కవితక్కా...పింక్ బుక్ ఏమైంది ?

బీఆర్ఎస్ ఎంఎల్సీగా ఉన్నంతకాలం ఏవేదిక మీదనుండి మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీని ఉద్దేశించి పింక్ బుక్ రెడీచేస్తున్నట్లు పదేపదే ప్రకటించేవారు;

Update: 2025-09-02 12:37 GMT
Kavitha and Pink Book

ఇపుడిదే విషయమై తెలంగాణ జాగృతి, కల్వకుంట్ల కవిత అభిమానులను తొలిచేస్తోంది. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, ప్రత్యర్ధిపార్టీల ఆరోపణలకు మద్దతుగా వ్యవహరిస్తున్నందుకు చేస్తున్నందుకు కవిత(Kavitha)ను పార్టీ అధినేత కేసీఆర్(KCR) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అన్న, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను ఉద్దేశించి కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శల కారణంగా ఏదోరోజు కవితను బీఆర్ఎస్(BRS) పార్టీలో నుండి బయటకు పంపేయటం ఖాయమని చాలామంది అనుమానిస్తున్నారు. కాళేశ్వరం(Kaleshwaram Scam)లో అవినీతికి పార్టీలోని కీలకనేతలు తన్నీరు హరీష్ రావు(Harish Rao), జోగినపల్లి సంతోషే కారణమని కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

తానుచేసిన ఆరోపణలే చివరకు పార్టీనుండి కవితను దూరంచేశాయి. ఇదంతా బాగానే ఉందికాని ఇక్కడే కవిత విషయంలో చాలామందికి ఒక అనుమానం మొదలైంది. అదేమిటంటే ఇంతకాలం కవిత మెయిన్ టైన్ చేసిన పింక్ బుక్ పరిస్ధితి ఏమిటని. బీఆర్ఎస్ ఎంఎల్సీగా ఉన్నంతకాలం ఏవేదిక మీదనుండి మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీని ఉద్దేశించి పింక్ బుక్ రెడీచేస్తున్నట్లు పదేపదే ప్రకటించేవారు. ఒకవిధంగా పింక్ బుక్ పేరుచెప్పి కాంగ్రెస్ నేతలను బెదిరించేందుకు ప్రయత్నించేవారనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. పింక్ బుక్ పేరుతో ఎవరిని కవిత బెదిరిస్తున్నారంటు ఆమధ్య పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే.

ఇపుడు విషయం ఏమిటంటే ఇంతకాలం కవిత రాసుకొచ్చిన పింక్ బుక్ ను ఏమిచేస్తారు ? అన్నదే చాలామందిలో డౌట్ పెరిగిపోతోంది. బీఆర్ఎస్ లో ఉన్నపుడు కవిత చెప్పిన పింక్ బుక్ కు ఎంతోకొంత విలువుండేది. ఇపుడు పార్టీలో నుండి సస్పెండ్ అయిన కారణంగా పింక్ బుక్ పెట్టుకుని కవిత ఏమిచేస్తారు ? అన్నదే చాలామందిలో పెరిగిపోతున్న సందేహం. అసలు ఇప్పటివరకు పింక్ బుక్ లో కవిత ఎంతమంది పేర్లు రాశారు ? ఎవరెవరి పేర్లున్నాయో కూడా ఎవరికీ తెలీదు. ఒక పింక్ బుక్కును చేతిలో పెట్టుకుని పదేపదే ప్రదర్శించేవారు. ఈ నేపధ్యంలోనే తొందరలోనే పార్టీద్వారా వచ్చిన ఎంఎల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బహుజన రాష్ట్రసమతి పేరుతో కొత్తపార్టీ ఏర్పాటుచేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది.

బుధవారం మధ్యాహ్నం జాగృతి ఆఫీసులో కవిత మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కవిత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. ఈ నేపధ్యంలోనే కవిత ఇంతకాలం కష్టపడి తయారుచేసిన పింక్ బుక్ ను ఏమిచేయబోతున్నారన్నదే అర్ధంకావటంలేదు. అదే బుక్ ను కంటిన్యు చేస్తారా ? లేకపోతే మళ్ళీ కొత్తగా మరో పింక్ బుక్ రెడీచేస్తారా ? చూడాలి.

Tags:    

Similar News