అప్పాలయచెరువులో కనిపించిన కొత్త కీల్గుంటె వీరగల్లు

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం అప్పాలయ చెరువులో ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఈ కొత్త వీరగల్లు గుర్తించాడు

Update: 2024-08-22 05:56 GMT

అప్పలాయ చెరువులో కనిపించినది ఒక  వీరగల్లు. ఈ వీరగల్లులో ప్రధానవీరుడు అశ్వారూఢుడై (గుర్రం పై కూర్చొని)బూమరాంగ్ వంటి వంపు కత్తి ధరించి వున్నాడు. అతనికి నడి నెత్తిన కొప్పు కత్తి ఉంది. ఇది రాష్ట్రకూటుల కాలం నాటి వీరగల్లనడానికి ఆధారం. అతని కుడిచేయి పక్కన ధ్యానాసనస్థితిలో కూర్చున్నది వీరుని గురువు కావచ్చు. ఎడమ చేతితో గుర్రపు కళ్ళెం పట్టుకున్నాడు ,ఆచేతి మీదుగా కనిపిస్తున్న చెట్టు ఉంది. రెండు ఎద్దులు చెట్టు కొమ్మలను అందుకోవడానికి ఎగురుతున్నాయి. ఆ చెట్టు కొమ్మల మీద రెండు పిట్టలున్నాయి. గుర్రం ముఖానికి ఎదురుగా ఉన్న స్త్రీదేవత తలవెనక పెద్ద ధమ్మిల్లంతో అగుపిస్తున్నది. ఇది కూడా రాష్ట్రకూట శైలే. ఆ దేవత కింద ఇద్దరు వీరులు రాజభటులు కావచ్చు, వేటకుక్కలతో అడివిపందిని వేటాడుతున్నారు.

గుర్రం కింద ఉన్న అంతస్తు శిల్పాలలో మరొక ధ్యానాసనస్థితిలో కూర్చున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. పక్కన ప్రధాన వీరుని వలె వంపు కత్తి పట్టుకుని మరొక వీరుడు కనిపిస్తున్నాడు. ఆసనస్థితిలో ఉన్న మనిషి కింద పక్షి కనిపిస్తున్నది. ఒకే శిల్పంలో అనేక వివరాలను చెక్కిన శిల్పి ప్రతిభ గొప్పది. ఇది వీరగల్లే, కానీ కీల్గుంటె వీరగల్లు అనడానికి అనువుగా వుంది. కింది అంతస్తులోని పక్షి, వేటకుక్కలు, ఇద్దరు వీరులు వారి మరణాంతర స్థితిని సూచిస్తున్నది ఈశిల్పం.

క్షేత్రపరిశోధన, ఫోటోగ్రఫీ: కొలిపాక శ్రీనివాస్, పరిశోధక సభ్యుడు, కొత్త తెలంగాణచరిత్రబృందం
చారిత్రకవ్యాఖ్య: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణచరిత్రబృందం


Tags:    

Similar News