కేరళలో BLO బలవన్మరణానికి కారణమేంటి?
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (S.I.R)పై రాజకీయ పార్టీల మాటేంటి?
కేరళ(Kerala) రాష్ట్రంలో S.I.R బూత్ లెవల్ ఆఫీసర్( BLO) ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌లోని ఆదివారం తన ఇంటి మొదటి అంతస్తులోని హాలులో ఉరివేసుకుని కనిపించాడు. పయ్యన్నూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న అనీష్ జార్జ్‌ను ఇటీవల BLOగా నియమించారు. అధిక పనిభారం, ఒత్తిడి కారణంగా జార్జ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని జార్జ్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి వార్తా సంస్థ PTI తో అన్నారు.
"అనీష్ జార్జ్ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వరకు పనిచేశాడని అతని కుటుంబసభ్యులు చెప్పారు. SIRకు సంబంధించిన ఫారాలను పూరించడం, వాటిని పంపిణీ చేయడం లాంటి పనులతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు,’’ అని విలేకరులకు చెప్పాడు.
S.I.R వ్యతిరేకిస్తున్న పార్టీలు..
కేరళలోని బీజేపీ మినహా అధికార సీపీఐ(ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ ఎస్ఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీజేపీ ఎజెండాను నెరవేర్చడానికి ఎన్నికల కమిషన్ S.I.R ప్రక్రియకు పూనుకుందని CPI(M) నాయకుడు MV జయరాజన్ ఆరోపించారు. ‘‘అధిక పనిభారం కారణంగా తన జీవితాన్ని ముగించడం తప్ప వేరే మార్గం లేదని జార్జ్ భావించి ఉండవచ్చు. అతని మరణం దురదృష్టకరం" అని ఆయన పేర్కొన్నారు.
‘దర్యాప్తు జరుగుతోంది..’
అయితే ఈ ఘటనపై కన్నూర్ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరినట్లు కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు కేల్కర్ తెలిపారు. "పోలీసు దర్యాప్తు కూడా జరుగుతోంది. BLOలు సమిష్టిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వారి పని ఒత్తిడి గురించి మాకు సమాచారం లేదు" అని కేల్కర్ విలేకరులతో అన్నారు. 31 రోజుల పాటు BLOలు SIR కి సంబంధించిన పని తప్ప మరే ఇతర పని చేయనవసరం లేదని, సాధారణంగా ఎటువంటి పని ఒత్తిడికి అవకాశం ఉండదని కూడా స్పష్టం చేశారాయన.
పశ్చిమ బెంగాల్‌లోనూ BLOలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. S.I.Rలో విపరీతమైన పని ఒత్తిడి ఉందని చెబుతున్నారు. BLO విధులు కేటాయించిన 50 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్త నమితా హన్స్‌డా నవంబర్ 9న స్ట్రోక్‌తో చనిపోయారు. తీవ్రమైన పనిఒత్తిడి కారణంగా చనిపోయిందని ఆమె భర్త చెప్పారు.
(ఆత్మహత్యలను నివారించవచ్చు. సహాయం కోసం, దయచేసి ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయండి: నేహా సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్ – 044-24640050; ఆత్మహత్య నివారణ, భావోద్వేగ మద్దతు & గాయం సహాయం కోసం ఆసరా హెల్ప్‌లైన్ +91-9820466726; కిరణ్, మానసిక ఆరోగ్య పునరావాసం 1800-599-0019, దిశ 0471- 2552056, మైత్రి 0484 2540530, స్నేహ ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ 044-24640050.)