కబ్జాలతో అంతర్థానం అవుతున్న చెరువులు, పరిరక్షణకు చర్యలేవి?
కాకతీయుల కాలం నాటి పురాతన చెరువులు,కుంటలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని అంతర్ధాన మవుతున్నాయి.చెరువులు కబ్జాల పాలవుతున్నా చర్యలు తీసుకునే వారు కరువయ్యారు.
By : Saleem Shaik
Update: 2024-08-10 03:17 GMT
‘కబ్జాకు కాదేదీ అనర్హం’ అంటూ ప్రతీ రోజూ ఏ పత్రిక చూసినా చెరువులు, కుంటలు, కాల్వల స్థలాలు కబ్జాల పాలవుతున్నాయని వార్తలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన వేలాది చెరువులు, కుంటలను రాజకీయ, అధికారుల అండదండలతో కొందరు కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువుల శిఖం భూముల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి.
- హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ వందలాది నీటి జలాశయాలు, చెరువులు, కుంటలున్నాయి.ఏ నగరంలో లేని విధంగా మూసీ నది నగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తోంది. మనకున్న వాటర్ బాడీస్ ను పరిరక్షించుకుంటే భవిష్యత్ లో నీటి కొరత అనేది ఉండదు. మన హైదరాబాద్ నగరంలో వాటర్ బాడీస్ ను సంరక్షించుకుంటే చాలు గోదావరి, కృష్ణా నదుల నుంచి మంచినీటిని నగరానికి తీసుకురావాల్సిన అవసరమే ఉండదని సోషల్ యాక్టివిస్టు డాక్టర్ లూబ్నా సర్వత్ చెబుతున్నారు.
జంట జలాశయాల చెంత కబ్జాల పర్వం
శంషాబాద్ మండలం హిమాయత్ సాగర్ పరిధిలోని కొత్వాల్ గూడ గ్రామ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో విల్లాలు వెలుస్తున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల శిఖం భూములు కూడా కబ్జాదారుల చెరలో చిక్కుకున్నాయి. జంట జలాశయాల చెంత ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు ఆక్రమించుకొని వాటికి పత్రాలు సృష్టిస్తున్నారు.
జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు కబ్జా
హైదరాబాద్ నగర శివార్లలోని జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువుకు వందేళ్ల నాటి చరిత్ర ఉంది. నిజాం జమానాలో ఈ చెరువు తాగు, సాగునీరందించింది. ఇప్పటికీ వర్షాకాలంలో నిండా నీటితో కళకళ లాడే ఫాక్స్ సాగర్ చెరువు విస్తీర్ణం 500 ఎకరాలు కాగా, ఇందులో 300 ఎకరాలు కబ్జాదారుల పరమైంది. కొందరు బడా వ్యక్తులు దూలపల్లి వైపు నుంచి చెరువు శిఖం భూమిలో మట్టి నింపి దాన్ని ఆక్రమించి అద్దెలకు ఇస్తున్నారు.
బమ్ రుక్ నాథ్ చెరువు అంతర్థానం
హైదరాబాద్ నగర శివార్లలోని బమ్ రుక్ నాథ్ చెరువు పదేళ్లలో కబ్జాదారుల చెరలో చిక్కి అంతర్ధానమైంది.ఈ చెరువు కబ్జాపై తాజాగా సర్వే చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కబ్జాదారుల చెర నుంచి బమ్ రుక్ నాథ్ చెరువును కాపాడాలని కోరుతూ లూబ్నా సర్వత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కబ్జాలతో కుచించుకు పోయిన బ్రహ్మదేవర చెరువు
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో కాకతీయుల నాటి బ్రహ్మదేవర చెరువు శిఖం కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. 24 గ్రామాలకు తాగునీటితోపాటు 11వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ చెరువు శిఖం భూమిలో 60 ఎకరాలు అన్యాక్రాంతం అయింది.కొందరు చెరువు శిఖం భూమిలో మట్టి నింపి ఆక్రమించుకున్నారు. 30 కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమి కబ్జాల పాలైన నీటి పారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఆక్రమణల పాలైన కుంటలు
నిన్న పీరంచెరువు...నేడు ఫాక్స్ సాగర్ కబ్జాల పాలయ్యాయి.చెరువుల్లో ఖాళీజాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. రాజకీయ అండదండలతో కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు.నల్గొండ జిల్లాలోని బ్రహ్మదేవర చెరువే కాదు మోదుగుల చెరువు, చౌడమ్మకుంట, కుతురోని కుంట, రసూల్ గూడెం ఊరకుంట, తీగలమ్మ చెరువు, నేల మర్రికుంట ఆక్రమణల పాలయ్యాయి.
