Hyderabad Murder | హైదరాబాద్ మాజీ సైనికుడి నుంచి బయటకొచ్చిన మృగం...
ఒక మనిషి మరొక మనిషి ఇలా చంపడం సాధ్యమా. అందునా మాజీ సైనికుడికి ఎలా సాధ్యమయింది?;
By : The Federal
Update: 2025-01-23 07:45 GMT
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని కత్తితో పొడిచి చంపి (Telangana Murder), ముక్కలు చేసి,కుక్కరులో ఉడికించి, ఎముకలను చూర్ణం చేసి చెరువు, డ్రైనేజీలో కలిపి ఎలాంటి ఆధారాలు లభించకుండా చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.(crime story)
మాజీ జవాన్ కుటుంబం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి సైన్యంలో పనిచేసి రిటైర్ అయి హైదరాబాద్ నగరంలోని మీర్ పేట పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూవెంకటేశ్వరకాలనీలో తన భార్య వెంకట మాధవి, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ దంపతులు తమ పెద్ద కుమార్తె వెంకటమాధవి (35)ని గురుమూర్తికి ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు.ఆర్మీలో పదవీ విరమణ చేసిన గురుమూర్తి కంచన్ బాగ్ ప్రాంతంలోని ఓ సెక్యూరిటీ సంస్థలో పని చేస్తున్నాడు.
- ఆర్మీలో రిటైరై ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గురుమూర్తి తన భార్య వెంకటమాధవి వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు.అంతే ఆమెను ఎలాగైనా హత్య చేసి, ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేయాలని మాజీ సైనికుడు వ్యూహం పన్నాడు.
వెంకటమాధవి అదృశ్యం
జనవరి 16వతేదీ మీర్ పేట పోలీసుస్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ ప్రాంత న్యూ వెంకటేశ్వరకాలనీ నివాసి వెంకటమాధవి (35) తో మాట్లాడుదామని ఆమె తల్లి ఉప్పల సుబ్బమ్మ ఫోన్ చేసింది. ఫోన్ పనిచేయలేదు. దీంతో హైదరాబాద్ నగరంలోనే ఉంటున్న తల్లి తన కుమార్తె ను కలుద్దామని న్యూ వెంకటేశ్వరకాలనీకి వచ్చింది. వెంకటమాధవి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అల్లుడు గురుమూర్తి చెప్పాడు.
పథకం ప్రకారం పిల్లల్ని అత్తారింటికి పంపించి...
సంక్రాంతి పండుగ పేరిట అంతకు ముందే తండ్రి అయిన గురుమూర్తి జనవరి 13వతేదీనే తన ఇద్దరు పిల్లల్ని అత్తారింటికి పంపించాడు. పిల్లలు లేని సమయం చూసిన గురుమూర్తి తన భార్యతో తరచూ గొడవ పడ్డాడు. ఆ గొడవతో భార్యను కత్తితో చంపి కడతేర్చాడు.
వెంకటమాధవి మిస్సింగ్ అంటూ ఫిర్యాదు
తన కుమార్తె వెంకట మాధవి కనిపించడం లేదని ఆమె తల్లి ఉప్పల సుబ్బమ్మ మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తాము మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని మీర్ పేట సెక్టార్ వన్ సబ్ ఇన్ స్పెక్టరు కె సుధాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తీగలాగితే డొంక కదిలింది...
వెంకటమాధవి అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తీగ లాగితే డొంక కదలినట్లు సీసీ టీవీ ఫుటేజీలో కీలక వీడియో లభించింది. వెంకటమాధవి 16వతేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త గురుమూర్తి చెబుతుండగా, ఇంటి నుంచి రోడ్డు వరకు ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు చూశారు. ఎక్కడా ఏ సీసీ టీవీ ఫుటేజీలోనూ వెంకటమాధవి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు వీడియో కనిపించలేదు. అంటే వెంకటమాధవిని భర్త గురుమూర్తి ఇంట్లోనే చంపేసి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీనికి తోడు గురు మూర్తి కవర్లు పట్టుకొని పలు సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మీర్ పేట ఇన్ స్పెక్టర్ కె నాగరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
భర్త గురుమూర్తిని అదుపులో తీసుకున్న పోలీసులు
భర్త గురు మూర్తిపైనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, దీంతో భర్త గురుమూర్తి వెంకటమాధవిని కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపి, ఆపై ఎలాంటి ఆధారాలు లభించకుండా చేశాడని పోలీసులు భావిస్తున్నారు.
