దసరా పండుగ వేళ పంజరంలో పాలపిట్టల బందీ

దసరా పండుగ వేళ జమ్మి చెట్టుకు పూజ చేసి పాలపిట్టల దర్శనం కోసం ఈ పక్షులను పంజరంలో బంధించి అది తినే ఆహారం పెట్టకుండా ఇంతలా హింసించాలా?

Update: 2025-09-28 03:36 GMT
ప్రకృతిలో స్వేచ్ఛగా ఎగురుతున్న పాలపిట్ట : దసరావేళ పంజరంలో బందీ (ఫొటో క్రెడిట్ : హైదరాబాద్ బర్డింగ్ పాల్స్)

దసరా పండుగ (Dussehra festival)సందర్భంగా అక్టోబరు 2వతేదీన తెలంగాణలో విజయాన్ని కాంక్షిస్తూ జమ్మిచెట్టుకు పూజలు చేసి పాలపిట్టలను(Indian roller) దర్శించుకుంటుంటారు. దీని కోసం తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి అయిన పాలపిట్టలను కొందరు వేటగాళ్లు పంజరంలో బంధించి తీసుకువచ్చి పాలపిట్టలను దర్శనం చేయిస్తున్నారు. డబ్బు కోసం వేటగాళ్లు పాలపిట్టలను బంధించి హింసిస్తుండటంతో పాలపిట్టల సంఖ్య తగ్గిపోతున్నాయి. ఇలానే సాగితే తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలు అంతరించి పోయే ప్రమాదముందని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.




 రంగంలోకి దిగిన యాంటీ పోచింగ్ స్క్వాడ్ , పక్షిప్రేమికుల బృందాలు

దసరా సమీపిస్తున్న వేళ పాలపిట్టలను(Indian roller) పంజరాల్లో బంధించిన వేటగాళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ , పక్షిప్రేమికుల బృందాలు రంగంలోకి దిగాయి.విజయదశమిని విజయాలకు సంకేతంగా భావిస్తుంటారు...దసరా రోజు గ్రామ శివారులోని ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి శమీ వృక్షాన్ని పూజించి వేడుకలు జరుపుకుంటారు. నీలం, పసుపు రంగుల కలయికతో అందంగా కనిపించే పాలపిట్టను దర్శించుకోవడం విజయానికి ప్రతీకగా భావిస్తారు.



 పాలపిట్ట దర్శనం

రావణుడితో యుద్దానికి బయలు దేరిన రాముడికి పాలపిట్ట దర్శనమివ్వడం విజయం సాధించారని ప్రతీతి. అజ్ధాత వాసం తర్వాత పాండవులు విజయదశమి వేళ జమ్మిచెట్టును పూజించి దానిపై ఉంచిన ఆయుధాలను తీసుకుంటున్నపుడు వారికి పాలపిట్ట దర్శనం ఇచ్చిందని చెబుతుంటారు. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపరయుగంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు.దీనివల్ల పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్ర పక్షిగా ఇండియన్ రోలర్

పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ (Indian roller) ను తెలుగు భాషలో ముద్దుగా పాలపిట్ట అని పిలుస్తారు.దీని శాస్త్రీయ నామం Coracias benghalensis. దీన్ని బ్లూ బర్డ్ గా పిలుస్తుంటారు.12 నుంచి 13 అంగుళాల పొడవు, 26 అంగుళాల రంగురంగుల రెక్కలతో 176 గ్రాముల బరువున్న పాలపిట్టల ముఖం, గొంతు గులాబీరంగులో ఉంటుంది. పాలపిట్ట తల వెనుకభాగం గోధుమరంగులో, పిరుదులపై నీలం రంగు, తోకపై విభిన్నమైన లేత ముదురు నీలం రంగుతో ప్రకాశవంతంగా అందంగా కనిపిస్తుంటాయి. పాలపిట్టల సంఖ్య గడచిన పన్నెండేళ్లలో 30 శాతం తగ్గిపోయాయని నిపుణుల నివేదిక చెబుతోంది. తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో రాష్ట్ర పక్షిగా పాలపిట్టను గుర్తించారు. ఇండియన్ రోలర్ (పాల పిట్ట) రంగురంగులతో ఎగురుతూ విన్యాసాచేస్తుంటాయి. ఈ పిట్టలు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే కీటక భక్షక జాతి.




 రైతు మిత్ర పాలపిట్టను కాపాడటం మన కర్తవ్యం

మన రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట, తన అందమైన రంగులతో మాత్రమే కాకుండా పంటలపై ఆశించిన క్రిమికీటకాలను తింటూ రైతులకు మిత్రుడిగాను పేరుపొందింది.ఇది పంట పొలాల్లో పురుగులను తిని పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది.పాలపిట్టల వేట,పంటలపై రసాయనాల అధిక వాడకం, అడవులను నరికివేస్తుండటం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతుందని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరికృష్ణ ఆడెపు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘పాలపిట్ట మన రాష్ట్రానికి గర్వకారణం. దాన్ని రక్షించడం మనందరి బాధ్యత. అడవులను కాపాడటం, రసాయనాలు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం,ప్రజల్లో అవగాహన పెంచడం... ఇవన్నీ కలిపి మనం చేయగల చిన్న చిన్న ప్రయత్నాలు, కానీ దీని ఫలితంగా పాలపిట్టల సంరక్షణలో పెద్ద మార్పు తీసుకురాగలవు’’ అంటూ హరికృష్ణ ఆడెపు వివరించారు.

