కోటికి పైగా మొక్కలు నాటి వనజీవిగా జీవనయానం సాగించి పద్మశ్రీ అవార్డు పొందిన దరిపెల్లి రామయ్య కన్నుమూసినా, ఆయన ఖమ్మం జిల్లాలో హరితయాత్రపై రగిల్చిన స్ఫూర్తి కొనసాగుతోంది.రామయ్య బాటలో పయనిస్తూ పలువురు ప్రకృతి ప్రేమికులు మహోద్యమంలా మొక్కలు నాటుతున్నారు.
- మెడలో ‘వృక్షో రక్షతి రక్షిత :’ చక్రం,పెట్టుకొని విత్తనాలు సేకరిస్తూ, మరో వైపు ఆ విత్తనాలను అడవుల్లో చల్లుతూ, మొక్కలు నాటుతూ అనునిత్యం పచ్చదనం కోసం ఆరాటపడి భారతదేశ ట్రీ మ్యాన్ గా పేరొందిన వనజీవి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య అంటే తెలంగాణలో తెలియని వారుండరు. మొక్కల పెంపకాన్ని మహోద్యమంలా చేపట్టి ఒక సెలవు అంటూ సుదూర తీరానికి తరలివెళ్లినా, ఆయన ప్రజల్లో పచ్చదనం పట్ల రగిల్చిన స్ఫూర్తి కొనసాగుతూనే ఉంది.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామగ్రామాన, పట్టణాల్లో రామయ్య స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. రామయ్యకు నివాళిగా గ్రీన్ వారియర్స్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటుతూనే ఉన్నారు. భావితరాలకు ప్రాణవాయువు అందించేలా మొక్కలు నాటాలని కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఎందరో పర్యావరణ ప్రేమికులు మొక్కలు నాటే ఉద్యమంలో చేరారు.రామయ్య బాటలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలాది మంది హరిత వారియర్స్ గ్రామగ్రామాన వెలిశారు.
- గ్రీన్ భద్రాద్రి పేరిట సంఘంగా ఏర్పడి పచ్చదనం కోసం పరితపిస్తున్నారు. మరో వైపు కొత్తగూడెంలో మొక్కలు నాటుతూ, మొక్కలను బహుమతిగా ఇస్తూ రాజశేఖర్ ఇటీవల మోదీకి మన్ కీ బాత్ వార్తల్లోకి ఎక్కారు.
తాతయ్య బాటలో మనవడు దరిపెల్లి శశికుమార్
తన తాతయ్య రామయ్య చూపిన బాటలో ఆయన మనవడు దరిపెల్లి శశికుమార్ నడుస్తానని ప్రకటించారు.వృత్తిరీత్యా క్రికెట్ జాతీయ క్రీడాకారుడిగా రాణించేందుకు బెంగళూరులో శిక్షణ పొందుతున్నా దరిపెల్లి శశికుమార్ తన తాత రామయ్య మరణవార్త తెలుసుకొని హుటాహుటిన బెంగళూరు నుంచి ఖమ్మంకు వచ్చారు. తాత అంత్యక్రియలు పూర్తి చేసిన శశికుమార్ తాను తాత చూపించిన మార్గంలో, ఆయన అడుగు జాడల్లో నడుస్తానని ప్రకటించారు. తాత నాటిన కోటికి పైగా మొక్కలను సంరక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని దరిపెల్లి శశికుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బాల్యంలో తాను తాతతో కలిసి మొక్కలు నాటేందుకు, విత్తనాలు చల్లేందుకు వెంట తిరిగానని ఆ స్ఫూర్తితో తాను తాత పద్మశ్రీ రామయ్య మ్యూజియంను ఏర్పాటు చేసి, తాత హరిత యాత్రను కొనసాగిస్తానని శశికుమార్ వివరించారు.
అడవుల్లో 18 లక్షల విత్తనాలు చల్లాను : ప్రకృతి ప్రకాష్, సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి ప్రకాష్ గత 22 సంవత్సరాలుగా వనజీవి రామయ్య ను ఆదర్శంగా తీసుకొన చెట్ల కింద రాలిన 18 లక్షల విత్తనాలను సేకరించి వాటిని విత్తన బంతులు చేసి డ్రోన్ల సాయంతో అడవుల్లో వెదజల్లారు. నేలరాలిన భారి వృక్షాలను క్రేన్ల ద్వారా రీప్లాంటేషన్ చేశానని ప్రకాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తన బైక్ ను గ్రీన్ గా మార్చి మైకు సహాయంతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తున్నానన్నారు.
