Telangana caste survey | తెలంగాణ కులగణన ఎలా జరిగిందంటే...
తెలంగాణలో కులగణన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే- 2024 నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.;
By : The Federal
Update: 2025-02-04 12:04 GMT
రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి 2024వ సంవత్సరం ఫిబ్రవరి 4వతేదీన తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16వతేదీన కులగణన చేయాలని తీర్మానించింది.
వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరచేలా తెలంగాణ మంత్రివర్గం 04.02.2024 తేదీన చేసిన సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా (సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (కుల గణన) ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టారు.
బీసీల అభ్యున్నతి కోసం...
ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీనవర్గాల స్థితిగతులను మెరుగు పర్చడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి, అమలు పర్చడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టడం కోసం 10-10-2024 తేదీన జి.ఓ.ఎం.ఎస్.నెం. 18ను జారీ చేసింది.
కులగణనకు సబ్ కమిటీ
రాష్ట్ర ప్రభుత్వం 19.10.2024 122/Cabinet/A2/2024 2 ద్వారా సామాజిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ ,కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర నీటి పారుదల, ఆహార,పౌర సరఫరాల మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.సర్వే నిర్వహించేందుకు ప్రణాళికా శాఖ నోడల్ విభాగంగా నియమించారు. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు, ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్నాటక ,బీహార్ లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం చేశారు.
వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులను పరిగణనలోనికి తీసుకొని హౌస్లిస్టింగ్ షెడ్యూల్,సర్వే షెడ్యూల్,ఎన్యుమరేటర్లకు మార్గదర్శకాలు,సర్వేలో సేకరించిన సమాచార రకాలు, సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా, అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్స్ లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
సర్వే విధానం
రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాకుగా విభజించారు. తద్వారా 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేశారు.ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్ కి ఒక ఎన్యుమరేటర్ ను , ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లను పర్యవేక్షించడానికి ఒక సూపర్ వైజర్ ని నియమించారు.తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యుమరేటర్లు, సూపరవైజర్లను నియమించారు.
క్షేత్ర స్థాయిలో సర్వే
సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వే 2024 నవంబర్ 6వ తేదీన హౌస్-లిస్టింగ్ తో ప్రారంభమైంది.మొదటి దశలో, హౌస్-లిస్టింగ్ 6 నవంబర్ నుంచి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించారు. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుంచి తెలంగాణ గవర్నర్ నుంచి ప్రారంభమైంది.రాష్ట్రంలో సర్వే 06.11.2024 న ప్రారంభమై 25.12.2024 న పూర్తయింది (50 రోజులు). సర్వే ముగిసే సమయానికి, మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో - 66,99,602, నగర ప్రాంతం లో - 45,15,532. కాగా, మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్-లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 గా ఉంది. సర్వే కవరేజ్ ను 96.9శాతం గా ఉంది.ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య 3,56,323. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జీహెచ్ఎంసీ ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి.
డేటా ఎంట్రీ
రాష్ట్రంలో కులగణన డేటా ఎంట్రీ 20.11.2024న ప్రారంభమై 25.12.2024న పూర్తయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజులు పట్టింది.2024 ఫిబ్రవరి 4న మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేశారు.
సర్వేలో వెల్లడైన కులాల డేటా
కులగణన సర్వే డేటా, ఫలితాలు తెలంగాణ నివాసితులు ఎన్యుమరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడింది.ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేశారు.ఎస్సీలు 61,84,319 మంది ఉండగా ఇది మొత్తం లో 17.43 శాతం గా ఉంది.ఎస్టీలు 37,05,929 ఉండగా ఇది మొత్తం లో 10.45 శాతం.బీసీల్లో(ముస్లిం మైనారిటీ మినహా) లో 1,64,09,179 ఉండగా ఇది మొత్తం లో 46.25 శాతం గా ఉంది.ముస్లిం మైనారిటీల లో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తం లో 12.56 శాతం గా ఉంది.ముస్లిం మైనారిటీ లో బీసీలు 35,76,588 ఉండగా, ఇది మొత్తం లో 10.08 శాతం గా ఉంది.ముస్లీం మైనారిటీ లో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తం లో 2.48 శాతం గా ఉంది.ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తం లో 15.79 శాతం గా ఉంది.ముస్లిం మైనారిటీ మినహా ఓసీలు 47,21,115 మంది ఉండగా ఇది మొత్తం లో 13.31 శాతం గా ఉంది.
బీసీల సంక్షేమానికి ఈ డేటా ఉపయోగం
ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు,రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగించనుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను, తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబించనుంది.