మహారాష్ట్ర, యూపీకి క్యూ కడుతున్న నేతలు

తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ సీనియర్లలో చాలామంది ఉత్తరాధి రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు.

Update: 2024-05-17 08:47 GMT
Seethakkan campaigning in Raebareli

తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ సీనియర్లలో చాలామంది ఉత్తరాధి రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. తెలంగాణా ఎన్నికల్లో పార్టీ మెజారిటి సీట్లు గెలుచుకుంటుందనే అంచనాలున్నాయి. అందుకనే సీనియర్లలో కొందరిని అధిష్టానం ఉత్తరాధిరాష్ట్రాల్లో ప్రచారానికి పిలిపించుకున్నది. నేతల్లో ఎక్కువమంది రాహూల్ గాంధి పోటీచేస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గంలో ప్రచారంచేయటానికి వెళుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు బరేలిలో మూడురోజులు ప్రచారంచేసి వచ్చారు. ఇపుడు మంత్రి సీతక్క, నాగర్ కర్నూలులో పోటీచేసిన మల్లురవి, అచ్చంపేట ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎంఎల్ఏ కే రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంఎల్ఏ మెగారెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరితా యాదవ్ తదితరులు బరేలిలో ప్రచారం చేస్తున్నారు.

అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మద్దతుదారులతో మహారాష్ట్రలో ప్రచారంచేస్తున్నారు. ధారావి, సియాన్ కొలివాడ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం ముంబాయ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరగబోతున్న బహిరంగసభలో కూడా పాల్గొంటారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే రాహుల్ పోటీచేస్తున్న రెండో నియోజకవర్గం కేరళలోని వాయనాడ్ లో రెండు రోజులు ప్రచారం చేసొచ్చారు. అలాగే కర్నాటకలో తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ప్రచారంచేశారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండురోజులు రాయబరేలిలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తొందరలోనే మరింతమంది సీనియర్ నేతలు రాయబరేలిలో పాటు మరిన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయటానికి రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దు జిల్లాలు ఔరంగాబాద్, బాబ్లీ ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నారు.

మొత్తానికి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదల కాంగ్రెస్ లో ఇంతకాలానికి స్పష్టంగా కనబడుతోంది. అధికారంలోకి వస్తుందా రాదా అన్న విషయాన్ని పక్కకు పెట్టేస్తే అందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం బాగా కనబడుతోంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో ప్రచారానికి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు కూడా యూపీలో క్యాంపువేశారు. తొందరలోనే విడతలవారీగా కమలంపార్టీ నేతలు మరింతమంది ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రచారం చేయబోతున్నారు.

Tags:    

Similar News