పాలపిట్టను చూడటం శుభసూచకం
దసరా పండుగ రోజు పాలపిట్టను చూడటం శుభసూచకంగా ప్రజలు భావిస్తుంటారు. గతంలో అధికంగా కనిపించే పాలపిట్టలు నేడు తగ్గాయి.పంటలపై పురుగుమందుల వినియోగం, కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ నగరం వల్ల పాలపిట్టలు అంతరించి పోతున్నాయి. అంతరించిపోతున్న పక్షి జాతిగా పాలపిట్టను ప్రభుత్వం గుర్తించి వీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టింది. పాలపిట్టలు పర్యవరణానికి ఎంతో మేలు చేస్తుంటాయి. అడవుల నరికివేత, వల్ల పక్షిజాతులు మనుగడ సాధించలేకపోతున్నాయి. దేశంలో 1300 రకాల పక్షిజాతులుండగా, వీటిలో 942 పక్షులపై అధ్యయనం చేశారు.ప్రధానంగా 178 పక్షిజాతులను సంరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.



 ఎక్కడ ఉంటాయంటే...

పాలపిట్టలు వర్షపాతం ఎక్కువగా లేని మెట్టప్రాంతాలు, గడ్డి మైదానాలు, బీడు భూములు, చిట్టడవులు వీటికి ఆవాసాలు. ఇవి క్రిమికీటకాలు, చిన్న సరీసృపాలు, ఉభయచరాలను ఆహారంగా తింటాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరిట గడ్డి మైదానాలను తొలగించడంతో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. పంటలకు నష్టం చేసే చీడపీడలు, క్రిమికీటకాలను తినే పాలపిట్టలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. పంటలకు క్రిమికీటకాలు ఆశించకుండా మందులను పిచికారి చేస్తుండటంతో పాలపిట్టలు ప్రమాదంలో పడుతున్నాయని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణపు సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పెద్ద చెట్ల తొర్రల్లో ఉండే పాలపిట్టలకు ఆవాసాలు చెట్లను నరికివేయడం వల్ల కొరవడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆవాసాలు లేక సంతానోత్పత్తికి విఘాతం కలుగుతోందని, దీనివల్ల నగరాలు,పట్టణాల్లో పాల పిట్టల సంఖ్య తగ్గిపోతుందని సుమన్ పేర్కొన్నారు.

పాలపిట్టలకు రక్షణ ఏది?
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 పాలపిట్టలకు రక్షణ కల్పిస్తుంది.వీటిని పట్టుకున్నా, బంధించినా, ప్రదర్శించినా నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ కలిపి విధిస్తారు. ఇదే నేరం రెండో సారి చేస్తే ఏడేళ్ల కారాగార శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తారు.చట్టాలున్నా పాలపిట్ట రక్షణ కొరవడింది.చట్టాలున్నా వేటగాళ్లు పాలపిట్టలను పంజరాల్లో బంధిస్తున్నారు.



 పంజరంలో పాలపిట్ట

తెలంగాణ రాష్ట్ర పక్షి పాల పిట్టను ఇండియన్ రోలర్ అంటారు.‘‘దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో దీన్ని చట్టవిరుద్ధంగా బంధించి బోనులో ఉంచడం వల్ల తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. దీనివల్ల పాలపిట్టల సంఖ్య తగ్గిపోతుంది’’అని అంటారు హైదరాబాద్ నగరానికి చెందిన వాయిస్ ఆఫ్ నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్ వర్మ. పాలపిట్టల సంరక్షణకు తెలంగాణాలోని పక్షి ప్రేమికులంతా కలిసి కదలాలని ఆయన పిలుపునిచ్చారు. పాలపిట్టల సంరక్షణ కోసం పదేళ్లుగా కార్యక్రమాలు చేస్తున్న వాయిస్ ఆఫ్ నేచర్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దసరా సందర్భంగా తాము పంజరంలో బంధించిన పాలపిట్టలను పట్టుకొని వాటికి అటవీశాఖ పక్షుల ఆసుపత్రి, పునరావాస కేంద్రంలో చికిత్స చేపించి, వాటిని ప్రకృతిలో వదిలి వేస్తున్నామని శివకుమార్ వర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీని కోసం తాము అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ తో కలిసి తనిఖీలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఆవాసాలు లేక తగ్గుతున్న పాలపిట్టలు
వ్యవసాయ పొలాల దగ్గర సాధారణంగా కనిపించే ఇండియన్ రోలర్ ఫార్మర్ ఫ్రెండ్లీ పక్షి.ఈ పిట్టలు కీటకాలు, ఎలుకలను తినడం వల్ల పంటలను పరోక్షంగా రక్షిస్తుంటాయి. పంటలపై తెగుళ్లను నియంత్రించడంలో పాలపిట్టలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాలపిట్టల గూళ్లున్న పాత, ఎండిన చెట్లను నరికివేయడం, వ్యవసాయంలో పురుగుమందులను విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఆవాస నష్టం కారణంగా వీటి సంఖ్య తగ్గుతోందని శివకుమార్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.



