మీడియాకి తెలంగాణ హైకోర్టు వార్నింగ్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బుధవారం విచారణ జరిపిన హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-07-10 13:30 GMT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిపిన హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని పార్టీలు సంయమనం పాటించాలని కోర్టు సూచించింది. మీడియాని కూడా గోప్యత పాటించాలని హెచ్చరించింది.

జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలను బహిర్గతం చేయొద్దని మీడియాకి సూచించింది. వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించకూడదని కోర్టు నొక్కి చెప్పింది. ఈ నెల 23న కేంద్రం కౌంటర్ దాఖలు చేస్తుందని పేర్కొన్న హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ సున్నితమైన కేసుపై హైకోర్టు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని, ఈ వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దని అన్ని పక్షాలను కోరుతున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఎస్ఐబీ కార్యాలయంతోపాటు ఇతర ప్రైవేట్ ప్రదేశాల్లోనూ ప్రణీత్ రావు టీమ్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు తోపాటు పలువురు పోలీసు అధికారులను దర్యాప్తు అధికారులు విచారించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News