తెలంగాణ కాంగ్రెస్ లో భార్యల కోసం భర్తల ఆరాటం

తెలంగాణ కాంగ్రెస్ లో భార్యల రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నేతలు పోరాడుతున్నారు. ఈ రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఆయన స్ఫూర్తితో చాలమంది తయారయ్యారు.

Byline :  Vanaja Morla
Update: 2024-03-21 10:47 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో భార్యల రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నేతలు పోరాడుతున్నారు. ఈ రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డికి 4 సార్లు ఎమ్మెల్యే టికెట్స్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఆయన స్పూర్తితో మరికొంతమంది నేతలు తమ సతీమణులను పార్లమెంటుకి పంపించడానికి ఆరాట పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పార్లమెంటు టికెట్ తన భార్య నందినికి ఇవ్వాలని, భువనగిరి టికెట్ తన భార్య లక్ష్మికి ఇవ్వాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేత జగ్గారెడ్డి తన భార్య నిర్మలకి కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఖమ్మం సీటు కోసం పట్టుబట్టిన భట్టి నందిని...

ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి నందిని పట్టుబట్టారు. తన బలం చాటుకోవడానికి నందిని 500 కార్ల ర్యాలీతో గాంధీ భవన్ కి వచ్చి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ తనకే అని బలంగా చెప్పారు కూడా. అయితే ఈ టికెట్ కోసం పొంగులేటి ఫ్యామిలీ, తుమ్మల ఫ్యామిలీ కూడా పోటీ పడుతోంది. గతంలో రేణుకా చౌదరి కూడా ఖమ్మం ఎంపీ టికెట్ అడిగే హక్కు తనకే ఉందని బహిరంగ ప్రకటనలు చేశారు. ఆమెకి రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో భట్టి విక్రమార్క భార్యకి లైన్ క్లియర్ అయిందని అనుకున్నారు.

కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించాలని, కొడుకు యుగేందర్ కి టికెట్ ఇప్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు మంత్రుల కుటుంబాలు ఖమ్మం టికెట్ కోసం ఫైట్ చేస్తుంటే ఈ సెగ్మెంట్ లో ఎవరిని టికెట్ వరిస్తుందో అనే ఉత్కంఠ మొదలైంది.

భార్య కోసం భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...

తన భార్యని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా భువనగిరి పార్లమెంటు టికెట్ తన భార్య లక్ష్మికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అదే స్థానంలో మరో సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కొడుకు సూర్య పవన్ రెడ్డిని బరిలో దింపాలని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు ఈ టికెట్ కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ట్రై చేస్తున్నారు. ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ సహాయంతోనే నియోజకవర్గంలో పలు పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ పదవి దక్కకపోవడంతో భార్యని ఎంపీగా పోటీ చేయించాలి అనుకుంటున్నారు. ఇంకోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్య పవన్ రెడ్డిని వెంటబెట్టుకుని సీఎం రేవంత్ ని కలవడంతో.. భువనగిరి ఎంపీ టికెట్ వ్యవహారం చర్చనీయంశమైంది.

కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరతారంటోన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, పైళ్ల రాజశేఖర్ రెడ్డి కూడా భువనగిరి టికెట్ రేసులో ఉన్నారని సమాచారం. సొంత ఫ్యామిలీ నుంచే పోటీ ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి భార్యకి టికెట్ దక్కుతుందో లేదో ప్రశ్నార్ధకమే.

అర్ధాంగి కోసం జగ్గారెడ్డి ఆరాటం...

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా తన అర్ధాంగికి ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో పోటీ చేసి ఓడిపోవడంతో జగ్గారెడ్డి మౌనం వహించారు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇకమీదట సంగారెడ్డికి రాను.. కానీ, సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని మీడియా ముందే చెప్పారు. ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసే ఉద్దేశం కూడా లేదని చెప్పారు.

ఉన్నట్టుండి తన భార్యకి మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి కూడా గాంధీభవన్ లో మీడియా సమావేశం పెట్టి... తాను మెదక్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాని వెల్లడించారు. కాగా, ఈ స్థానానికి మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు కూడా పోటీ పడుతున్నారు. దీంతో భార్యకి టికెట్ తెచ్చుకోవడంలో జగ్గారెడ్డి సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాలి.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సక్సెస్...

ఈ నేతలు భార్యలకు టికెట్ ఇప్పించడానికి కష్టపడుతుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తన భార్య పద్మావతి కి నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్లు సాధించుకోగలిగారు. పద్మావతి కాంగ్రెస్ తరపున 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేయగా 2018 మినహా మిగిలిన రెండుసార్లు గెలిచారు. 2019 లో హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Tags:    

Similar News