గ్రీన్ భద్రాద్రికి శ్రీకారం
భద్రాచలంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన వైవి గణేష్ రామయ్య స్ఫూర్తితో ఈ ప్రాంతంలోని భద్రాచలం, చర్ల, మణుగూరు ప్రాంతాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రజలను మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. భద్రాచలంలో హరితహారం కోసం గ్రీన్ భద్రాద్రిని ఏర్పాటు చేశారు. గ్రీన్ చర్ల పేరిట మొక్కలు నాటించి పద్చదనాన్ని పెంచారు. ఎకో మణుగూరు పేరిట మొక్కలు నాటించారు. ప్రస్థుతం గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ అధ్యక్షులు, యేగి సూర్య నారాయణ, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఆకిశెట్టి ఉమా శంకర్ నాయుడు, గౌరవాధ్యక్షులు జీఎస్ శంకర్, పల్లింటి దేశప్ప, గోళ్ళ భూపతి రావు, కామిశెట్టి కృష్ణార్జునరావు, భీమవరపు వెంకట రెడ్డి తదితరులు మొక్కలు నాటుతున్నారు.
పర్యావరణం కోసం ముమ్మర ప్రచారం
వాడి పారవేసే ప్లాస్టిక్ ను నివారించండి పర్యావరణాన్ని రక్షించండి అంటూ డాక్టర్ కడవెండి వేణుగోపాల్ కోరుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అడవులు, గుట్టలపై విత్తనాలు చల్లుతూ పచ్చదనం కోసం శ్రమిస్తున్న వేణుగోపాల్ కు పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు లభించింది. కామేపల్లి మండలం పాత లింగాల గ్రామానికి చెందిన వేణుగోపాల్ మొక్కలు నాటడం, విత్తనాలు చల్లడం, గో సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. తాను చేస్తున్నసేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తనకు పర్యవరణ మిత్ర జాతీయ అవార్డును అందజేసిందని వేణుగోపాల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వన జనార్దన్
నిజామాబాద్ నగరంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూనే మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంచుతూ వన జనార్దన్ ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ శంకర్ భవన్ స్కూల్ లో విద్యార్థుల చేత 5000 సీడ్ బాల్స్ తయారు చేయించారు.మొక్కలు నాటడం, విత్తనాలు చల్లడం, మట్టిగణపతులను పంపిణీ చేయడం తన లక్ష్యాంటారు గ్రీన్ జనార్దన్. ఇల్లెందులో సింగరేణిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే దాట్ల వెంకటేశ్వర్లు మొక్కలు నాటుతున్నారు. - వరంగల్ నగరానికి చెందిన కె ప్రకాష్ వ్యత్తిరీత్యా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయినా ఆయన ప్రవృత్తి మాత్రం మొక్కలు నాటడం. రామయ్య చూపిన బాటలో ప్రకాష్ పయనిస్తూ మొక్కలు నాటుతూ ముందుకు సాగుతున్నారు.
గ్రీన్ వారియర్
భద్రాచలంలో రామయ్య ప్రియశిష్యుడైన శ్రీరంగం సంపత్ కుమార్ వృత్తి రీత్యా హోంఫుడ్స్ వ్యాపారం చేస్తున్నా,తీరిక వేళల్లో మొక్కలు నాటుతుంటారు. వనజీవి రామయ్య చూపించిన బాటలో సంపత్ కుమార్ పయనిస్తూ మొక్కలు నాటుతూ ఎందరికో ప్రాణవాయువు అందిస్తున్నారు.తాను పర్యావరణ ప్రేమికులందరిని ఒక్క తాటి మీదకు తీసుకువచ్చి వారితో వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తూ మొక్కల పెంపకాన్ని మహోద్యమంలా చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.
