టీబీ నియంత్రణలో తెలంగాణకు జాతీయ అవార్డు
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ జాతీయఅవార్డు గెలుచుకుంది.టీబీ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణకు ఈ అవార్డును అందించారు.;
By : The Federal
Update: 2025-03-25 00:08 GMT
దేశంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో తెలంగాణ రాస్ట్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. వరల్డ్ టీబీ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్వీ కర్ణన్,తెలంగాణ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఏ రాజేశంలకు సోమవారం అవార్డును అందించారు.
- తెలంగాణలో 100 రోజుల్లో టీబీ టెస్టులు, నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో మంచి పనితీరు కనబరిచింది. 100 రోజుల పాటు నిర్వహించిన నిక్షయ కార్యక్రమంలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబర్చి జాతీయ అవార్డును సాధించింది.ప్రపంచ టీబీ దినోత్సవం 2025 సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణలో ఎంపిక చేసిన 9 జిల్లాల్లో వందశాతం టీబీ పరీక్షలు చేసి తెలంగాణ టీబీ విభాగం జాతీయ అవార్డును గెల్చుకుంది.
టీబీని ముందుగా గుర్తిస్తే...
క్షయవ్యాధిని ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని తెలంగాణ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఏ రాజేశం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.‘‘మీరు నిరంతరం దగ్గు, జ్వరం లేదా వివరించలేని విధంగా బరువు తగ్గడం గమనించినట్లయితే, దానిని విస్మరించవద్దు—పరీక్ష చేయించుకుని చికిత్స చేయించుకోండి ’’అని ఆయన సూచించారు. 100 రోజుల టీబీ-ముక్త్ భారత్ అభియాన్ ఎంత అద్భుతమైన ప్రయాణం.
టీబీ రహిత తెలంగాణ
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టి టీబీ రహిత తెలంగాణను సాధిద్దామని వైద్యులు పిలుపునిచ్చారు. నిక్షయ మిత్రగా పేరు నమోదు చేసుకొని టీబీ ఉన్నవారికి అండగా నిలుద్దామని కోరారు.టీబీపై అవగాహనను వ్యాప్తి చేస్తూనే ఉందామని, టీబీ నివారించదగినది, నయం చేయవచ్చని వైద్యులు చెప్పారు.
టీబీ లక్షణాలు
దగ్గు ఒక్కటే టీబీకి లక్షణం కాదని వైద్యులు చెప్పారు. తెమడతో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడటం, జ్వరం, ఛాతిలో నొప్పి, అలసట, నీరసం, శరీర భాగంలో గుళ్లలు, వాపు రావడం, రాత్రిపూట చెమట పట్టడం లాంటివి టీబీ వ్యాధి లక్షణాలు. టీబీ లక్షణాలుంటే మీ ఆరోగ్య కార్యకర్తను కలవాలని వైద్యాధికారి సూచించారు.
టీబీ నిర్ధారిస్తే నెలకు రూ.500 పోషణ భత్యం
జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీ వ్యాధి నిర్ధారణ అయితే రోగికి నెలకు రూ.500 చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని తెలంగాణ టీబీ విభాగం వైద్యాధికారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టీబీ నిర్ధారణ పరీక్షలు, మందులను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు రోజువారీ మందులతో టీబీ నివారణ మరింత సులభంగా మారిందని ఆయన చెప్పారు.
ప్రపంచ టీబీ దినోత్సవం
ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమాన్ని వైద్యాధికారులు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టీబీపై అవగాహన కల్పించేందుకు వీలుగా క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.టీబీ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్లలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతోపాటు విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
Telangana achieved best national performance award in NAAT testing during 100-Days campaign.The Award was received from Hon'ble Minister for Health & Family Welfare GoI Sri JP Nadda by Sri R V Karnan, IAS, MD NHM TG and Dr A Rajesham, JD (TB) during World TB Day2025 New Delhi. pic.twitter.com/IuM71PDgwX
— State TB Cell, Telangana (@StateTb) March 24, 2025
100రోజుల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్
వంద రోజుల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద లక్షమంది ని-క్షయ మిత్రల రిజిస్ట్రేషన్ చేశారు. 13లక్షల టీబీ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించారు. ఏఐ సాంకేతికతతో ఎక్స్ రే యంత్రాలతో నాట్ అడ్వాన్స్ పరీక్షల ద్వారా టీబీ రోగులను గుర్తించారు. 836 నిక్షయ్ వాహనాల ద్వారా 10కోట్ల మందికి టీబీ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో 27వేల మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.