ఢిల్లీకి బీసీ ఆర్డినెన్స్.. 42శాతం రిజర్వేషన్లు గాల్లో దీపమేనా..!
అనేక సందేహాలను వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.;
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రేవంత్ సర్కార్ చేసిన ఆర్డినెన్స్ కూడా ఢిల్లీకి చేరుకుంది. మూడు వారాలపాటు ఈ ఆర్డినెన్స్‌పై చర్చలు జరిపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా దీనిని కేంద్రానికి సిఫార్సు చేశారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం సిద్ధం చేసిన ఆర్డినెన్స్‌పై అడ్వకేట్ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవదులతో కూడా గవర్నర్ చర్చించారు. అనంతరం ఇప్పుడు ఆర్డినెన్స్‌కు కేంద్రానికి పంపారు. మూడు వారాలుగా ఆర్డినెన్స్.. గవర్నర్ దగ్గరే ఉంది. దీనిపై అనేక కోణాల్లో చర్చించిన తర్వాత ఆయన దీనిని ఢిల్లీకి పంపారు.
అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని అడ్వకేట్ జనరల్, న్యాయవాదులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. దానిని ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘిస్తుందా? లేదా? అని గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే న్యాయ సలహా కోసం ఆర్డినెన్స్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారు.
మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లకు రెడీ అవుతోంది. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తామని సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు బీసీలకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం రేవంత్ సహా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి.. కేంద్రానికి పంపింది. అక్కడ ఆలస్యం అవుతుండటంతో ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిశ్చయించింది. ఆ ప్రకారమే ఆర్డినెన్స్‌ను రెడీ చేసి గవర్నర్‌కు అందించింది. మూడు వారాలు దానిని పరిశీలించిన గవర్నర్.. ఇప్పుడు న్యాయసలహా నిమిత్తం ఆర్డినెన్స్‌ను కూడా ఢిల్లీకి పంపారు. దీంతో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల నిర్వహణ జరిగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఊరించి ఊరించి ఊసురూమనిపించినట్లు.. ఆర్డినెన్స్‌ను ఇన్నాళ్లూ తన దగ్గర ఉంచుకున్న గవర్నర్.. ఇప్పుడు అకస్మాత్తుగా ఢిల్లీకి సిఫార్సు చేయడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ కీలక పరిణామం తర్వాత తెలంగాణ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హామీ అమలవుతుందా అంటే విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. గవర్నర్ దగ్గర ఉన్నంత కాలం డెడ్‌లైన్‌లోపు జరుగుతుందేమో అన్న ఆశ ఉండేదని, ఇప్పుడు ఆర్డినెన్స్‌కు ఢిల్లీకి చేరడంతో రిజర్వేషన్లు అమలు కావడం అనేది గాల్లో దీపంలా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.