యూసీసీఆర్ఐ(ఎంఎల్) రాష్ట్ర నేత శిష్ట్లా విజయ్ కన్నుమూత
నాలుగున్నర దశాబ్దాలుగా విజయ్ రహస్య జీవితం గడుపుతున్నారు.;
By : రాఘవ
Update: 2025-07-12 17:25 GMT
సౌమ్యడు, నాకు అత్యంత ఆత్మీయుడు, విప్ల వానికి తన జీవితాన్ని అంకితం చేసిన శిష్ట్లా విజయ్(74) హైదరాబాదులో శని వారం రాత్రి 9 గంటలకు ఆనారోగ్యంతో కన్నుమూశారు. భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(యూసీసీఆర్ఐ (ఎం.ఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయ్ చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ, కొన్నేళ్ళుగా డయలిసిస్ చికిత్సపై కొనసాగుతున్నారు. వారం క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన మూడు రోజులుగా వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ, రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టి ఈ రోజు కన్నుమూశారు. విజయ్ కు భార్య ఉన్నారు. పిల్లలు లేరు.
ఈనాడు పెట్టినప్పుడు న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు దివంగత ఎస్.వి.ఎస్. సుబ్బరాయుడికి విజయ్ స్వయానా తమ్ముడు. హైదరాబాదులోని ఒక పబ్లిక్ రంగ సంస్థలో పనిచేస్తున్న విజయ్ దేవుల పల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలోని భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(యూసీసీఆర్ఐ (ఎం.ఎల్)లో అయిదు దశాబ్దాల పైగా పనిచేశారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తికాలం విప్లవం కోసం పనిచేయడం మొదలు పెట్టారు. ఎనభైయవ దశకంలో యూసీసీఆర్ఐ (ఎం.ఎల్) లో చీలిక రావడంతో విజయ్ ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు.
నాలుగున్నర దశాబ్దాలుగా విజయ్ రహస్య జీవితం గడుపుతున్నారు. ఎనభయవ దశకంలో చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా తిరుపతిలో యూసీసీఆర్ఐ (ఎం.ఎల్) రాష్ట్ర కమిటీ తరపున నిర్మాణ కార్యక్రమాలు మొదలైనప్పుడు విజయ్ ఈ ప్రాంత పార్టీ వ్యవహారాలను, ప్రజా సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించడం మొదలు పెట్టారు. ఎక్కడా ఆవేశ పడే వారు కాదు. దుందుడుకు తనమూ లేదు. మా మధ్య రెండు సార్లు భిన్నాభిప్రాయాలు వస్తే, నవ్వుతూ ఓపిగ్గా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. పార్టీలో కూడా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
విజయ్ పైన కేసులేమీ లేకపోయినప్పటికీ, దాదాపు దశాబ్దం క్రితం హైదరాబాదులో పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన్ని కిడ్నాప్ చేసి, అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి వదిలేశారు. ఆ సమయంలో మెదడుకు షాక్ ట్రీట్ మెంట్ కూడా ఇవ్వడంతో కొంత కాలం జ్ఞాపక శక్తిని కోల్పోయారు. తిరుపతికి ఎప్పుడు వచ్చినా విజయ్ ని కలిసే మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడప్పుడూ మా ఇంట్లోనే బస చేసే వారు. పోలీసులు చిత్రహింసలు పెట్టినప్పటి నించి ఆయన బైట వ్యక్తులను కలవడం దాదాపు ఆగిపోయింది.
విజయ్ కుటుంబంలో కిడ్నీ సమస్య వారసత్వంగా వస్తున్నది. విజయ్ అన్న ఎస్.వి.ఎస్. సుబ్బారాయుడు, వారి ఇద్దరు చెల్లెళ్ళు అన్నపూర్ణ, కుసుమ కిడ్నీ సమస్యతోనే కన్నుమూశారు. సుబ్బా రాయుడు తో పాటు, కుసుమ భర్త లక్ష్మారెడ్డి కూడా దేవులపల్లి, తరిమెల నాగిరెడ్డి రాజకీయాలతో పని చేశారు. ఎమర్జెన్సీ కాలంలో తరిమెల నాగిరెడ్డి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నప్పుడు లక్ష్మారెడ్డి ఆయనకు సహాయ కారిగా ఉన్నారు. రెండున్నరేళ్ళ క్రితం విజయ్ తిరుపతి వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు. అప్పటికీ ఆయన డయాలిసిస్ పైనే ఉన్నారు. డయాలిసిస్ పై ఆధారపడడంతో తిరగడం ఆపేశారు. డయాలిసిస్ పై కి వెళ్ళిపోతే ఎక్కువ కాలం నెట్టుకు రావడం కష్టం.
చివరి సారిగా ఏడాది క్రితం విజయ్ ని కలిసినప్పుడు రచయిత రాఘవ తీసుకున్న ఫోటో
విజయ్ ని మళ్ళీ కలవలేకపోవచ్చని ఏడాది క్రితం అతికష్టం పైన హైదరా బాదులో కలిశాను. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. వ్యక్తిగత విషయాలు, కుటుంబ ఆరోగ్య విషయాలే తప్ప మా మధ్య రాజకీయాల చర్చ రాలేదు. విజయ్ ని మళ్ళీ కలవగలనో లేదో అన్న అనుమానం కలిగింది. ఆయన ఫొటో బయట ఎక్కడా ఉండదు. ఫొటోకి సహజంగా ఒప్పుకోరు. అయినా ‘ఒక ఫొటో తీసుకోవచ్చా’ అని అడిగా. తీసుకుందామన్నారు. ఇదిగో ఈ ఫొటో అలా తీసుకున్నదే. ఆయన మరణించాక విజయ్ ఫొటో ఇలా ఉపయోగపడుతుందని నేను ఊహించలేదు. అయిదు దశాబ్దాల విప్లవ నిబద్దుడికి ఇవే అక్షర నివాళులు.