‘కళాకారులను ప్రోత్సహిస్తాం.. గద్దర్ అవార్డులు అందిస్తాం’
నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను కూడా ప్రోత్సహించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు భట్టి విక్రమార్క ప్రకటించారు.;
రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో కళాకారులను ప్రోత్సహించేలా ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. ప్రతి ఏటా ఇచ్చే నంది అవార్డులు కూడా ఏపీకి చేరాయి. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్ పాలించిన పదేళ్ల కాలంలో కళాకారులకు అందించే అవార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కానీ తమ ప్రభుత్వం మాత్రం అలా కాదని, అధికారంలోకి వస్తూనే కళాకారులను ప్రోత్సహిస్తూ నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని నిశ్చయించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఈ ఏడాది నుంచే తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో ఆయన స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే కళాకారులకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళలను ప్రోత్సహిస్తున్నదని, కళకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకువెళ్లే వారికి కావలసిన అన్ని రకాల వసతులు, సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు.
గత దశాబ్ద కాలంగా సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందలేదని, ప్రతి ఏటా వారికి ఇవ్వాల్సిన నంది అవార్డులు ఇవ్వకుండ గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకొని సినిమా కళాకారులకు గద్దర్ పేరిట గద్దర్ ఫిలిం అవార్డులను ఈ ఉగాది పండుగ నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందుకు కావలసిన అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను కూడా ప్రోత్సహించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాటక రంగ కళాకారులకు అవార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలను నిర్వహించి, నాటక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని వెల్లడించారు. భగవంతుడు అందరికీ కళలను ఇవ్వలేదని, కొంత మందికి మాత్రమే కళలను ఇచ్చాడని, భగవంతుడు ఇచ్చిన ఆ కళను ప్రజలకు పంచి కళకారులు సమాజ వికాసానికి దోహదపడాలని కోరారు.కళకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.