రెండు కారణాలే కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నాయా ?
మొదటిదేమో తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుపై సందేహాలు పెరిగిపోతుండటం.
మూడు జిల్లాల పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడినపుడు కేసీయార్లోని ఫ్రస్ట్రేషనంతా బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు తిట్టారు. బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరుతున్న ఎంఎల్ఏలు, సీనియర్ నేతలను చిల్లరగాళ్ళు, కుక్కలు, నక్కలంటు విరుచుకుపడ్డారు. కరువు వచ్చిందికాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినకరువని ఏదేదో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వనని, వెంటాడుతామని వార్నింగులిచ్చారు. ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదిలేదని బజారుకీడుస్తామంటూ హూంకరించారు. ఈ మాటలు, వార్నింగులు, బెదిరింపులు చూసిన తర్వాత కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.
మాజీ ముఖ్యమంత్రిలో ఎందుకింత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది ? అనే సందేహం మొదలైంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని అర్ధమవుతోంది. మొదటిదేమో తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుపై సందేహాలు పెరిగిపోతుండటం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికే పార్టీ కుదేలైపోయింది. అలాంటిది పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే పార్టీ ఉనికి కూడా కోల్పోయే ప్రమాదముంది. ఈ విషయమే కేసీయార్ను స్ధిమితంగా ఉండనివ్వటంలేదనిపిస్తోంది. ఇక రెండో కారణం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్. మొదటి కారణం విషయంలో కేసీయార్ చేయగలిగిందేమీ లేదు అభ్యర్ధుల తరపున ప్రచారం చేయటం తప్ప. రెండోకారణం టెలిఫోన్ ట్యాపింగే కేసీయార్ ను ఎక్కువ కలవరపెడుతున్నట్లుంది. దీనికి ముఖ్యకారణం ఏమిటంటే ట్యాపింగ్ లో కీలక పాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకరరావు లొంగిపోతున్నారన్న ప్రచారమే.
ప్రభాకర్ అమెరికా నుండి సోమవారం హైదరాబాద్ కు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బంజారాహిల్స్ పోలీసుల ముందు లేదా టాస్క్ ఫోర్స్ అధికారుల ముందు లొంగిపోతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రభాకర్ లొంగిపోయిన తర్వాత అప్రూవర్ గా మారబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అప్రూవర్ గా మారితే ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేయాలని ఆదేశించిన నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పేర్లను బయటపెట్టే అవకాశాలున్నాయి. దాంతో రాజకీయంగా సంచలనాలు ఖాయమని అనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు వెలుగుచూసిన ట్యాపింగ్ ఆరోపణలు బీఆర్ఎస్ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఇప్పటికే తమ హయాంలో ట్యాపింగ్ జరిగిందని కేటీయార్ అంగీకరించారు.
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతు లంగాలదో, దొంగలదో ఒకటో రెండో ఫోన్లు ట్యాపింగ్ జరిగుండచ్చని కేటీయార్ అన్న విషయం తెలిసిందే. ఆ ప్రకటన ఆధారంగానే కేటీయార్ కు నోటీసులు ఇవ్వటానికి పోలీసు అధికారులు రెడీ అవుతున్నారట. కేటీయార్ తో పాటు ఇద్దరు ముగ్గురు మాజీమంత్రులకు కూడా నోటీసులు రెడీ అవుతున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అరెస్టయిన సస్పెండెడ్ పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతయ్య, ప్రణీత్ రావు, రాధాకిషన్, ఇన్సెప్టెక్టర్లందరు ప్రభాకరరావు ఆదేశాలతోనే టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వాగ్మూలాలిచ్చారు. అలాగే కొందరు కీలక నేతల పేర్లను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేయించారన్నదే కీలకం. ప్రభాకరరావు విచారణలో నోరిప్పితే సూత్రదారుల బండారం బయటపడుతుంది.
ఈ విషయాలే కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవటానికి కారణాలుగా కనబడుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు ట్యాపింగ్ బూతం వెలుగుచూడటం, దీనివల్ల బీఆర్ఎస్ కు నష్టం తప్పదనే ప్రచారం జనాల్లో పెరిగిపోతోంది. పార్టీకి నష్టం ఒకటి, కీలక నేతలపై కేసులు నమోదవ్వటం, అరెస్టులు రెండో నష్టం. దీంతోనే కేసీయార్ నోటికొచ్చినట్లు మాట్లాడారనే ప్రచారం పెరిగిపోతోంది.
ఇదే విషయమై విశ్లేషకుడు అన్నవరం దేవేందర్ మాట్లాడుతు ‘‘రాజకీయనేతలు ఇచ్చే మౌఖిక ఆదేశాలను అమలుచేయటానికి అఖిల భారత సర్వీసు అధికారులు అవసరంలేదన్నారు. నోటిమాటగా ఇచ్చేఆదేశాలను అమలుచేయలేమని ఉన్నతాధికారులు ఎందుకు చెప్పలేకపోతున్నారో ఆలోచించాలన్నా’’రు. ‘‘బీఆర్ఎస్ పెద్దలు ఇచ్చిన ఆదేశాలను అమలుచేసిన కారణంగానే ఇపుడు టెలిఫోన్ ట్యాపింగ్ పెద్ద సమస్యగా మారింద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘రాతమూలకంగా లేని ఆదేశాలను అమలుచేసేదిలేదని చెప్పుంటే అధికారులకు ఇపుడీ సమస్యలు వచ్చేదికాద’’న్నారు. ఈ పరిస్ధితికి ముఖ్య కారకులు ఉన్నతాధికారులే అని దేవేందర్ స్పష్టంచేశారు.