ఒకవైపు ఉగ్రదాడులు..మరోవైపు అందాల పోటీలు
దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా వెంటనే దాని ప్రభావం హైదరాబాదులో కనబడుతాయి;
దేశంలో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. శ్రీనగర్లోని పహల్గాంలో(Pahalgam) ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో పదులసంఖ్యలో బుల్లెట్ గాయాలు తగిలి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. పహల్గాంలోని బైసరన్(Baisaran) మారణకాండ నేపధ్యంలో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా వెంటనే దానిమూలాలు హైదరాబాదులో కనబడుతాయి. కాబట్టి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కన్నా హైదరాబాద్(Hyderabad) ముఖ్యంగా ఓల్డ్ సిటీ(Old City)లో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారిపోతాయి. దీని నేపధ్యంగురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఇపుడు విషయం ఏమిటంటే మేనెల 7వ తేదీనుండి 31వ తేదీవరకు మిస్ వరల్డ్-2025 పోటీలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలంటే ప్రపంచం మొత్తంమీద ఎంతటి ప్రతిష్టాత్మకమైన ఈవెంటో అందరికీ తెలిసిందే. సుమారు 150 దేశాల నుండి సుందరీమణులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈవెంటును కవర్ చేయటానికి ప్రపంచదేశాల్లోని 3 వేలమంది మీడియా వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు కాకుండా చాలాదేశాలకు చెందిన అత్యున్నత స్ధాయి అధికారులు, ప్రపంచప్రఖ్యాత అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు తెలంగాణాలోనే సుమారు 3 వారాలపాటు బసచేయబోతున్నాయి. మిస్ వరల్డ్-2025 పోటీలను రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటినుండో ఏర్పాట్లుచేస్తోంది.
ఒకవైపు పోటీలతేదీ దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో సడెన్ గా ఉగ్రవాదులు బైసరన్ లో పర్యాటకులపై విరుచుకుపడ్డారు. దాంతో దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు హైదరాబాదులో కూడా టెన్షన్ మొదలైంది. మామూలుగానే తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదులో ఉగ్రవాదుల వేటలో టెన్షన్ పెరిగిపోతుంటుంది. అలాంటిది ఇపుడు అందాలపోటీల దగ్గరపడుతున్న సమయంలో ఉగ్రవాదుల వేట అంటే ఇంకెంత టెన్షన్ పెరిగిపోతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఎందుకంటే మిస్ వరల్డ్(Miss World-2025) పోటీల్లో పాల్గొనేందుకు వచ్చేవారందిరినీ ప్రభుత్వం తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం(Ramappa Temple), ఓల్డ్ సిటిలోని ఛార్మినార్(Charminar), బడేచౌడీ ప్రాంతాల్లో తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఛార్మినార్ దగ్గర అందగత్తెలతో క్యాట్ వాక్ ఏర్పాట్లు కూడా జరుగుతోంది. ఓల్డ్ సిటీలోనే ఉన్న చౌమహల్లా ప్యాలెస్ లో వెల్కండిన్నర్ కూడా ఏర్పాటుచేస్తోంది. ఛార్మినార్, బడేచౌడీ, చౌమహల్లా ప్యాలెస్ అంటే ఓల్డ్ సిటీలోని ప్రముఖ ప్రాంతాలు. ప్రతిరోజు పై రెండు ప్రాంతాలు కొన్ని లక్షలమందితో రద్దీగా ఉంటుంది.
ఉగ్రవాదుల దాడి నేపధ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పంపిన హై అలెర్ట్ ఓల్డ్ సిటీకే ఎక్కువగా వర్తిస్తుంది. అందుకనే ఎక్కడెక్కడి ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీలు, హైదరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీలో సెర్చ్ ఆపరేషన్లు కండక్ట్ చేస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లు ఎన్నిరోజులు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ఈ నేపధ్యంలోనే అందాలపోటీలకు హాజరయ్యే సుందీరమణులను ఓల్డ్ సిటీలో తిప్పినపుడు జరగరానిది జరిగితే ఇంకేమన్నా ఉందా ? ప్రపంచదేశాల ముందు మనదేశం, తెలంగాణ పరువు ఏమైపోతుంది ? అలాగే భూదాన్ పోచంపల్లి, నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట దేవాలయం, రామప్పదేవాలయం కూడా ఒకపుడు మావోయిస్టులకు గట్టిపట్టున్న నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు ఆపరేషన్ కగార్(Operation Kagar) ను తట్టుకోలేక మావోయిస్టు(Maoists)లు శాంతిచర్యలు జరపండి బాబూ అని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను మొత్తుకుంటున్నారు. ఇదేసమయంలో గతంలో ఉగ్రవాదులు, తీవ్రవాదుల జాడలు నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కూడా బయటపడ్డాయి.
కాబట్టి ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ కగార్ ను దృష్టిలో పెట్టుకుని రేవంత్ ప్రభుత్వం అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం చాలావుంది. భద్రతా ఏర్పాట్లపరంగా ఏచిన్న పొరబాటు జరిగినా పైన చెప్పుకున్నట్లు ప్రపంచదేశాల ముందు పరువుపోవటం ఖాయం. మిస్ వరల్డ్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాల కోసమే ఉగ్రవాదులు, మావోయిస్టులు కూడా కాచుకుని కూర్చుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నపుడే దాడులుచేసి దేశాన్ని అప్రతిష్టపాలు చేయాలన్నది వీళ్ళ ఆలోచన. కాబట్టి మిస్ వలర్డ్ పోటీల నిర్వహణ ఇపుడు రేవంత్ ప్రభుత్వానికి కత్తిమీద సాము అయ్యింది అనటంలో ఎలాంటి సందేహంలేదు. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం ఎలాగ నిర్వహిస్తుందో చూడాల్సిందే.