Hydra defused|తుస్సుమన్నహైడ్రా....భయపడాల్సిన అవసరమే లేదు

రంగనాధ్(Hydra Commissioner AV Ranganadh) తాజా ప్రకటనతో కొన్ని వేలమంది ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పవచ్చు.

Update: 2024-12-17 12:04 GMT
Hydra Commissioner AV Ranganadh

*హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్ళం

*పేదల జోలికి హైడ్రా వెళ్ళదు

*గతంలో పర్మీషన్లు తీసుకుని ఇపుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు కూడా తొంగిచూడము

ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్. రంగనాధ్(Hydra Commissioner AV Ranganadh) తాజా ప్రకటనతో కొన్ని వేలమంది ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పవచ్చు. లేకపోతే ఎప్పుడు వచ్చి హైడ్రా తమ ఇళ్ళను కూల్చేస్తుందో అనే టెన్షన్ తో కొన్నివేలమంది నానా టెన్షన్ పడుతున్నారు. ఇదే సమయంలో రంగనాధ్ తాజా ప్రకటనచూసిన మరికొందరు శాపనార్ధాలు పెడుతున్నారు. ఎందుకంటే హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి సుమారు 200 నిర్మాణాలను కూల్చేసి ఉంటుంది. నిర్మాల కూల్చివేతల కారణంగా సుమారు వెయ్యిమంది రోడ్డునపడి లీగల్ సమస్యల్లో ఇరుక్కుని నానా అవస్తలుపడుతున్నారు. అక్రమ నిర్మాణాల పేరుతో తమ ప్రాపర్టీలను కూల్చేసిన హైడ్రా కమిషనర్ ఇపుడు ఎందుకు మనసు మార్చుకున్నారంటు బాధితులు మండిపోతున్నారు.

విషయం ఏమిటంటే చెరువులు, కాల్వలు, కుంటల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పడినట్లు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. హైడ్రాకు కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ ను నియమించారు. దీనికి ప్రత్యేకంగా పోలీసుస్టేషన్ హోదా ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా 300 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. బుద్ధభవన్లో ఆఫీసు కూడా ఏర్పాటైంది. హైడ్రాకు సాయంగా ఇరిగేషన్, రెవిన్యు, పంచాయితీరాజ్ శాఖల అధికారులు కూడా పనిచేస్తున్నారు. జలవనరులను ఆక్రమించుకుని కట్టేశారన్న ముద్రవేసి సుమారు 200 నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. ఇందులో ఖరీదైన విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ళు, నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లున్నాయి.

ప్రాపర్టీలను కూల్చేసిన హైడ్రా ఇంకా కొన్ని వందలనిర్మాణాలకు నోటీసులు కూడా జారీచేసింది. పనిలోపనిగా మల్లారెడ్డి విద్యాసంస్ధలు, ఓవైసీ సోదరులు(OYC Brothers) నిర్వహిస్తున్న ఫాతిమా సొసైటీ విద్యాసంస్ధలు, మర్రి విద్యాసంస్ధల్లాంటి చాలా కాలేజీలు, స్కూళ్ళను చెరువులు, కాల్వలను ఆక్రమించి నిర్మించారని హైడ్రా యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. హైడ్రా జారీచేసిన నోటీసులు అందుకున్న వారిలో రాయదుర్గం(Rayadurgam) ఏరియాలోని అమర్ సొసైటీలో ఉంటున్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి(Tirupati Reddy) కూడా ఉన్నారు. తిరుపతిరెడ్డే కాదు ఇలాంటి ప్రముఖులు చాలామందున్నారు. నోటీసులు అందుకున్నవారిలో కొందరు కోర్టుకెళ్ళి స్టే కూడా తెచ్చుకున్నారు. ఇళ్ళకూల్చివేతలో హైడ్రాకు హైకోర్టు బాగా చివాట్లు కూడా పెట్టింది. కూల్చేసిన నిర్మాణాల్లో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కారణంగానే హైడ్రా అంటేనే చాలామందిలో టెర్రర్ అయిపోయింది.

హైకోర్టు చివాట్లు పెట్టడం, కూల్చివేతలపై స్టేలు ఇవ్వటం లాంటి అనేక కారణాలతో హైడ్రా జోరుతగ్గించింది. కొంతకాలం ఏమీ మాట్లాడని రంగనాధ్ తాజాగా చేసిన ప్రకటన విచిత్రమనిపించింది. హైడ్రా ఏర్పడకముందు చేసిన నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్ళమన్నారు. అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్ళమని అంటే అర్ధమేంటి ? హైడ్రా ఏర్పడక ముందు చేసిన చాలానిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనమతులు మంజూరుచేసింది. అన్నీ అనుమతులు ఉన్నాయి కాబట్టే కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు అప్పులిచ్చాయి. అప్పులు తీసుకుని కొనుగోలుదారులు తీసుకున్న ప్రాపర్టీలు చెరువులు, కాల్వలను ఆక్రమించుకుని చేసినవన్న కారణంతో హైడ్రా కూల్చేసింది. చెరువులు, కాల్వలను ఆక్రమించుకుని నిర్మాణాలు జరిగాయంటే అందుకు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్ధలు, అనుమతులు మంజూరుచేసిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయితీలు, మున్సిపాలిటీలదే ప్రధాన బాధ్యత. ఇదే విషయాన్ని అప్పట్లో బాధితులు ఎంతగా మొత్తుకున్నా లెక్కచేయక వాళ్ళ ప్రాపర్టీలను హైడ్రా కూల్చేసింది.