నల్గొండ ప్లాస్టిక్ రహిత ఉద్యమం
నల్గొండ బ్యాంక్ మాజీ మేనేజరు సురేష్ గుప్తా రామయ్య స్ఫూర్తితో ప్లాస్టిక్ రహిత ఉద్యమం చేపట్టారు. గుడ్డ సంచలను పంచుతూ మొక్కలు నాటుతూ చేనేతను ప్రోత్సహిస్తున్నారు. సేంద్రీయ సేద్యం, పర్యావరణ హితం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. తాను చేస్తున్న పర్యావరణ హత కార్యక్రమాలకు గుర్తింపుగా గ్రీన్ ఛాంపియన్, ఉత్తమ పర్యావరణ వేత్త, హరితమిత్ర అవార్డులు లభించాయని సురేష్ గుప్తా ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మొక్కల వెంకటయ్య 85 లక్షల మొక్కల పంపిణీ
సింగరేణిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వెంకటయ్య నిత్యం మొక్కలు పెంచుతూ వాటిని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. తన ఇంటి ఆవరణలోనే మట్టిని ప్లాస్టిక్ సంచుల్లో నింపి వాటిలో విత్తనాలు వేసి మొక్కలు పెంచి వాటిని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. వెంకటయ్య పేరు కాస్తా మొక్కల వెంకటయ్యగా మారింది. వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుతూ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించి చెబుతుంటారాయన. తాను ఇప్పటి వరకు 85 లక్షల మొక్కలను పంపిణీ చేశానని వెంకటయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రతీ ఒక్కరూ వారి జన్మదినం సందర్భంగా ఒక్క మొక్క నాటితే అవి మహా వృక్షాలై భావి తరాలకు ప్రాణవాయువును అందిస్తాయని వెంకటయ్య చెప్పారు. హరిత విప్లవం తీసుకురావడమే లక్ష్యంగా తాను మొక్కలను పంపిణీ చేస్తున్నానని చెప్పారు.
మోదీ గుర్తించిన మొక్కల రాజశేఖర్
25 వేల పైచిలుకు మొక్కలు నాటి సింగరేణి కార్మికుడు రాజశేఖర్ మొక్కల రాజశేఖర్ గా ప్రధాని మోదీ నుంచి గుర్తింపు పొందారు. మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాజశేఖర్ పేరు ప్రస్థావించడంతో పాటు జనవరి 26 గణతంత్ర దినోత్సవానికి ప్రధాని అతిధిగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. రెండు లక్షల పైచిలుకు వివిధ కార్యక్రమాలలో మొక్కలని బహుమతిగా ఇచ్చానని రాజశేఖర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. 10 లక్షల పైచిలుకు వివిధ రకాల గింజలు సేకరించి గుట్టలు, రోడ్ల వెంబడి చల్లానని, 200 పైగా పిచ్చుక గూళ్ళని,500 వరి ధాన్యం కుంచెలు,1000 మంచి నీటి చిప్పలు పంచానని ఆయన చెప్పారు.
పచ్చదనం కోసం పిల్లలు సైతం
పచ్చదనం కోసం పిల్లలు సైతం మందడుగు వేశారు. కొత్తగూడెంకు చెందిన విశ్వామిత్ర చౌహాన్ అనే బాలుడు గత 1041 రోజులుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా మొక్కలు నాటుతూ అందరి ప్రశంసలందుకున్నాడు. నాలుగు సార్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఒకసారి జిల్లా అటవీ శాఖ అధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నాడు. మంత్రులే కాకుండా ప్రముఖులతో చౌహాన్ మొక్కలు నాటించాడు. తాను తైవాన్ మామిడి, సపోటా, ఎర్రచందనం మొక్కలు నాటుతున్నానని, వీటి వల్ల భవిష్యత్ తరాలకు పండ్లు అందుబాటులోకి వస్తాయని చౌహాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- కొత్తగూడెంలోని రామవరం మోడరన్ ఇక్రా స్కూలులో యూకేజీ చదువుతున్న ఎండీ అఫాన్ జైదీ అనే ఆరేళ్ల బాలుడు కూడా మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.తన తాత ముహ్మద్ ముస్తఫా నాటిన మొక్కలు మహావృక్షాలుగా మారింది చూసిన జైదీ తల్లిదండ్రుల ప్రోత్సహంతో అయిదేళ్ల వయసు నుంచే మొక్కలు నాటుతున్నారు.
- కొత్తగూడెంలోని సెయింట్ మేరీ స్కూలులో 9వతరగతి చదవుతున్న కె పారుల్ కూడా మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పంచతున్నారు.
కోటికి పైగా మొక్కలు నాటిన దరిపెల్లి రామయ్య బాటలో పయనిస్తూ మొక్కలు నాటడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అంటున్నారు హరితప్రేమికులు.