భార్యను చంపి, ముక్కలు చేసి...
భార్య వెంకటమాధవిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త గురుమూర్తి ఇంట్లోని మటన్ కత్తితో ముక్కలుగా చేశాడని పోలీసులు భావిస్తున్నారు. మాంసాన్ని ఎముకల నుంచి వేరు చేసి దాన్ని కుక్కరులో నీటిలో కలిపి పలు సార్లు ఉడికించాడు. ఎముకలను కాల్చి ఎముకల పొడిని కవరులో వేసుకున్నాడు. కుక్కరులో ఉడికించిన ముక్కలను డ్రైనేజీలో పడేసి, భార్య ఎముకల పొడిని మీర్ పేట చంద చెరువులో కలిపేశాడు. ఎలాంటి ఆధారాలు లభించకుండా చేసేందుకు మాజీ జవాన్ అయిన గురుమూర్తి ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందం
వెంకటమాధవి దారుణ హత్య ఉదంతాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆధారాలు లభించడం కష్టంగా మారింది. వెంకటమాధవి మిస్సింగ్ కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఆధారాలు లభించలేదని మీర్ పేట సీఐ కె నాగరాజు , వనస్థలిపురం ఏసీపీ పి కాశీరెడ్డి లు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం రంగంలోకి దిగిన ఫొరెన్సిక్ అధికారులు
గురుమూర్తి ఇంట్లో వెంకటమాధవి హత్యోదంతం గురించి ఆథారాలు సేకరిస్తున్నారు. కుక్కరుతో పాటు మృతదేహాన్ని కోసేందుకు వినియోగించిన మటన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
కుక్కను చంపి...
భార్య వెంకటమాధవిని చంపి, ఆధారాలు లేకుండా చేయడానికి ముందే గురుమూర్తి కుక్కను చంపి దాన్ని ముక్కలను బయట పడేసి ఆధారాలు దొరకకుండా చేశాడని పోలీసులు చెబుతున్నారు. కుక్కను చంపినట్లుగా భార్య వెంకటమాధవిని చంపి సాక్ష్యాలు దొరక్కుండా గురుమూర్తి మాస్టర్ మైండ్ ఉపయోగించాడని పోలీసులు చెప్పారు.
ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం
వెంకటమాధవి హత్యోదంతంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. డ్రైనేజీలో పడేసిన శరీరభాగాలను సేకరిస్తే డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతురాలు వెంకటమాధవి అని గుర్తించే అవకాశముందని ఓ పోలీసు అధికారి చెప్పారు. చెరువులో పడేసిన ఎముకల పొడిని కూడా సేకరించే పనిలో పోలీసులున్నారు. భార్యను చంపి ఆనవాళ్లు లేకుండా చేసిన మాజీ జవాన్ కు షాక్ ఇస్తూ పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
న్యూ వెంకటేశ్వర కాలనీలో భయాందోళనలు
మాజీ సైనికుడైన గురుమూర్తి తన భార్యను అత్యంత పాశవికంగా చంపి, ముక్కలు కోసి, కుక్కర్ లో ఉడికించిన ఘటనతో న్యూవెంకటేశ్వర కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో గురుమూర్తి ఇంటి చుక్కపక్కల ఇళ్లలోని నివాసులు భయంతో ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. కాలనీలో ఎవరిని కదిలించినా వెంకటమాధవి హత్యోదంతం గురించి చెబుతున్నారు.