ట్యాపింగ్ నిందితుడు ప్రభాకరరావు మహా తెలివైనవాడు
తనను అరెస్టుచేయకుండా రక్షణకల్పిస్తే వారంరోజుల్లో సీఐడీ విచారణకు హాజరవ్వటానికి హైదరాబాదు(Hyderabad)కు వస్తానని సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశాడు;
బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు తన తెలివినంతా సుప్రింకోర్టులో చూపిస్తున్నాడు. విషయం ఏమిటంటే తనను అరెస్టుచేయకుండా రక్షణకల్పిస్తే వారంరోజుల్లో సీఐడీ విచారణకు హాజరవ్వటానికి హైదరాబాదు(Hyderabad)కు వస్తానని సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేశాడు. తాను భారత్ రావటానికి, టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) దర్యాప్తులో సహకరించటానికి సిద్ధంగా ఉన్నట్లు నిందితుడు చెప్పాడు. అయితే, తనను అరెస్టుచేయకుండా సీఐడీ అధికారులకు ఆదేశాలివ్వాలని సుప్రింకోర్టులో దాఖలుచేసిన పిటీషన్లో నిందితుడు విజ్ఞప్తిచేయటమే ఆశ్చర్యంగా ఉంది. నిందితుడి తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తు సహ నిందితుడు శ్రవణ్ రావును అరెస్టుచేయద్దని ఆదేశాలు ఇచ్చినట్లే ప్రభాకరరావు విషయంలో కూడా ఆదేశాలు ఇవ్వాలని సుప్రింకోర్టును కోరారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏడాదికిపైగా ట్యాపింగ్ విచారణలో ఏమాత్రం సహకరించకుండా నిందితుడు అమెరికా(America)లోనే ఉన్నవిషయం అందరికీ తెలిసిందే. ఎట్టిపరిస్ధితుల్లోను తాను ఇండియా(India)కు రాకుండా ఉండేందుకు చేయగలిగినన్ని ప్రయత్నాలను చేసుకున్నాడు. అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. తనను శరణార్ధిగా గుర్తించి అమెరికాలోనే శాశ్వతంగా నివాసముండేలా చూడాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసుకున్నాడు. తాను క్యాన్సర్ రోగంతో ఇబ్బందిపడుతున్నందున చికిత్స చేయించుకునేంతవరకు తనను అమెరికా నుండి పంపవద్దని కోరాడు. అమెరికాలోనే ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేసుకున్న నిందితుడు అన్నింటిలోను ఫెయిలయ్యారు. ఇదేసమయంలో నిందితుడిని అమెరికా నుండి ఇండియాకు రప్పించేందుకు సీఐడీ అధికారులు సీబీఐ, ఇంటర్ పోల్(Interpol) ద్వారా చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నాయి.
ప్రభాకరరావు అరెస్టుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. పాస్ పోర్ట్ ఆథారిటి ఆఫ్ ఇండియా నిందితుడి పాస్ పోర్టును రద్దుచేసింది. నిందితుడిని అమెరికా నుండి ఇండియాకు రప్పించే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. వీటన్నింటినీ పక్కనపెట్టేసినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్(Donald J Trump) తీసుకుంటున్న నిర్ణయాలతో తనను అమెరికా నుండి ఇండియాకు ఎప్పుడు తరిమేస్తారో అనే టెన్షన్ నిందితుడిలో పెరిగిపోతున్నట్లుంది. అంతర్జాతీయ టెర్రరిస్టు తహవ్వుర్ రాణా(Tahawwur Rana)ను ఇండియాకు అప్పగించినట్లుగానే తనను కూడా ఇంటర్ పోల్ ఎప్పుడు ఇండియాకు అప్పగించేస్తుందో అనే ఆందోళన పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తన అతితెలివినంతా ఉపయోగించాడు. తనను అరెస్టుచేయకుండా ఆదేశాలిస్తే ఇండియాకు వచ్చేస్తానని సుప్రింకోర్టుతోనే బేరం మొదలుపెట్టాడు.
ఇపుడు కాకపోయినా తొందరలోనే ఏదోరోజు నిందితుడు అమెరికా నుండి ఇండియాకు రాక తప్పేట్లులేదు. అమెరికా బలవంతంగా తనను ఇండియాకు పంపేస్తే అప్పుడు తనపరిస్ధితి ఏమిటనేది నిందితుడికి 70 ఎంఎం స్కోప్ లో కనబడుంటుంది. అందుకనే ఆ విషయాన్ని దాచిపెట్టి తనంతట తానుగానే ఇండియాకు వచ్చేయాలని అనుకుంటున్నట్లు నిందితుడు బిల్డప్ ఇస్తున్నాడు. దానికి తన వయసు, అనారోగ్యం, చికిత్స అంటు డ్రామాలాడుతున్నాడు. తాను ఏతప్పూ చేయకపోయినా తనను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించినట్లు నిందితుడు చెప్పటమే విచిత్రంగా ఉంది. ప్రభాకరరావు ఆదేశాలతోనే తాము వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయిన పోలీసు అధికారులు విచారణలో స్పష్టంగా అంగీకరించారు. అదే విషయాన్ని విడివిడిగా కోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్లలో కూడా అరెస్టయినవాళ్ళు ఒప్పుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఇష్టారాజ్యంగా వేలాది మొబైల్ ఫోన్లను ట్యాప్ చేసి బీఆర్ఎస్ ప్రత్యర్ధులను నానా ఇబ్బందులకు గురిచేసిన ప్రభాకరరావు తనకు ఎలాంటి పాపంతెలీదని ఇపుడు అమాయకంగా చెబుతుండటమే విడ్డూరం. మని నిందితుడి పిటీషన్ విచారణపై సుప్రింకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.