 దసరా సందర్భంగా ఏం చేస్తారంటే...

దసరా పండుగ వస్తుందంటే చాలు ఈ పాల పిట్టలను అక్రమంగా పట్టుకోవడం వల్ల వీటి మనుగడకు ముప్పు తలెత్తింది.వీటిని తరచుగా ప్రదర్శన కోసం రోజులు లేదా వారాల పాటు పంజరాల్లో ఉంచుతున్నారు. దీనివల్ల అవి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. కీటక భక్షక పక్షులైన పాలపిట్టలకు వేటగాళ్లు పండ్లు, కూరగాయలు పెడుతుంటారు. ఈ పాలపిట్టలు వాటిని తినవు. దీంతో ఇవి ఆకలితో అలమటిస్తూ కుంగి కృశించి పోతుంటాయి.

పాలపిట్టల రెస్క్యూ‌కు బృందాలు
దసరా సందర్భంగా పాలపిట్టలకు పంజరాల్లో బంధించి ప్రజలకు చూపించి సొమ్ము చేసుకునేందుకు కొందరు వేటగాళ్లు రంగంలోకి దిగారు. దీంతో అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ , పక్షిప్రేమికుల బృందాలు హైదరాబాద్ నగరంలో రంగంలోకి దిగి తనిఖీలు చేసి బంధించిన పాలపిట్టలను రక్షిస్తామని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ కీలక ప్రతినిధి ఫణికృష్ణ రావి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాలపిట్టల కాళ్లకు తాళ్లు కట్టి వాటిని బంధించడం వల్ల వాటి ఎగిరే శక్తి కోల్పోతాయి.ఎగరడానికి శక్తిని కోల్పోవడం వల్ల కొన్ని మాత్రమే జీవించగలుగుతాయని ఆయన పేర్కొన్నారు.



 పక్షుల పునరావాస కేంద్రానికి పాలపిట్టలు

పాలపిట్టలను వేటగాళ్ల బారి నుంచి రక్షించి వాటిని అటవీశాఖ వన్యప్రాణుల పునరావాస కేంద్రానికి తరలించి అక్కడి పశువైద్యులతో వైద్యం చేపిస్తారు. వాస్తవానికి పాలపిట్టలు ఏ ప్రాంతంలో పెరిగితే వాటిని అక్కడే వదిలేయాలి. కానీ వేటగాళ్లు వీటిని ఎక్కడ నుంచి పట్టుకు వచ్చారో చెప్పరు కాబట్టి కోలుకున్న పాలపిట్టలను ఇతర ప్రాంతాల్లో వదిలినా వాటి మనుగడ సవాలుగా మారుతుంది.

పాలపిట్టలను హింసించొద్దు
దసరా సందర్భంగా డబ్బుల కోసం వేటగాళ్లు పాలపిట్టలను బంధించి వాటిని హింసించవద్దని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల విభాగం ఓఎస్డీ ఎ శంకరన్ కోరారు.పాలపిట్టల కాళ్లకు తాళ్లు కట్టడం వల్ల కాళ్లకు గాయాలవుతున్నాయి. మరో వైపు పిట్టలను సంచుల్లో వేసుకొని రావడంతోపాటు అవి తినే కీటకాల ఆహారం అందక అవి బలహీనపడుతున్నాయి. స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ క్రిమికీటకాలను తినే పాలపిట్టలను పంజరాల్లో బంధించడం వల్ల అవి పడే బాధలను చూసైనా ప్రజల్లో మార్పు రావాలి అంటారు అటవీశాఖ అధికారి ఎ శంకరన్. రైతులకు మేలు చేస్తున్న పాలపిట్టలకు మనం హాని తలపెట్టడం ఎంతవరకు సమంజసం అని శంకరన్ ప్రశ్నించారు.

దసరా వేళ పాలపిట్టలను ప్రకృతిలో చూడండి కానీ పంజరంలో చూడొద్దు
ఈ అందమైన పాలపిట్టలను ప్రకృతిలోని వాటి సహజ ఆవాసాల్లోనే దసరావేళ చూసి ఆనందించాలని వాయిస్ ఆఫ్ నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్ వర్మ సూచించారు.పాలపిట్టలను పంజరంలో కాకుండా ప్రకృతిలో వాటిని చూడండి అంటూ ఆయన పిలుపునిచ్చారు.


Tags:    

Similar News