రేపటి నుంచి శబరిమల వార్షిక తీర్థయాత్ర ప్రారంభం
భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు
కేరళ(Kerala) శబరిమల(Sabarimala) వార్షిక తీర్థయాత్ర నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 41 రోజుల మండల తీర్థయాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. అంతకుముందు రోజు సాయంత్రం (ఆదివారం ) గర్భగుడి తలుపులను తెరుస్తారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
కిలోమీటర్ల దూరం నడిచి వచ్చే అయ్యప్ప భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం బోర్డు పేర్కొంది. మార్గమధ్యంలో మంచినీరు, విశ్రాంతి బెంచీలు, "చుక్కువెల్లం" (ఎండిన అల్లం నీరు) పంపిణీ కేంద్రాలు, వేడి నీటిని అందుబాటులో ఉంచామని తెలిపింది. ఈ 41 రోజులు ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులు 24 గంటలు పనిలో ఉంటారని, ట్రెక్కింగ్ మార్గాల వెంట బయో-టాయిలెట్లను, పలు చోట్ల వివిధ భాషాల్లో సమాచార బోర్డులు, అక్కడక్కడా అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొంది. రద్దీ నియంత్రణకు పరిమిత సంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతించేలా చర్యలు తీసుకున్నామని టీడీబీ కొత్త అధ్యక్షుడు కె జయకుమార్ చెప్పారు.
భక్తులకు ఆరోగ్య శాఖ సూచన..
కేరళలో ఇటీవల బ్రెయిన్ ఫీవర్‌తో ముగ్గురు పిల్లలు చనిపోయారు. నదులు, చెరువుల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా బ్రెయిన్ ఫీవర్(brain fever)కు కారణమయ్యే అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 17 నుంచి శబరిమల(Sabarimala) వార్షిక తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తులు నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ సూచించింది. హెల్ప్‌లైన్ నంబర్ (04735 203232)ను కూడా ఏర్పాటు చేశారు.