శిఖం భూమి కబ్జాపర్వం
మిర్యాలగూడ శివార్లలో పందిళ్లపల్లి చెరువు కబ్జాకు గురైంది. శిఖం భూమిన ఆక్రమించిన కబ్జాదారు ఇరిగేషన్ అధికారికి ఆరుగుంటల స్థలాన్ని ఇచ్చారని సమాచారం. హుజూర్ నగర్ పట్టణంలో చెరువు శిఖం భూమి ఆక్రమణల పాలైంది.మట్టపల్లి రోడ్డులోని పోతిరేనికుంట చెరువు, బట్టవానికుంట చెరువు, తుమ్మలకుంట చెరువులు కబ్జాలతో విస్తీర్ణం తగ్గిపోయాయి.
కబ్జాదారుల కబంధ హస్తాల్లో చెరువులు
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో చెరువులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6,575 చెరువులు, కుంటలు ఉండగా వీటిలో 1250 చెరువులు, కుంటలు కబ్జాలతో అంతర్ధానమయ్యాయి. మహబూబ్ నగర్ పెద్దచెరువు, నాగర్‌కర్నూల్ పట్టణంలో ఉన్న కేసరి సముద్రం, పుట్నాల చెరువు, తెలకపల్లి పెద్ద చెరువు కబ్జాలతో కుచించుకుపోయాయి. పెద్దకొత్తపల్లి మండలంలోని వడ్డోనికుంట శిఖం భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి.సాతాపూర్ గ్రామంలోని నరసింహ కుంటను మట్టితో పూడ్చారు.
చెరువు శిఖంలో మట్టి నింపారు...
దుండిగల్ మండలంలోని లక్కకుంట చెరువులో కబ్జాదారులు మట్టి నింపి పూడ్చివేశారు.ఎకరం పదికోట్ల రూపాయల విలువ ఉన్న ఈ చెరువును కొందరు బడా వ్యక్తులు ఆక్రమించేశారు. గాగిల్లాపూర్ గ్రామంలోని లక్కకుంట చెరువు సర్వే రికార్డుల్లో ఉంటుంది తప్ప అందులో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. చెరువు కబ్జా అయిన నీటిపారుదల శాఖ పట్టించుకోవడం లేదు.
రాళ్లతో కుంట కబ్జా
ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు శిఖంలో కొందరు అక్రమార్కులు మట్టి, రాళ్లు నింపి కబ్జాకు యత్నించారు.650 ఎకరాల విస్తీర్ణంలోని లక్ష్మీనారాయణ చెరువు కబ్జాలతో తగ్గిపోయింది. చెరువు ఎఫ్ టీఎల్ నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ వదిలిపెట్టాలనే నిబంధనలకు నీళ్లు వదిలి కబ్జా చేశారు.
కబ్జాలను పట్టించుకోని అధికారులు
మెదక్ జిల్లా నారాయణరావు పేట మండలం గోపులాపూర్ గ్రామంలోని పాన్ చెరువు, ఎర్రకుంట కబ్జాకు గురయ్యాయి. పట్టాభూములను ఆనుకొని ఉన్న శిఖం భూములను కబ్జా చేశారు.చెరువు ఫుల్ ట్యాంకు లెవెల్ ప్రాంతమే కబ్జాల పాలైంది. నాడు కాకతీయుల కాలం నాటి పురాతన చెరువులు కూడా కబ్జాల వల్ల మాయం అవుతున్నా సర్కారులో చలనం లేదు. మల్యాల మండలంలోని తాటిపల్లిలో చెరువు భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. చెరువు శిఖం భూమిలో మట్టి నింపి కబ్జా చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్ నగర్ గుడికుంట చెరువు కబ్జాదారుల పాలైంది.
చెరువులను సంరక్షిస్తేనే భవిష్యత్ : డాక్టర్ లూబ్నా సర్వత్
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలో అపారంగా ఉన్న చెరువులు, కుంటలు, నదులు, కాల్వలు మనకు ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటిని మనం సంరక్షించుకుంటేనే భవిష్యత్ అని సోషల్ యాక్టివిస్టు డాక్టర్ లూబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన హైదరాబాద్ మంచినీటి అవసరాల కోసం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలున్నాయని, వీటిని మనం కబ్జాల బారిన పడకుండా కాపాడుకోవాలని ఆమె సూచించారు. చెరువులు, కుంటలు, కాల్వలను మనం సంరక్షించుకుంటే నీటి ఎద్దడి సమస్య అనేది ఉండదని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలో కబ్జాల పాలైన చెరువులన్నింటిలో కబ్జాలను తొలగించి నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డాక్టర్ లూబ్నా సర్వత్ డిమాండ్ చేశారు.