అమిత్ షా ఏం చెప్పారు? క్లారిటీ ఇచ్చిన తమిళిసై

అమిత్ షా మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై తో సీరియస్ గా మాట్లాడుతున్న వీడియో బయటకి రావడంతో విపరీతమైన చర్చ మొదలైంది. రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2024-06-14 10:46 GMT

ఏపీలో చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం రోజున వేదికపై ఎందరికో భావోద్వేగ అనుభూతులు, అనేక ఆసక్తికర సన్నివేశాలు ఎదురయ్యాయి. తమ ప్రియతమ పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రమాణస్వీకారం కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో కోలాహలాన్ని నింపింది. పవన్ కళ్యాణ్ అన్నయ్య కాళ్ళకి నమస్కరించడం, మోదీనే తన అన్న చిరంజీవి వద్దకి తీసుకెళ్లడం, బాలయ్య తన చెల్లి భువనేశ్వరి నుదుటిపైన ఆత్మీయంగా ముద్దు పెట్టడం, వద్దన్నా వినకుండా లోకేష్ పవన్ కాళ్ళకి నమస్కరించడం... ఇలా ఒకటేమిటి చాలా ఆసక్తికర సన్నివేశాలు ఆ వేదికపైన నెలకొన్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటితో పాటు మరో సంఘటన కూడా అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంది. అదే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సీరియస్ గా మాట్లాడుతున్న సందర్భం.

ఈ వీడియో బయటకి రావడంతో దీనిపై విపరీతమైన చర్చ మొదలైంది. రకరకాల ఊహాగానాలు మీడియాలో, రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎట్టకేలకు రూమర్లకు చెక్ పెడుతూ తమిళిసై స్పందించారు. గురువారం రాత్రి ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. "తమిళనాడులో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి నేను అమిత్ షా గారిని ఏపీ లో కలిశాను. ఆయన నన్ను ఎన్నికల్లో ఎదురైన సవాళ్ల గురించి అడిగారు. నేను ఆ విషయాలు వివరిస్తుండగా ఎక్కువ సమయం లేకపోవడంతో... నియోజకవర్గం వివిధ రాజకీయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు" అని అమిత్ షా తో జరిగిన సంభాషణ గురించి క్లారిటీ ఇచ్చారు సౌందర రాజన్.

అసలు చర్చ ఏంటి?

వైరల్ గా మారిన వీడియోలో.. వేదికపైన తనకి నమస్కారం పెట్టి వెళ్ళబోతున్న తమిళిసై ని అమిత్ షా వెనక్కి పిలుస్తారు. ఆయన ఏ విషయమో అడిగితే తమిళిసై వివరిస్తుండగా ఆయన వేలు చూపించి వారిస్తూ సీరియస్ గా మాట్లాడినట్టు వీడియోలో ఉంది. అయితే, అన్నామలైతో తమిళిసై కి పొసగట్లేదని, ఈ విషయంలోనే ఆమెకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారంటూ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై హాట్ హాట్ గా చర్చలు నడిచాయి. మరోవైపు.. అగ్ర నేత అయినప్పటికీ పబ్లిక్ గా ఆమెపై కోపం ప్రదర్శించడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అనే విమర్శలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళిసై స్పందించారు. విమర్శలకు చెక్ పెట్టారు.  

Tags:    

Similar News