తెలంగాణలో పట్టాలెక్కని రైల్వే ప్రాజెక్టులు,కాసులు రాల్చని కేంద్రం
తెలంగాణలో కొత్త రైలు మార్గాల నిర్మాణం కోసం సర్వే చేసి డీపీఆర్‌లు సిద్ధం చేసినా, కేంద్రం కాసులు రాల్చడం లేదు. కొత్త రైలు మార్గాల నిర్మాణం పట్టాలెక్కడం లేదు.;
By : Saleem Shaik
Update: 2025-05-27 03:35 GMT
తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులున్నా రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మోక్షం లభించడం లేదు.రాష్ట్రంలోని కొన్ని రైల్వేస్టేషన్లను ఆధునీకరించి గొప్పలు చెప్పుకుంటున్న భారతీయ రైల్వే తెలంగాణలోని కొత్త రైలు మార్గాల నిర్మాణాలకు పచ్చజెండా ఊపడం లేదు.
ఎన్నెన్నో రైల్వే ప్రాజెక్టులు పెండింగులోనే...
- తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైలు నడపాలనే ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు, హైదరాబాద్ నగరానికి ప్రతీరోజూ రాకపోకలు సాగించే ఉద్యోగులు, కార్మికుల కోసం గుట్టకు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు ఏళ్లు గడుస్తున్నా డీపీఆర్ కే పరిమితం అయ్యాయి. యాదగిరి గుట్ట-సికింద్రాబాద్ మార్గంలో రైలు పట్టాలున్నా ఎంఎంటీఎస్ రైళ్లు నడపడంలో రైల్వే శాఖ తాత్సారం చేస్తుంది.
- డోర్నకల్-మిర్యాలగూడతో పాటు కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైలు మార్గాల నిర్మాణానికి సర్వేలు చేసి,డీపీఆర్‌లు సిద్ధం అయినా కేంద్రం నిధులు ఇవ్వలేదు.డోర్నకల్-మిర్యాలగూడ కొత్త ట్రైన్ మార్గం అతీ గతీ లేకుండా పోయింది. కరీంనగర్-హసన్ పర్తి మార్గం ఊసే లేకుండా పోయింది.
-ఆదిలాబాద్ -ఆర్మూర్ కొత్త రైల్వే లైను నిర్మాణం ఏళ్లు గడస్తున్నా ప్రతిపాదనల్లోనే మగ్గుతోంది.
- హైదరాబాద్ మెట్రోరైలును పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు పొడిగించాలనే ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చలేదు.
- శంషాబాద్ -విజయవాడకు హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మించాలని రూపొందించిన ప్రతిపాదనలు కూడా రైల్వే బోర్డు వద్ద పెండింగులోనే ఉన్నాయి.
- వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా నది వరకు కొత్త రైల్వే లైను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదు.
- హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు లాజిస్టిక్ హబ్ కనెక్టివిటీగా ప్రాంతీయ రింగ్ రైలు మార్గం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా, రైల్వే శాఖ అధికారులు ఇంకా ప్రపోజల్ కూడా రూపొందించలేదు.
రైల్వే కనెక్టివిటీ ఏది?
తెలంగాణలో పలు జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. రైలు కూడా చూడని జిల్లాలు ఇంకా తెలంగాణలో ఉన్నాయి.రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ లేదు. ములుగు, నిర్మల్, భూపాలపల్లి, సంగారెడ్డి, వనపర్తి, నగర్ కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు రైలు మార్గం లేదు. తెలంగాణలోని భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మేడారం, రామప్ప, భద్రాచలం, సమ్మక్క సారక్క కేంద్రాలకు రైలు మార్గాలు నిర్మించలేదు.
వినతిపత్రాలు చెత్తబుట్ట దాఖలు
తెలంగాణలో బీజేపీకి ఇద్దరు కేంద్రమంత్రులు, 8మంది ఎంపీలున్నా రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం కాసులు రాల్చడం లేదు.తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి, ప్రధానమంత్రికి, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని అధికారికంగా లేఖలు రాసినా అవి చెత్తబుట్ట దాఖలా అయ్యాయి.8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం నుంచి కాసులు రాలడం లేదు.
పెద్ద రైల్వే ప్రాజెక్టుకలకు మోక్షమేది?
