అవినీతిని ప్రశ్నించినందుకే మూర్తిని చంపేశారా ?

భార్యా, భర్తలు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కేసీఆర్(KCR), హరీష్(Harish) కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్లు వేయటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది;

Update: 2025-02-20 05:19 GMT
Deceased Rajalinga Murthy

ఇపుడిదే అనుమానం అందరిలోను పెరిగిపోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ నేత నాగవెల్లి రాజలింగంమూర్తి(Rajalinga murthy) బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పట్టణ శివార్లనుండి ఇంటికి వస్తున్న మూర్తిని కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారికాచి కత్తులతో పొడిచి చంపేశారు. కత్తులతో చేసిన దాడినుండి హతుడు తప్పించుకున్నా హంతకులు వదలిపెట్టకుండా వెంటాడి మరీ చంపేశారు. చాతి, మెడపైన బలమైన గాయాలు అవటంవల్లే ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే మూర్తి చనిపోయాడు. తనభర్తను బీఆర్ఎస్(BRS) నేతలే హత్య చేశారని మూర్తి భార్య, బీఆర్ఎస్ కౌన్సిలర్ సరళతో పాటు వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యా, భర్తలు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కేసీఆర్(KCR), హరీష్(Harish) కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్లు వేయటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. తర్వాత ఇద్దరూ పార్టీకి దూరమైపోయారు.

ఇంతకీ అసలువిషయం ఏమిటంటే కాళేశ్వరం(Kaleswaram project), మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project)ల అవినీతిపై మూర్తి అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. పైరెండు ప్రాజెక్టుల్లో కేసీఆర్, హరీష్ రావు భారీ అవినీతికి పాల్పడ్డారని మూర్తి చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. 2023 అక్టోబర్లోనే కేసీఆర్, హరీష్ పై అవినీతి ఆరోపణలతో స్ధానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. తన ఫిర్యాదు ఆధారంగా వెంటనే పై ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని మూర్తి పట్టుబట్టినా ఉపయోగం లేకపోయింది. దాంతో మూర్తి భూపాలపల్లి(Bhoopalapalli) కోర్టులో కేసీఆర్, హరీష్, ఇంజనీర్ల అవినీతిపై విచారణ జరపాలని ప్రైవేటు కేసు వేశారు. కేసును విచారించిన భూపాలపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణలో భాగంగానే 2024, సెప్టెంబర్లో కేసీఆర్, హరీష్ విచారణకు రావాలని సమన్లు కూడా జారీచేసింది. అయితే పై ఇద్దరు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. తర్వాత అదే కేసు హైకోర్టుకు చేరింది. మూర్తి కేసును విచారించిన హైకోర్టు గురువారం తీర్పు చెప్పబోతోంది. ఇంతలోనే మూర్తి బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోపై జస్టిస్ పినాకినీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. ఆ కమిషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం నిర్మాణాలు, అక్రమాలపై విచారణ జరుపుతోంది. కేసీఆర్, హరీష్ తో పాటు మరికొందరిని విచారించి రిపోర్టును ప్రభుత్వానికి అందించిందేందుకు రెడీ అవుతోంది. మూర్తి కూడా కమిషన్ ముందు హాజరై కేసీఆర్, హరీష్ అవినీతికి పాల్పడినట్లుగా తన దగ్గరున్న ఆధారాలను అందించినట్లు సమాచారం. మూర్తి మొదటినుండి స్ధానిక, రాష్ట్రస్ధాయి ప్రజాసమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నాడు. సమస్యల పరిష్కారానికి అధికారులకు వినతిపత్రాలు ఇవ్వటంతో పాటు తనతో పాటు పదిమందిని అధికారుల చుట్టూ తిప్పేవాడు. భూపాలపల్లి చుట్టు పక్కల ప్రాంతంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువుశిఖం భూముల కబ్జాలతో పాటు అటవీశాఖ భూముల అన్యాక్రాంతం అవుతుండటంపైన కూడా మూర్తి ఫిర్యాదులతో పోరాటాలు చేస్తున్నాడు. అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రా అక్రమంగా కొందరికి ఇంటిస్ధలాలు కేటాయించాడని ఆరోపిస్తు మూర్తి కలెక్టర్ పైన కూడా కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఇలాంటి అనేక పోరాటాలు చేస్తున్న కారణంగానే మూర్తి అంటే పట్టణంలో చాలామందిలో పాజిటివ్ ఇమేజి ఉంది.

సమస్యలపై మూర్తి చాలాకాలంగా పోరాటాలు చేస్తున్న కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి, అక్రమాల్లో కేసీఆర్, హరీష్ పైన చేసిన ఫిర్యాదు, కోర్టుల్లో దాఖలుచేసిన ప్రైవేటు కేసులతో బాగా పాపులరయ్యాడు. కేసీఆర్, హరీష్ అవినీతిపై పోరాటాలు చేయటాన్ని సహించలేని బీఆర్ఎస్ నేతలే తన భర్తను హత్యచేశారని మూర్తి భార్య సరళ ఆరోపిస్తున్నారు. మూర్తిని ఎవరు ? ఎందుకు ? హత్యచేశారన్న విషయాన్ని పోలీసులు ఆరాతీస్తున్నారు. స్ధానికంగా కొందరితో మూర్తికి భూతగాదాలు ఉన్న కారణంగానే ప్రత్యర్ధులు హత్యచేసి ఉంటారని డీఎస్పీ సంపత్ రావు మీడియాతో చెప్పారు. అయితే హతుడి భార్య ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని డీఎస్పీ అన్నారు.

ఉలిక్కిపడ్డ భూపాలపల్లి

భూపాలపల్లిలోని రెడ్డికాలనీలో మూర్తి నివాసముంటున్నారు. ప్రశాంతంగా ఉండే పట్టణంలో హత్య జరగటం అందులోను ప్రజాసమస్యలపైన పోరాటాలు చేసే మూర్తిని గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా హత్యచేయటంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేసీఆర్, హరీష్ రావు అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మూర్తి హత్యకు గురవ్వటంతో సహజంగానే చాలామంది దృష్టి బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే నిలిచింది. హత్యను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి(Revanth reddy) కూడా పోలీసులను ఆదేశించారు. దర్యాప్తులో పోలీసులు ఏమి తేలుస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News