అసలు నిత్యానందకు ఏమైంది ?
నిత్యానంద(Swami Nityananda) క్యాంపు నుండే రెండు భిన్నమైన ప్రచారాలు జరుగుతుండటంతో భక్తజనుల్లో అయోమయం పెరిగిపోతోంది;
అసలు నిత్యానందుడికి ఏమైంది ? సజీవ సమాధి అయిపోయాడా ? లేకపోతే సజీవంగానే ఉన్నాడా ? సజీవసమాధి అయినట్లుగా జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనా ? నిత్యానంద(Swami Nityananda) క్యాంపు నుండే రెండు భిన్నమైన ప్రచారాలు జరుగుతుండటంతో భక్తజనుల్లో అయోమయం పెరిగిపోతోంది. నిజానికి నిత్యానందుడికి ఏమైనా మామూలు జనాలకు(భక్తజనులు కాదుసుమా) అవసరమేలేదు. కాకపోతే ఈ స్వయంప్రకటిత స్వామీజీకి కూడ అశేషసంఖ్యలో భక్తులున్నారు. నిత్యానందుడి సజీవ సమాధి ప్రకటన విని వాళ్ళంతా శోకసముద్రంలో పడిపోయే ప్రమాదముంది. ఇంతకీ విషయం ఏమిటంటే నిత్యానంద సజీవసమాధిలోకి వెళిపోయారని, ఇక తిరిగిరారని సుందరేశ్వరన్ ప్రకటించారు.
ఇంతకీ ఈ సుందరేశ్వరన్ ఎవరంటే నిత్యానందుడికి స్వయాన మేనల్లుడు. మేనమామ సజీవసమాధి గురించి స్వయంగా మేనల్లుడే ప్రకటించిన తర్వాత భక్తజనులు నమ్మకుండా ఎలాగుంటారు. మేనల్లుడి ప్రకటన తర్వాత అధికారికంగా నిత్యానందుడి క్యాంపునుండి ఎలాంటి ఖండనలులేవు. దాంతో సుందరేశ్వరన్ ప్రకటన నిజమే అని చాలామందిలో ఆందోళన మొదలైంది. నిత్యానందుడి భక్తుల మొహాల్లో ఆనందం మాయమైపోయింది. అయితే రెండు రోజుల తర్వాత సడెన్ గా నిత్యానందుడి ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే నిత్యానందుడు సజీవసమాధి పొందారన్న ప్రకటన నిజంకాదన్నాడు.
ఎప్పటిలాగే నిత్యానందుడు ఆరోగ్యంగా, సంతోషంగా, చలాకీగా ఉన్నారని ప్రకటించాడు. అయితే ప్రెస్ సెక్రటరీ ప్రకటనైతే చేశారు కాని నిత్యానందుడి దర్శనం మాత్రం ఎవరికీ కనిపించలేదు. దాంతో ప్రెస్ సెక్రటరీ ప్రకటనపైన భక్తుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిత్యానందుడు సజీవసమాధిలోకి వెళ్ళిపోయారన్న సుందరేశ్వరన్ ప్రకటనలో లాజిక్ ఉంది. అదేమిటంటే సజీవసమాధి అయిపోయిన నిత్యానందుడి ఫొటోలు ఎలాగూ చూపించలేరు. ఇదే సమయంలో నిత్యానందుడు బాగానే ఉన్నట్లు, ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నట్లు ప్రెస్ సెక్రటరీ చేసిన ప్రకటనకు ఆధారం చూపించాలి కదా. ఆరోగ్యంగా, చలాకీగా నిత్యానందుడు ఉన్నాడంటే స్వయం ప్రకటిత స్వామి తాజా వీడియో విజువల్స్ చూడాలని భక్తులు కోరుకోవటంలో తప్పులేదు. అయితే ప్రెస్ సెక్రటరీ అలాంటి విజువల్స్ ఏమీ చూపించకుండానే తన మాటే శాసనం అన్నట్లు ప్రకటన చేసి ఊరకుండిపోయారు.
ఇపుడు భక్తుల్లో ఈక్వెడార్(Ecuador)కు చుట్టుపక్కల ఎక్కడో ఏర్పాటుచేసిన కైలాసదేశం(Kailasa Desa) ఏమైపోతుందో అనే ఆందోళన పెరిగిపోతోంది. భక్తుల ఆందోళనలు ఎలాగున్నా అసలు నిత్యానందుడు సజీవసమాధి అయిపోయాడా ? లేకపోతే సజీవంగానే ఉన్నాడా ? అనే అయోమయం బాగా పెరిగిపోతోంది. దీనికి క్లారిటి ఇవ్వాల్సింది మాత్రం నిత్యానందుడే.