ఇందిరమ్మ క్యాంటీన్లలో ఐదు రూపాయలకే టిఫిన్స్
ఆగస్టు 15 నుంచి ప్రారంభం...;
ఐదు రూపాయలకే అల్పాహారం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడానికి జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఐదు రూపాయల భోజన కేంద్రాల్లో ఈ అల్పాహారం అందుబాటులో రానుంది. క్యాంటిన్ నమూనాలను జీహెచ్ ఎంసీ మార్చేసింది. 4/10, 20/10 అడుగుల విస్తీర్ణంలో క్యాంటిన్లు ఉండనున్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే వడ్డించడానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో క్యాంటిన్ పరిమాణాన్ని పెంచారు. ఇప్పటికే హైదరాబాద్ ఖైరతాబాద్ లో నమూనా క్యాంటిన్ ఏర్పాటైంది.
జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో క్యాంటిన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కొత్త నమూనాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ లోగో, భోజనం, టిఫిన్ ఫోటోలు కొత్త లోగోలో ఉండనున్నాయి. ఒక్కో మున్సిపల్ డివిజన్ లో ఒక్కోటి చొప్పున 150 కేంద్రాల్లో భోజనం వడ్డించేవారు. ప్రస్తుతం క్యాంటిన్లను 128 కేంద్రాలకు కుదించారు. మిల్లెట్స్ తో చేసిన ఇడ్లీ , ఉప్మాతో బాటు పూరీలు అల్పాహారంలో చేరాయి.వారంలో ఆరు రోజులు అల్పాహార కేంద్రాలు తెరచే ఉంటాయి. ఆదివారం సెలవురోజు గా నిర్ణయించారు. ఒక్కో టిఫిన్ కు రూ 19 రూపాయలు ఖర్చుకానుండగా లబ్ది దారుడు కేవలం రూ 5 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా14 హరే కృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ కు జీ హెచ్ ఎంసీ చెల్లించనుంది.