భారతీయ రైల్వేశాఖ తెలంగాణలోని రైల్వే స్టేషన్లను మాత్రం అమృత్ పథకం కింద విమానాశ్రయాలుగా అభివృద్ధి చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తుందే తప్ప, పెద్ద రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కల్పించడం లేదు. ఇటీవల చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, వరంగల్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశారు కానీ కొత్త రైలు మార్గాలు నిర్మించి, ప్రయాణికులకు రైల్వే సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులను విస్మరిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జాతీయ రైల్వే ప్రణాళికలో తెలంగాణను క్రమపద్ధతిలో పక్కన పెడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కొత్త రైలు మార్గాలపై డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ,నిధులు లేక రైల్వే లైన్ల నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ ఎంపీల స్పందనేది?
సికింద్రాబాద్ స్టేషన్ పునరుద్ధరణ వంటి అభివృద్ధిని ప్రదర్శించినప్పటికీ, ఉత్తర తెలంగాణ, గిరిజన తెలంగాణ జిల్లాల్లో రైల్వే కనెక్టివిటీకి బీజేపీ కేంద్ర మంత్రులు ఒత్తిడి రైల్వే బోర్డుకు ఒత్తిడి తీసుకురావడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ ఇచ్చే ముఖ్యమైన ప్రాంతీయ రైల్వే లైన్ల నిర్మాణంపై రైల్వే శాఖ ఆసక్తి చూపించడం లేదు.కేంద్రమంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తెలంగాణలో పెండింగులో ఉన్న పెద్ద రైల్వే ప్రాజెక్టులపై దృష్టి సారించడం లేదు. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ఎంపీలు రైల్వే సంబంధిత డిమాండ్లను పార్లమెంటులో లేవనెత్తడం లేదు. రైల్వే శాఖ కాజీపేట రైల్వేస్టేషన్ కు సంబంధించి పనులకు నిధులు ఇవ్వడం లేదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు.సికింద్రాబాద్- కాజీపేట మూడో రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం లేదని ఆమె చెప్పారు.
ఎన్నివేల కోట్లు అయినా ఇస్తాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ అభివృద్ధికి ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్ి తాజాగా ప్రకటించారు.కొత్త రైలు మార్గాల నిర్మాణానికి భూములు అవసరమని, భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మంత్రి కోరారు.యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ గత బీఆర్ఎస్ వైఖరి వల్ల ఆరేళ్ల జాప్యం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం వల్ల రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. కానీ కేంద్రం ప్రాజెక్టులకు నిధులు మాత్రం విదల్చడం లేదు.
కరీంనగర్ -హసన్ పర్తి రైలు మార్గం నిధులు మంజూరు చేపిస్తా : బండి సంజయ్
కరీంనగర్ -హసన్ పర్తి రైలు మార్గం నిర్మాణానికి రూ.1490 కోట్లతో డీపీఆర్ రూపొందించామని, త్వరలో దీనికి నిధులు మంజూరు చేయిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామి ఇచ్చారు.11 ఏళ్లలో ఇరవైకి పైగా రైల్వే ప్రాజెక్టులు చేపట్టామని, భవిష్యత్తులోనూ నిధులు సాధిస్తామని చెప్పారు. జమ్మికుంట రైల్వేస్టేషన్ ను ఆధునీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు రైల్వే కనెక్టివిటీ పెంచాలి : మంత్రి కోమటిరెడ్డి
గ్రామీణ అనుసంధానాన్ని పెంచడానికి తెలంగాణలో ఆరు కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించారు. మిర్యాలగూడ, నల్లగొండ రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని, యాదగిరిగుట్ట టూ హైదరాబాద్ ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పించాలని మంత్రి రైల్వేశాఖాధికారులకు విన్నవించారు. తెలంగాణలో మరిన్ని నగరాలతో రైల్వే నెట్ వర్క్ కల్పించాలని మంత్రి సూచించారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ మార్గాన్ని పొడిగించాలని కోరినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం టెండర్లు పిలిచారని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంఎంటీఎస్ సేవలు అందించాలని మంత్రి డిమాండ్ చేశారు.
రైల్వే జీఎంకు కాంగ్రెస్ ఎంపీల వినతి
కాంగ్రెస్ ఎంపీలు డాక్టర్ కడియం కావ్య (వరంగల్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), ఆర్.రఘురాం రెడ్డి (ఖమ్మం) ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను కలిసి, తమ ప్రాంతానికి సంబంధించిన రైలు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.తమ పార్లమెంటు నియోజకవర్గాల్లో రైల్వే సమస్యలను తీర్చి రైలు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పర్చాలని వారు అభ్యర్థించారు.