గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్

గణేష్ మండపం ఏర్పాటు ఈ నిబంధనలు పాటించాల్సిందే..;

Update: 2025-08-24 15:30 GMT

గణేష్ మండపాలకు, దుర్గామాత మండపాలకు విద్యుత్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండగ కొనసాగినన్ని రోజులు సదరు మండపాలకు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 27 ఆగస్టు 2025 నుంచి 6 సెప్టెంబర్ 2025 వరకు గణేష్ నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని మండపాలకు 11 రోజుల పాటు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే దుర్గామాత నవరాత్రి వేడుకలకు (9 రోజులు) ఉచిత విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని సూపరింటెండింగ్ ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ స్లిప్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చు వివరాలు ప్రొఫార్మా-1, ప్రొఫార్మా-2 రూపంలో సమర్పించాల్సిందిగా సూచించారు.

అయితే ప్రతి ఒక్కరూ కూడా అన్ని జాగ్రత్త ప్రమాణాలు పాటిస్తూ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అధికారులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల ఏర్పాట్లు నిబంధనలకు విరుద్ధంగా లేకుండా చూసుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా స్థానికులకు ఇబ్బందులు కలిగేలా మండపాలను ఎవరూ ఏర్పాటు చేయొద్దని కూడా సూచించారు. డీజే స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్ల ఏర్పాటు విషయంలో కూడా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు.

మండపం ఏర్పాటుకు నిబంధనలివే..

  • మండపం ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో పర్మిషన్‌ తప్పనిసరి. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పర్మిషన్‌ కోసం https://policeportal.tspolice.gov.in/index.htm అప్లై చేసుకొని అనుమతి తీసుకోవాలి.
  • విద్యుత్‌ కనెక్షన్‌ కోసం డీడీ కట్టండి. విద్యుత్ అధికారుల పర్మిషన్‌ తీసుకోండి.
  • మండపాల నిర్మాణ పనులు నిపుణులకు అప్పగించండి. విద్యుత్‌ పనులు సొంతంగా చేయొద్దు.
  • మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దు. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు.
  • డీజేలకు అస్సలు అనుమతిలేదు. రాత్రి 10గంటల తర్వాత మైక్‌ వాడొద్దు.
  • మైక్‌లు వాడేటప్పుడు సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉండాలి.
  • మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి.
  • వర్షాలను దృష్టిలో పెట్టుకొని మండపాలు, ఇతర ఏర్పాట్లు చేయాలి.
  • భక్తుల తాకిడికి తగినట్లుగా మండపాల వద్ద ఏర్పాట్లు తప్పనిసరి.
  • వాహనాలు పార్క్ చేసుకొనేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దు.
  • భక్తులను గైడ్‌ చేసేలా వాలంటీర్లను నియమించండి. ముఖ్యంగా ట్రాఫిక్‌, క్యూలైన్లను నియంత్రించేందుకు.
  • మండపాల దగ్గర శుభ్రత పాటించాలి.
  • పాయింట్‌ బుక్‌ ఏర్పాటు చేయాలి. మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల పూర్తి వివరాలు (పేరు, తండ్రిపేరు, ఫోన్‌ నంబర్‌, చిరునామా), కమిటీ ప్రెసిడెంట్‌/కన్వీనర్‌/సెక్రటరీ ఎవరో స్పష్టంగా నమోదు చేయాలి.
  • అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
  • విగ్రహం నిమజ్జనం కోసం ప్రభుత్వం/జీహెచ్‌ఎంఎసీ/పోలీస్‌ శాఖ సూచించిన అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాలి. పోలీస్‌ ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనబడేలా ప్రదర్శించాలి.
Tags:    

Similar News