సెంట్రల్ జైళ్లలో, రాష్ట్రాలలోని వివిధ జైళ్లలో ఉన్న ఈ ఖైదీలు చెరసాల నుంచి రిలీజ్ అయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

కాగా, ప్రజాపాలన కార్యక్రమంలో ఖైదీల కుటుంబ సభ్యులు సీఎం రేవంత్‌ రెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, విడుదలకు అర్హులైన ఖైదీల వివరాలను ఉన్నత స్థాయి కమిటీ ముందు ఉంచారు.

ఆమోదం కోసం ఖైదీల జాబితాను కమిటీ కేబినెట్‌కు పంపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్.. జాబితాలోని పేర్లను ఆమోదించి ఖైదీలకు విముక్తి కల్పించింది. ఈ జాబితాకు గవర్నర్ సమ్మతి తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు క్షమాపణలు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం బుధవారం 213 మంది ఖైదీలు జైలు నుంచి విడుదల అయ్యారు. వీరిలో 205 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఎనిమిది మందికి తక్కువ శిక్షలు విధించబడ్డాయి. వీరందరికీ ఇప్పటికే జైల్లో వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు. సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని ఒక ప్రకటనలో పోలీసు అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News