బీహార్‌లో మహాఘట్‌బంధన్ ఓటమికి దీపాంకర్ చెప్పిన మూడు కారణాలు..
నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రజల మధ్యకు వెళతామన్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ..
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో (Assemlby Polls) BJP-JD(U) ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.RJD- Congress మహాఘట్‌బంధన్ కూటమి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక ప్రజలు తిరస్కరించడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డాయి ఓటమి పాలైన పార్టీలు.
ఎన్డీఏ కూటమి విజయం వెనక మూడు కారణాలున్నాయని ప్రతిపక్ష సీపీఐ(ఎంఎల్)CPI(ML) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య ఆదివారం (నవంబర్ 17) పేర్కొన్నారు.
మొదటిది మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద మహిళలకు రూ. 10వేలు బదిలీ చేయడం, రెండోది ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఓటరు పేర్లను తొలగించడం, కలపడం, మూడోది కార్పొరేట్ సంస్థకు తక్కువ ధరకు భూమిని బదిలీ చేయడం అని చెప్పారాయన.
"మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 10వేలు నగదు బదిలీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యరూపం దాల్చే వరకు ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇది ఒక ప్రత్యేక ప్రయోగం" అని పేర్కొన్నారు.
S.I.R ద్వారా 65 లక్షల ఓట్లను తొలగించడం, ఎన్నికలకు ముందు తరువాతి దశలో 3.5-4 లక్షల ఓట్లు జోడించడం ఫలితాన్ని ప్రభావితం చేసిందని, ఇది రెండో ప్రయోగం అని చెప్పారు.
"బీహార్ వనరుల కార్పొరేటీకరణను సాధారణీకరించే" అవకాశం ఉందని కూడా దీపాంకర్ అన్నారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అయితే ప్రజలపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. ఈ "మూడు ప్రయోగాలు" రాబోయే కాలంలో భారత రాజకీయాల గమనాన్ని, ఎజెండాను నిర్ణయించవచ్చని అభిప్రాయపడ్డారు.
కారణాలను విశ్లేషిస్తాం..
‘‘నవంబర్ 18 నుండి 24 వరకు మా అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళతారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు’’ అని పేర్కొన్నారు దీపాంకర్.
‘‘చివరగా 2020 ఎన్నికల నుంచి మా ఓట్లు దాదాపు అలాగే ఉన్నాయి. కానీ సీట్ల సంఖ్య పడిపోయింది" అని చెప్పారు. ఈ సారి ఎన్నికలలో 20 సీట్లలో పోటీ చేసి కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుపొందింది. అదే 2020 ఎన్నికలలో 19 సీట్లలో పోటీచేసి 12 స్థానాలు దక్కించుకుంది.