తెలుగు రాష్ట్రాల పార్టీలపై సుదర్శన్ రెడ్డి అసంతృప్తి
తెలంగాణ అస్థిత్వం ఏకమైపోయిందని ప్రశ్నించిన సుదర్శన్ రెడ్డి.;
ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల వైఖరిపై విపక్షాల ఉమ్మడి అభ్యర్థి బీ సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు తమ మద్దతు ఎవరికి అనే అంశంపై స్పష్టత ఇవ్వని క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే విధంగా ఏపీలోని వైసీపీ పార్టీ ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించగా, తెలంగాణలోని బీఆర్ఎస్ మాత్రం ఇంకా స్తబ్దుగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవికి కాదని, రాజ్యాంగ పదవికని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించాలని సూచించారు. అంతేకాకుండా ‘తెలుగు ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది? తెలంగాణ అస్థిత్వం ఏమైపోయింది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగానే వైసీపీ తన మద్దతును స్పష్టంగా ప్రకటించగా, టీడీపీ, బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆయన చెప్పారు.
టీడీపీ, బీఆర్ఎస్ తీరు శోచనీయం
‘‘టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్దతు కోసం వారిని సంప్రదించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. కనీసం మాట్లాడటానికి కూడా వారు ప్రాధాన్యత చూపకపోవడం, వెనకడుగు వేయడం శోచనీయం. ‘సల్వా జుడం’పై నేను గతంలో ఇచ్చిన తీర్పును నాకు వ్యతిరేకంగా వినియోగించాలన్నకేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమిళనాడు, లక్నో వంటి ప్రాంతాల్లో తన అభ్యర్థిత్వానికి మంచి మద్దతు లభించింది. న్యాయమూర్తిగా చూసిన రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయలు భిన్నంగా ఉంటాయి. 1971 నుంచి నేను రాజ్యాంగబద్దంగా నడిచాను. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడం ప్రయాణానికి కొనసాగింపే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.