Revanth and AlluArjun|తెలుగు సినిమాతో రేవంత్ కు ఎక్కడ చెడింది ?

రేవంత్ సీఎం అయిన దగ్గర నుండి ఇండస్ట్రీ పెద్దలు ఎందుకనో చిన్నచూపు చూస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.;

Update: 2024-12-21 12:26 GMT
Revanth and Allu Arjun

తెలుగు సినిమా ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడింది ? ఇపుడిదే ప్రశ్న అందరిలోను పెరిగిపోతోంది. మామూలుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇండస్ట్రీ పెద్దలు మంచి సంబందాలే నెరుపుతారు. ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు కూడా తెలుగు సినీఇండస్ట్రీ(Telugu Cine Industry)తో మంచి సంబంధాలనే కోరుకుంటారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా ఉన్నవారంతా ఇండస్ట్రీ పెద్దలతో బాగా సన్నిహితంగా ఉన్నవారే. అయితే రేవంత్ సీఎం అయిన దగ్గర నుండి ఇండస్ట్రీ పెద్దలు ఎందుకనో చిన్నచూపు చూస్తున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎందుకంటే రేవంత్(Revanth) ను ఇండస్ట్రీలోని పెద్దలు కలిసిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇండస్ట్రీలోని పెద్దలు బీఆర్ఎస్(BRS) హయాంలో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) లేదా సినిమాటోపోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో తరచూ భేటీ అయ్యేవారు.

ఎవరికి ఏ అవసరమో తెలీదు కాని భేటీలైతే గత ప్రభుత్వంలో రెగ్యులర్ గా జరిగేవి. అయితే అలాంటి భేటీలు గడచిన ఏడాదిలో జరిగినట్లు ఎక్కడా ప్రచారంలో లేదు. ఎవరైనా చిరంజీవి లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు కలిస్తే ముఖ్యమంత్రయిన కొత్తలో రేవంత్ ను కలిసుండచ్చంతే. పైగా నంది అవార్డుల స్ధానంలో గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నట్లు రేవంత్ చేసిన ప్రతిపాదన లేదా ప్రకటనకు సినీపెద్దల నుండి సానుకూలంగా స్పందన కనబడలేదు. పైగా కొందరు ఆఫ్ ది రికార్డంటు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇపుడు విషయం ఏమిటంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజు శనివారం రేవంత్ మాట్లాడుతు పుష్ప సినిమా(Pushpa Movie) హీరో అల్లుఅర్జున్(Allu Arjun) మీద విరుచుకుపడ్డారు. తాను సీఎంగా ఉన్నంతవరకు సినిమా టికెట్ల రేట్లుపెరగవు, ఏసినిమాకూ బెనిఫిట్ షోలకు అనుమతులుండవని ప్రకటించారు. రేవంత్ తాజాప్రకటన పరిశ్రమలోని పెద్దలను కలవరానికి గురిచేసేది అనటంలో సందేహంలేదు.

హీరోలకు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చుకుని ఆ డబ్బులను తిరిగి జనాల నుండి బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతో టికెట్ల రేట్లను ఇష్టమొచ్చినట్లు పెంచుకుని రాబట్టుకుంటున్నారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మహిళ చనిపోగా ఆమె కొడుకు కోమాలో ఉన్నాడు. అప్పటినుండి సినిమా యూనిట్ పై రేవంత్ బాగా మండిపోతున్నారు. అల్లుఅర్జున్ మీద కేసు నమోదుచేసి అరెస్టు చేయటం సంచలనమైపోయింది. సినిమా యూనిట్ మీద రేవంత్ కు ఎంత మంటుంటే అల్లు అర్జున్ మీద కేసుపెట్టి పోలీసులు అరెస్టుచేయగలరు ? అలాగే తొక్కిసలాట జరిగినపుడు థియేటర్లో అల్లుఅర్జున్ ప్రవర్తనపైన అసెంబ్లీలో రేవంత్ చెప్పిన మాటలు ఇపుడు బాగా చర్చనీయాంశమవుతోంది.

అల్లుఅర్జున్ను ఉద్దేశించి రేవంత్ మానవత్వంలేని మనిషి అని వర్ణించటం సంచలనమైపోయింది. రేవంత్ లోని మంట అల్లుఅర్జున్ మీదేనా లేకపోతే మొత్తం సినీఇండస్ట్రీ మీదనా అన్నచర్చ ఇపుడు బాగా జరుగుతోంది. ఈమధ్యనే అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేసింది. కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయటం అప్పట్లో ఎంతసంచలమైందో అందరికీ తెలిసిందే. ఈమధ్యనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతు సమంత(Samantha)ను తనదగ్గరకు పంపించమని నాగార్జునపైన కేటీఆర్ ఒత్తిడి పెట్టారని చేసిన ఆరోపణలు ఎంత కలకలం సృష్టించాయో తెలిసిందే. సినీఇండస్ట్రీ నుండి నాగార్జునకు మద్దతుగా ప్రకటనలు వెలువడితే మంత్రిని రేవంత్ కనీసం మందలించనుకూడా లేదు. మంత్రికి కేటీఆర్ మీద కోపముంటే మధ్యలో నాగార్జున పరువును రోడ్డుమీదకు లాగాల్సిన అవసరంలేదు.

కేటీఆర్-కొండాసురేఖ(Konda Surekha) వివాదంలో మంత్రి సమంతను ఎందుకు లాగిందో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇలాంటి వివాదం రేవంత్ స్ధానంలో ఇంకోళ్ళుంటే డీల్ చేసే విధానం మరోలాగుండేది. అయితే ఇక్కడున్నది రేవంత్ కాబట్టి అసలా వివాదాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలాంటి ఘటనలను చూసిన తర్వాత ఎక్కడో సినీ ఇండస్ట్రీతో రేవంత్ కు బాగా చెడిందన్న విషయం అర్ధమైపోతోంది. అయితే ఎక్కడ చెడిందన్నది మాత్రం తెలీటంలేదు. సీఎంగా రేవంత్ ఉన్నంతకాలం తెలుగు సినీ ఇండస్ట్రీకి గడ్డు పరిస్ధితులు తప్పవేమో అనే ప్రచారం పెరిగిపోతోంది. టికెట్ల రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలుండవని రేవంత్ చేసిన ప్రకటన సినీపెద్దల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తాయనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News