కవిత బెయిల్ ఆర్డర్ లో 'సుప్రీం' కండిషన్స్

భారత అత్యున్నత న్యాయస్థానం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా బెయిల్ ఆర్డర్ లో కొన్ని కండిషన్స్ మెన్షన్ చేసింది.

Update: 2024-08-27 10:31 GMT

భారత అత్యున్నత న్యాయస్థానం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి భారీ ఊరట కల్పించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టైన ఆమెకి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా బెయిల్ ఆర్డర్ లో కొన్ని కండిషన్స్ మెన్షన్ చేసింది. బెయిల్ కోసం రూ. 10 లక్షలు పూచీకత్తు కట్టాలని సుప్రీం కోర్టు కవితకి సూచించింది. సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. "పాస్ పోర్టును మేజిస్ట్రేట్ కి సరెండర్ చేయాలి. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. కేసు ట్రయల్ కి సహకరించాలి. విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకి సహకరించాలి" అని సుప్రీం కోర్టు కవితకి ఇచ్చిన బెయిల్ ఆర్డర్ లో ఆదేశించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చ్ 15న కవితని ఈడీ అరెస్టు చేసింది. ఈడీ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఆమెని ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో దాదాపు ఐదున్నర నెలలు ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. నేడు ఈ రెండు కేసుల్లోనూ ఆమెకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం ధర్మాసనం లిక్కర్ కేసు దర్యాప్తు పూర్తయిందని, ఛార్జ్ షీట్ కూడా దాఖలైన ఈ దశలో కవితని జుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని పేర్కొంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. సెక్షన్ 45 దుర్భల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు హైకోర్టు జడ్జి వ్యవహరించారని ఘాటుగా స్పందించింది. ఈ సెక్షన్ పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని తెలిపింది. ఒక మహిళా ఉన్నత చదువులు చదివినంత మాత్రాన ఆమెకి బెయిల్ నిరాకరించడం సరికాదని స్పష్టం చేస్తూ నేడు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ పిటిషన్లను రిజెక్ట్ చేసిన ఢిల్లీ హైకోర్టు 

ఈడీ, సీబీఐ కేసుల్లో సెక్షన్ 45 కింద బెయిల్ ఇవ్వాలంటూ ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను జులై 1న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చెప్పలేమని తేల్చి చెప్పేసింది. విద్యావంతురాలిగా, పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలంటించింది.  ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితకి బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే అంశం ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని, మరికొందరు నిందితులు కూడా ఆమె తరపునే పని చేసినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఆమెని నిస్సహాయ మహిళగా భావించలేమంటూ... కవిత బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. 

Tags:    

Similar News