Kishan Reddy | ఎన్నికలతో కాంగ్రెస్ మళ్ళీ నవ్వుల పాలైందా..?

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-23 13:09 GMT

మహారాష్ట్ర(Maharashtra), ఝార్ఖండ్(Jharkhand) ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి ఆర్థిక రాజధాని, వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే మహారాష్ట్రలో బీజేపీ(BJP) కూటమి మహాయుతి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్(Congress) తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు మాత్రం తమ పార్టీనే నమ్మారని అన్నారు. మహారాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కార్‌కు ప్రజలు ఓటేశారని, కాంగ్రెస్ కుట్రలకు తుంగలో తొక్కారంటూ దుయ్యబట్టారు. బీజేపీకి మరాఠా ప్రజలు అత్యధిక ఓట్లు, సీట్లు ఇచ్చారని చెప్పారు. గత ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ బీజేపీపై బురదజల్లడం వల్లే కాంగ్రెస్ లబ్ది పొందిందని, లేని పక్షంలో కథ వేరేలా ఉండి ఉండేదని అన్నారు. కాంగ్రెస్.. కులం, మతం, భాష పేరుతో రాజకీయాలు చేస్తుందని, పైగా బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని తమపై గుడ్డ కాల్చి వేస్తుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తీరు గురివింద గింజ తరహాలో ఉందని చురకలంటించారు. ప్రజలను అన్ని రకాల కష్టాలకు, నష్టాలకు గురి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందంటూ విసుర్తు విసిరారు.

‘‘రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి మతిమరుపు పెరిగిపోయింది. ఈ దేశాన్ని అత్యధిక సమయం పాటు కాంగ్రెస్ పార్టీనే పాలించిందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. మొత్తానికి బీజేపీనే కారణం అని ప్రచారం చేస్తున్నారు. ఝార్ఖండ్, మహారాషట్ర రెండు రాష్ట్రాల్లో కలిసి కాంగ్రెస్‌కు 30 సీట్ల కూడా వచ్చేలా లేదు. మహారాష్ట్రలో అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. రాజ్యాంగాన్ని చేతబట్టుకుని మరీ కాంగ్రెస్ నాయకులు విషప్రచారం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

‘‘రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూస్తుంటే కాంగ్రెస్ పై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందనేది అర్థం అవుతోంది. కాంగ్రెస్ కుయుక్తులకు, అబద్ధాలకు, అసత్యాలకు మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం బాల్ ఠాక్రే శివసేనకు మోసం చేశారు. మూడోసారి మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ కు వరసగా ప్రజలు పట్టం కడుతున్నారు. గ్యారెంటీల వైఫల్యాల వల్ల కాంగ్రెస్ దివాల తీసే పరిస్థితుల్లో ఉంది. మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితమయింది’’ అని చురకలంటించారు.

‘‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్ పార్టీ ఎయిర్ పోర్ట్ లో నాలుగు విమానాలు సిద్ధం చేశారు. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తున్నమనే భ్రమలో కాంగ్రెస్ కొంతమంది ఎమ్మెల్యేలను తెలంగాణకు, మరికొంత మంది ఎమ్మెల్యే లను కర్నాటకకు తరలించాలుకున్నారు. ఫలితాల ఈక్వేషన్స్ చూశాక కాంగ్రెస్ తొక ముడిచింది. బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే మాటలను మహారాష్ట్ర ప్రజలు బేఖాతరు చేశారు. నిజమైన శివసేనకు మరాఠీ ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. ఉద్ధవ్ ఠాక్రే విధానాలపై మరాఠీ ప్రజలు తిరుగుబాటు చేశారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్ర ప్రజలు బాల్ ఠాక్రేను అభిమానిస్తారు. కానీ ఆయన వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ఇండి కూటమితో చేరి బాల్ ఠాక్రే కున్న పరువూ తీశారు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘మహారాష్ట్రలో మాకు ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. సంజయ్ రౌత్ పనికిరాని రాజకీయ నాయకుడు. ఈవీఎంలను మేనేజ్ చేశారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. జార్ఖండ్ లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయా..? కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగనట్టు, బీజేపీ గెలిస్తే ట్యాంపరింగ్ చేసినట్టా..? వయనాడ్‌లో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పై గట్టి పోటీనిచ్చాం. బీజేపీ ప్రభుత్వాలపై, మోదీ పాలనపై దేశ ప్రజలు పూర్తి విశ్వాసాన్ని కనబరుస్తున్నారు అనడానికి మహారాష్ట్ర ఎన్నికలు నిదర్శనం. మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బులు పంపంపించిన పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ గాంధీకో, సోనియా గాంధీ(Sonia Gandhi)కో, రేవంత్ రెడ్డి(Revanth Reddy)కో ప్రజలు ఓట్లేయలేదు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించాలని లక్ష్యంతో ఓట్లేశారు’’ అని అన్నారు కిషన్ రెడ్డి.

Tags:    

Similar News