డ్యామిట్..బీఆర్ఎస్ కథ అడ్డంతిరుగుతోందా ?

అనర్హత వేటుపై సుప్రింకోర్టులో జరిగిన విచారణను గమనించిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి;

Update: 2025-03-26 05:53 GMT
KCR and KTR

ఫిరాయింపు ఎంఎల్ఏలమీద అనర్హత వేటు వేయించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న న్యాయపోరాటం రివర్సు తిరుగుతోందా ? విచారణలో భాగంగా సుప్రింకోర్టు జడ్జీలు చేసిన వ్యాఖ్యలే దీనికి సాక్ష్యమా ? అనర్హత వేటుపై సుప్రింకోర్టులో జరిగిన విచారణను గమనించిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కేసును విచారిస్తున్న జడ్జీలు బీఆర్ఎస్ గవాయ్, అగస్టీన్ ఏమన్నారంటే ఫిరాయింపుల వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల గతంలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయని అన్నారు. ఫిరాయింపుల(BRS Defection MLAs)పై ఎప్పటిలోగా తేల్చాలన్న అంశంపై గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని గుర్తుచేశారు. ‘త్రిసభ్య ధర్మాసనం, ఐదుగురు జడ్జీల ధర్మాసనాలు గతంలో ఇచ్చిన తీర్పులను తాము ఎలాగ తిరగరాయగలమ’ని పిటీషనర్ తరపు లాయర్ ను గవాయ్ ప్రశ్నించారు. పైగా తాము కేసుల మెరిట్స్ లోకి వెళ్ళటంలేదని కూడా స్పష్టంచేసేశారు. స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వచ్చా ? లేదా ? అన్న అంశంపైన మాత్రమే వాదనలు వింటున్నట్లు తేల్చేశారు.

‘ఒకపార్టీ ఎంఎల్ఏ మరో పార్టీ నుండి లోక్ సభకు పోటీచేయటంపైన నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభాపతి మాత్రమే’ అని ఇద్దరు జడ్జీలు చెప్పేశారు. ఈ వ్యాఖ్యలు, అభిప్రాయాలు గమనించిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో పాటు అనర్హత పిటీషన్లు వేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలినట్లే ఉంది. పిటీషనర్ల తరపు లాయర్ ఆర్యమా సుందరం మాట్లాడుతు ఫిరాయింపు ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేయటానికి తగిన సమయం అంటే నాలుగువారాలు మాత్రమే అని గతంలో ఒక ఫిరాయింపు కేసులో జడ్జి ఇచ్చిన తీర్పును సుందరం ప్రస్తావించారు. దానికి ధర్మాసనమే కౌంటర్ ఇచ్చింది. ‘గతంలో ఫిరాయింపులను విచారించిన ధర్మాసనాలు నిర్దిష్టసమయం అంటే ఇంతకాలం అని ఎక్కడా చెప్పలేద’న్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.

ఇలాంటి అనేక వాదనలు, ప్రతివాదనల తర్వాత కేటీఆర్ తరపు లాయర్ దామా శేషాద్రినాయుడు మాట్లాడుతు అసెంబ్లీ తరపున సెక్రటరీ మాత్రమే కోర్టులో కౌంటర్ వేశారని స్పీకర్ వేయలేదని ప్రస్తావించారు. అయితే దామా వాదనను గవాయ్ తప్పుపట్టారు. స్పీకర్ కౌంటర్ దాఖలుచేయాలని మీరు ఆశించవద్దు అని స్పష్టంగా చెప్పారు. ఏదైనా కేసులో సుప్రింకోర్టును పార్టీగా చేరిస్తే చీఫ్ జస్టిస్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆశించలేం, రిజిస్ట్రార్ జనరలే స్పందిస్తారు కాబట్టి అనవసరంగా విషయాన్ని లాగద్దని తేల్చేశారు. తర్వాత అసెంబ్లీ తరపు లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తు నిర్దిష్టసమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఏ న్యాయస్ధానం కూడా స్పీకర్ ను ఆదేశించలేందని గుర్తుచేశారు. అయితే ఏదైనా విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద ఎవరైనా ఛాలెంజ్ చేయవచ్చని చెప్పారు. స్పీకర్ జారీచేసిన ఉత్తర్వులపై మాత్రమే న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందని గతంలో ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను సింఘ్వి గుర్తుచేశారు.

సుప్రింకోర్టులో వాదనలు, ప్రతివాదనలు ఎలాగున్నా అసెంబ్లీ సెక్రటరేయట్ నిపుణుల ప్రకారం ఫిరాయింపుల అనర్హతపై నిర్ణయం తీసుకోమని స్పీకర్ ను ఏ కోర్టు కూడా ఆదేశించేందుకు లేదు. అనర్హత నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు నిర్దిష్టగడువంటు ఏమీలేదు. నిర్ణిష్టతగడువు అంటు ఏమీలేదు కాబట్టి స్పీకర్ తనిష్టం వచ్చినంత కాలం తీసుకోవచ్చని గత సంప్రదాయాలు చెబుతున్నాయి. ఇందుకు బీఆర్ఎస్ లో జరిగిన ఫిరాయింపులే ఉదాహరణ. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్(KCR) యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. 2014-23 మధ్య టీడీపీ(TDP), కాంగ్రెస్(Telangana Congress), బీఎస్పీ నుండి 25 మంది ఎంఎల్ఏలు, 18మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు. అప్పట్లో ఫిరాయింపు ఎంఎల్ఏల మీద అనర్హత వేటువేయాలని టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు స్పీకర్ ను ఎన్నిసార్లు కోరినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తమ రిక్వెస్టులను స్పీకర్ పట్టించుకోవటంలేదని పై పార్టీలు కోర్టులో కేసులు వేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు.

అప్పట్లో బీఆర్ఎస్ తరపున పనిచేసిన స్పీకర్లు ఫిరాయింపులపై అనర్హత వేటు ఎందుకు వేయలేదు ? అసలు విచారణ కూడా ఎందుకు జరపలేదు ? ఎందుకంటే స్పీకర్ ను ఎవరు ఆదేశించలేరన్న విషయం అప్పట్లో కేసీఆర్ కు బాగా తెలుసు కాబట్టే. కేసీఆర్ స్వయంగా ఫిరాయింపులకు పాల్పడిన తర్వాత స్పీకర్ మాత్రం నిర్ణయం ఎలాగ తీసుకుంటారు ? అందుకనే టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఎంత మొత్తుకున్నా స్పీకర్ పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఎలాగ వ్యవహరించారో ఇపుడు కాంగ్రెస్ హయాంలో కూడా స్పీకర్ అలాగే వ్యవహరిస్తున్నారు. సుప్రింకోర్టు విచారణలో మొదట్లో బాగా హడావుడిచేసిన ద్విసభ ధర్మాసనం చివరకు స్పీకర్ ను తాము ఆదేశించలేమని అర్ధంవచ్చేట్లు వ్యాఖ్యలు చేయటం బీఆర్ఎస్ కు షాకిచ్చే ఉంటుంది. పైగా కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే కాని తాము కాదని తేల్చేయటం కేటీఆర్ తదితరులకు మరింత ఇబ్బందిగా తయారయ్యేదే. మరి ఏప్రిల్ 2వ తేదీ విచారణలో ద్విసభ్య ధర్మాసనం ఏమి తేలుస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News