కవిత లేకుండా ముగుస్తున్న తెలంగాణ బోనాలు

తెలంగాణ బోనాలపండగలో కవిత లేకుండా పత్రికల్లో, సోషల్ మీడియాలో ఫోటోలు ఉండవు. ఆమెలేని ఫోటోని మీడియా పెద్దగా వాడుకోదు. ఈ సారి ఒక్క కలర్ ఫుల్ బోనాల ఫోటో టాప్ లో లేదు.

Update: 2024-08-05 05:44 GMT

రాజకీయాలు నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అందలానికి ఎక్కిస్తాయి. పాతాళానికి పడేస్తాయి. దీనికి కారణాలేవో ఎపుడూ బయటకు రావు. రకరకాల వూహాగానాలు, విమర్శలు, వివరణలు వస్తాయి తప్ప రాజకీయాల్లో పవర్ కి పతనానికి ఫలానా కారణమని ఎపుడూ బయటకు రాదు. సమయాన్నిబట్టి కొందరు చిబ్బుబుడిల్లా మెరుస్తారు. తారాజువ్వల్లా ఎగిరిపోతారు. కొందరు పడిపోతారు. ఇలాంటి పరిస్థితే కల్వకుంట్ల కవిత ఎదుర్కొంటున్నారు. ఆమె ఉన్నట్లుండి తెలంగాణ రాజకీయాల్లో కనిపించకుండా పోయారు. ఇంకా బాగా చెబితే ఇపుడు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు,    సర్వత్రా తానే  కనిపించి క్యాడర్ ను కదిలించాల్సిన సమయం. అయితే ఆమె జైలుకెళ్లారు. గత పదేళ్లలో తెలంగాణలో ప్రముఖంగా వినిపించిన, కనిపించిన ఎకైక మహిళ ఆమెయే. మిగతా వాళ్లున్నా వాళ్లెమంతా ఇంపార్టెంట్ కాదు. కవితయే నెంబర్ వన్. నెంబర్ టు, నెంబర్ త్రీ. తెలంగాణ గడ్డ మీద మరొక కవితకి చోటీయ లేదు. 

కేంద్రవిచారణ సంస్థలేమో ఆమె లిక్కర్ స్కామ్ డబ్బులు వసూలు చేసిందని చెబుతున్నాయి. కోర్టులో చార్జ్ షీటు వేశాయి. జైలుకు పంపాయి.  ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రం ఇది రాజకీయ కక్ష అంటున్నారు. లిక్కర్ స్కామ్ అయినా, రాజకీయ కక్ష అయినా మొత్తానికి కెసిఆర్ కూతురు ఢిల్లీ తీహార్ జైల్లో కూర్చోవలసి వచ్చింది. పర్యవసానంగా ఆమె తెలంగాణలో కనిపించకుండా పోతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో ఆమె ఎక్కడ చూసినా తానే అయి కనిపించాల్సి ఉండింది. ఎందుకంటే, ఇది బోనాల సీజన్. తెలంగాణ బోనాల పండగలో కవిత లేకుండా పత్రికల్లో, సోషల్ మీడియాలో ఫోటోలు ఉండవు. ఆమెలేని ఫోటోలను మీడియా పెద్దగా వాడుకోదు. ఈ సారి కవిత లేకుండా బోనాలు ముగిశాయి. అందుకే ఒక్క కలర్ ఫుల్ ఫోటో టాప్ లో కనిపించలేదు.

సరిగ్గా ఏడాది కిందట...

పోయినా ఏడాడి అంటే 2023 జూలైలో ఆస్ట్రేలియాలో భారత జాగృతి అధ్యక్షురాలిగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత  తెలంగాణ బోనమెత్తారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ గాయత్రి మందిరంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి స్వయంగా బోనాన్ని తయారు చేసి నట్లు ఆమె ట్విట్టర్లో ఫోటోలు పెట్టారు. బోనాన్ని తలపై ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ లో నిర్వహించిన పూజలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

ఆగస్టులో పోచారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ఆకర్శణగా నిలిచిందని నమస్తే తెలంగాణ భలే రాసింది. అక్కడ నూతనంగా నిర్మించిన మహంకాళి, ఈదమ్మ, పోచమ్మ, మైసమ్మ దేవాలయాలలోని అమ్మవార్లకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం బంగారు బోనం సమర్పించారు.  3 కోట్ల రుపాయలతో నిర్మించిన ఆ దేవాలయాలలో విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించి బోనాల ఉత్సవాలను ఘనంగా, వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయారు. ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు.

అంతేకాదు, అందరికీ బోనాల పండుగ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై నిండుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఆమే ఫెస్ బుక్ లో రాశారు.

ఇలాంటి కవిత ఇపుడు ఎక్కడా లేదు. కనీసం జైలు నుంచి బోనాల శుభాకాంక్షలు తెలియచేసినట్లు లేదు. ఆమెరికా, లండన్, ఆస్ట్రేలియాలలో బోనాలెత్తినట్లు  జైలులో బోనాలెత్తినట్లు లేదు.

ఇపుడామె మూడే మూడు సందర్భాలలో వార్తల కెక్కుతున్నారు. ఒకటి బెయిల్ కోసం కోర్టుకు హాజరయినపుడు, రెండోది కస్టడీ పొడిగించినపుడు. ఇక మూడోది ఆమెను అన్న కెటిఆరో, బావ హరీష్ రావో పరామర్శించినపుడు.

కెసిఆర్ మౌనం

నాయన కెసిఆర్ ఇంకా ఆమెను పరామర్శించలేదు. ఆయన చాలా కాలం ఆవిషయమే మాట్లాడలేదు. ఆయనది వ్యూహాత్మక మౌనం పత్రికలు పుంఖాను పుంఖాలుగా విశ్లేషించాయి.  ఒకేఒక్కసారి ఆయన స్పందించినపుడు మౌనంవీడిన కెసిఆర్ అని, కూతురి అరెస్టు పై తొలిసారి  స్పందించిన కెసిఆర్ అని పెద్ద వార్తలొచ్చాయి. అయితే,  తీహార్ జైలుకు వెళ్లి కూతురిని కల్వాలనుకుంటున్నట్లు వార్తలు రావడం లేదు.

ఎపుడు వెళ్తారో కూడా తెలియదు. జైలులో ఉన్న ఆయన కూతురిని పరామర్శించేందుకు ఎందుకు వెళ్లడం లేదు. కాంగ్రెసాయన ఒకరు ఏమన్నారంటే, “ కూతురిని కలవాలంటే జైలు కెళ్లాలి. తీహార్ జైల్లో కాలుమోపుతూనే ‘తీహార్ జైలు కెళ్లిన కెసిఆర్’ అంటూ తెలుగు పత్రికలు, సోషల్ మీడియా గోల చేస్తాయి. కాబట్టే ఆయన జైలుకు వెళ్లి కూతురిని పరామర్శించక పోయివుండవచ్చు,” అని.

రేపు మళ్లీ కవిత వార్త రాబోతున్నది. ఎందుకంటే, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు,జగదీశ్వర్ రెడ్డి డిల్లీ వెళ్తున్నారు. మంగళవారం నాడు తీహార్ జైల్లు కు వెళ్లి అక్కడ ఉన్న కవితతో ములాఖత్ అవుతున్నారు.


Tags:    

Similar News