ఇక రెండో పాయింట్ పేదల జోలికి హైడ్రా వెళ్ళదని తేల్చి చెప్పారు. నిజానికి ఇప్పటికి హైడ్రా కూల్చేసిన నిర్మాణాలన్నీ పేదలు, మధ్య తరగతి, ఎగువమధ్య తరగతి జనాలు రూపాయి, రూపాయి పోగేసుకుని, అప్పులు తీసుకుని కొనుగోలుచేసినవే. ఇకముందు పేదలజోలికి హైడ్రా రాదని రంగనాధ్ ప్రకటించారంటే మరి గతంలో కూల్చేసిన నిర్మాణాల వల్ల నష్టపోయిన బాధితుల మాటేమిటి ? మూడోపాయింట్ గతంలో పర్మీషన్ తీసుకుని ఇపుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు హైడ్రా చూడదని చెప్పారు. గతంలో అనుమతులు తీసుకుని ఇపుడు చేస్తున్న నిర్మాణాలు అంటే చెరువులు, కాల్వలను ఆక్రమించేసి నిర్మాణాలకు అన్నీ అనుమతులు తీసుకునుంటే అవన్నీ ఇపుడు రంగనాధ్ దృష్టిలో సక్రమమేనా ? అసలు హైడ్రా పుట్టుకే జలవనరులను కాపాడటానికి కదా ? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు వెయ్యి చెరువులు, కాల్వలు, కుంటలుండగా అందులో దాదాపు 700 వరకు పూర్తిగా, పాక్షికంగా ఆక్రమణలకు గురయ్యాయని కదా ప్రభుత్వం గతంలో చెప్పింది. మరిపుడు ఆ ఆక్రమణల తొలగింపు లేనట్లేనా ?

ఈమధ్యనే ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న నిఖేష్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ఇంజనీర్లను ఏసీబీ అధికారులు అరెస్టుచేశారు. ఎందుకంటే గండిపేట మండలంలోని నిర్మాణాలకు అనుమతులు మంజూరుచేయటంలో లక్షల రూపాయలు లంచాలుగా తీసుకున్నారని. నిఖేష్ లాంటి వాళ్ళు ఇచ్చిన అనుమతుల్లో చాలావరకు జలవనరులను చెరబట్టి చేసిన నిర్మాణాలే. మరి అలాంటి నిర్మాణాలన్నీ సక్రమమే అని ఇపుడు రంగనాధ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లేనా ? అధికారంలో ఉన్నపుడు అసెంబ్లీలో కేసీఆర్(KCR) మాట్లాడుతు గ్రేటర్ పరిధిలో 25 వేల అక్రమనిర్మాణాలున్నాయని ప్రకటించారు. వాటిల్లో ఏ ఒక్కటి వదలకుండా కూల్చేస్తమన్నారు. అయితే తర్వాత అయ్యప్పసొసైటీలో కూల్చివేతలతో కొద్దిరోజులు హడావుడి జరిగింది. బాధితులు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవటంతో కూల్చివేతల వ్యవహారం అటకెక్కింది.

ఇపుడు హైడ్రా వ్యవహారం కూడా మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. ప్రాపర్టీలు కోల్పోయే క్రమంలో కొందరు బాధితులకు అన్యాయం జరిగినా జలవనరులను ఆక్రమణలనుండి తప్పించటంతో జలవనరులన్నీ ఆక్రమణల చెరనుండి బయటపడతాయని చాలామంది ఆశించారు. అయితే వాళ్ళ ఆశలన్నీ అడియాసలైపోయాయని అర్ధమవుతోంది. భవిష్యత్తులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని మాత్రం కూల్చేస్తారని బెదిరింపొకటి. ఇపుడు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా పదుల ఎకరాల్లో రాజకీయనేతలు, సెలబ్రిటీలు, బడాబాబులు నిర్మించుకున్న ఫామ్ హౌసులు వందల్లో ఉన్నాయి. వాటిని రక్షించటం కోసమే, వాటిజోలికి వెళ్ళే ధైర్యంలేకే రంగనాధ్ తన అజెండాను మర్చుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News